Share News

యురేనియంకు బ్రేక్‌

ABN , Publish Date - Nov 13 , 2024 | 05:31 AM

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కర్నూలు జిల్ల్లాలోని కప్పట్రాళ్ల సహా 15 గ్రామాల ప్రజలకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

యురేనియంకు బ్రేక్‌

కర్నూలు జిల్లాలో బోర్ల తవ్వకాల ప్రక్రియ నిలిపివేత

ఇకపై ఏ విధంగానూ ముందుకెళ్లొద్దు

అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

ప్రజల ఆందోళనల దృష్ట్యా నిర్ణయం

ప్రక్రియను ఆపేస్తున్నామని కలెక్టర్‌ ప్రకటన

యురేనియంపై తవ్వకాలు, ప్రజల

ఆందోళనలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు

కర్నూలు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కర్నూలు జిల్ల్లాలోని కప్పట్రాళ్ల సహా 15 గ్రామాల ప్రజలకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపేయాలని సీఎం చంద్రబాబు మంగళవారం అధికారులను ఆదేశించారు. ప్రజల ఆందోళన దృష్ట్యా ఇకపై ఈ అంశంలో ఎలాంటి ప్రక్రియ కొనసాగించొద్దని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలపై కలెక్టరు పి.రంజిత్‌ బాషా స్పందించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్ల తవ్వకాలు జరపబోమని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో 468.25 హెక్టార్ల విస్తీర్ణంలో కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌ భూములు ఉన్నాయి. కౌలుట్లయ్యమలగా గుర్తింపు ఉన్న ఈ ప్రాంతం ఆదోని రేంజ్‌ పత్తికొండ సెక్షన్‌ కిందకు వస్తుంది. ఈ కొండపై కౌలుట్లయ్య స్వామి ఆలయం ఉంది. ఈ అటవీ భూముల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాథమిక సర్వేలో గుర్తించారు. భూగర్భంలో ఎంత లోతులో, ఎంత పరిమాణంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించిన తర్వాతే తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. అటవీ భూముల్లో ఖనిజాల అన్వేషణ చేపట్టాలంటే కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలో యురేనియం నిల్వలు ఎంత పరిమాణంలో నిక్షిప్తమై ఉన్నదీ నిర్ధారణ కోసం 6.80 హెక్టార్లలో 68 బోర్ల తవ్వకానికి అటామిక్‌ మినరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ రీజినల్‌ డైరెక్టర్‌కు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. 2022-23లో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రక్రియ అంతా జరిగింది.

ఆందోళనల బాటలో వేలాది మంది

యురేనియం తవ్వకాలపై అక్టోబరు 18న ‘యురేనియం అలజడి! శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత యురేనియం సమస్య, తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనల వార్తలను ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటన ‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌ అని కప్పట్రాళ్ల, సమీప గ్రామాల ప్రజలు కొనియాడారు. ‘యురేనియం తవ్వకాలు వద్దే వద్దు.. మా ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు..! సేవ్‌ కప్పట్రాళ్లమల.. సేవ్‌ పల్లెసీమలు..!’ అంటూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కప్పట్రాళ్ల బొజ్జమ్మ, కప్పట్రాళ్ల గ్రామ సర్పంచి చెన్నమ్మనాయుడు, టీడీపీ మండల కన్వీనర్‌ విజయ భాస్కరగౌడ్‌, నాయకులు మల్లికార్జున, బంటుపల్లి వెంకటస్వామి గౌడ్‌, బేతపల్లి సర్పంచి మహేశ్వరరెడ్డి, పి.కోటకొండ సర్పంచి తిమ్మక్క, ఆమె భర్త లింగన్న, పల్లెమలి రంగడు, సుభాన్‌ తదితరుల ఆధ్వర్యంలో 12 గ్రామాలు ఏకమయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన జనం కప్పట్రాళ్లమలలో వెలసిన కౌలుట్లయ్య స్వామి క్షేత్రంలో సమావేశమయ్యారు. ‘యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం, కౌలుట్లయ్యమలను కాపాడుకుందాం’ అని పిలుపుతో ఆందోళనలు చేశారు.


ప్రజలు ఆందోళన చెందవద్దు: కలెక్టరు రంజిత్‌

యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాలను ఆపేయాలంటూ కప్పట్రాళ్ల సహా వివిధ గ్రామాల ప్రజలు ఆందోళనను చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాం. ఈ ప్రక్రియను ఇంతటితో నిలిపివేయాలని, తవ్వకాలు చేయొద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రక్రియను ఇంతటితో ఆపేస్తున్నాం.

ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు: మంత్రి భరత్‌

అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ ప్రాంతంలో డ్రిల్లింగ్‌ గానీ, మరే ఇతర కార్యక్రమం గాని జరగదని మంత్రి అసెంబ్లీ వద్ద స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, అనవసరమైన వదంతులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందన్నారు. వైసీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కోరారు.

Updated Date - Nov 13 , 2024 | 05:31 AM