Share News

రాళ్లు... రౌడీలు..

ABN , Publish Date - May 27 , 2024 | 11:12 PM

వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసు శాఖ పూర్తిగా ఆ పార్టీ నాయకుల సేవలో మునిగిపోయిందన్న విమర్శలు ఎదుర్కొంది. తాడిపత్రిలో మరింత ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. అదే పరిస్థితి కొనసాగుతోంది.

రాళ్లు... రౌడీలు..
ఈనెల 14న తాడిపత్రి జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఇరువర్గాల బాణసంచా దాడులు

టీడీపీవారిపైనే ఎక్కువగా రౌడీ షీట్లు

తాడిపత్రి జాబితాపై పోలీసుల గోప్యత

యాడికిలో 26 మంది టీడీపీ.. 11 మంది వైసీపీ..

యువకులు.. వృద్ధులపైనా పోలీసుల కఠిన వైఖరి

మూలాలను వదిలి.. సామాన్యులను బలిపెట్టారా..?

తాడిపత్రి టౌన/యాడికి, మే 27: వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసు శాఖ పూర్తిగా ఆ పార్టీ నాయకుల సేవలో మునిగిపోయిందన్న విమర్శలు ఎదుర్కొంది. తాడిపత్రిలో మరింత ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. అదే పరిస్థితి కొనసాగుతోంది. పోలింగ్‌ నేపథ్యంలో రెండు రోజులపాటు జరిగిన గొడవల కేసుల్లోనూ టీడీపీ వారినే ఎక్కువగా టార్గెట్‌ చేస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్కరిని వదలకుండా రాళ్లదాడి కేసులో ఇరికించే ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రబోధానంద ఆశ్రమం వద్ద వినాయక విగ్రహాల ఊరేగింపు సందర్భంగా 2018లో హింస చెలరేగింది. అప్పట్లో వందలాదిమందిపై కేసులు బనాయించారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ కేసుల ఆధారంగా టీడీపీ వారిని టార్గెట్‌ చేశారు. ఇప్పుడు కూడా అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని టీడీపీ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పద్ధతులు పాటించారా..?

చాలా కేసుల్లో నిందితులుగా ఉన్నా.. పోలీసులు వారిలో మార్పుకోసం ప్రయత్నిస్తారు. కౌన్సెలింగ్‌ ఇస్తారు. తప్పదు అనుకుంటేనే రౌడీషీట్‌ ఓపెన చేస్తారు. కానీ తాడిపత్రి గొడవల్లో ఒకేసారి వందమందికి పైగా నిందితులపై రౌడీషీట్లు తెరిచారు. వీరిలో ఎక్కువమంది టీడీపీ వర్గీయులే ఉన్నట్లు స్పష్టమౌతోంది. దీనికి వెనుక ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయో అన్న చర్చ జరుగుతోంది. రాళ్లదాడిలో పాల్గొన్నందుకే రౌడీషీట్‌ ఓపెన చేయడం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యాడికి మండలంలో 20, 21 ఏళ్ల యువకులపై కూడా రౌడీషీట్‌ తెరిచారు. ఇలా చేస్తే వారి భవిష్యత్తు ఏమౌతుందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రౌడీషీట్‌ ఉన్న వ్యక్తులకు 60 ఏళ్లు పైబడితే షీట్‌ తొలగించడం పరిపాటి. కానీ కోనుప్పలపాడులో తాజాగా 74 ఏళ్ల వృద్ధుడిపై రౌడీషీట్‌ తెరవడం విస్మయం కలిగిస్తోంది.

మర్మమేమిటో..?

తాడిపత్రి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నేర చరిత్ర ఉన్న 300 మందిపై రౌడీ షీట్‌ తెరిచారు. మార్పు కోసం ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. దీనిపై ఏ విమర్శలూ లేవు. కానీ తాజాగా ఒకేసారి 150 మందిపై రౌడీషీట్‌ ఓపెన చేయడం చర్చనీయాంశమైంది. ఏ ప్రాతిపదికన ఒకే రోజు ఇంతమందిపై రౌడీషీట్‌ తెరిచారన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఏ పోలీసు అధికారిని అడిగినా దీని గురించి మాట్లాడేందుకు విముఖత చూపుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెండు పార్టీలవారిని నియంత్రించవచ్చని పోలీసులు భావిస్తున్నారా..? అలా అయితే నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కదా..? అని జనం చర్చించుకుంటున్నారు.

జాబితాపై గోప్యత

ఎన్నికల గొడవల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 159 మందిపై రౌడీ షీట్లు తెరిచారు. ఇందులో ఒక్క తాడిపత్రిలోనే 106 మంది ఉన్నారు. యాడికి మండలం కోనుప్పలపాడులో 37 మంది, పెద్దవడుగూరు మండలం దిమ్మగుడిలో ఏడుగురిపై రౌడీషీట్‌ తెరిచారు. పోలింగ్‌ రోజున కోనుప్పలపాడులో జరిగిన ఘర్షణ కేసులో 26 మంది టీడీపీ వర్గీయులు, 11 మంది వైసీపీ వర్గీయులు ఉన్నారు. వీరందరిపై రౌడీ షీట్‌ తెరిచామని పోలీసులు స్పష్టత ఇచ్చారు. కానీ తాడిపత్రిలో మాత్రం జాబితాను బయట పెట్టడం లేదు. ఇక్కడ కూడా టీడీపీ వర్గీయులనే ఎక్కువగా జాబితాలో చేర్చి ఉంటారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

మరో ఐదుగురి అరెస్టు

తాడిపత్రి రాళ్లదాడి కేసులో సోమవారం మరో ఐదుగురిని అరెస్టు చేశామని పట్టణ సీఐ నాగేంద్రప్రసాద్‌ తెలిపారు. టీడీపీ నాయకుడు పేరం రవి, వైసీపీ నాయకుడు సజ్జలదిన్నె రాజు, ఇరుపార్టీల మద్దతుదారులు నాగేంద్రగౌడ్‌, అబ్దుల్‌షాకీర్‌, గోకుల మహేష్‌ అరెస్టయినవారిలో ఉన్నారు. వీరిని ఉరవకొండ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కడప జైలుకు రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు.

Updated Date - May 27 , 2024 | 11:12 PM