Share News

ఎన్నికల అక్రమాలపై నిఘా!

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:08 AM

ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి నిష్ణాతులైన విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతున్నట్లు సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీడీఎఫ్‌) కార్యదర్శి,

ఎన్నికల అక్రమాలపై నిఘా!

రంగంలోకి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ

13 ఉమ్మడి జిల్లాలకు పరిశీలకులు

గుంటూరు(కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 23: ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి నిష్ణాతులైన విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతున్నట్లు సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీడీఎఫ్‌) కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తెలిపారు. ఓటర్లను చైతన్యపరచడానికి రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మార్టూరు, శ్రీకారం కళాపరిషత్‌ రూపొందించిన ఐదు లఘు చిత్రాలను మంగళవారం గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లఘు చిత్రాల ద్వారా ఓటర్ల ఆలోచన, భావాల్లో పెను మార్పులు తీసుకురావచ్చన్నారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ తరఫున ఎన్నికల అక్రమాలపై నిఘాకు మే 9 నుంచిపరిశీలకులు క్షేత్రస్థాయిలో పనిచేస్తారని తెలిపారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కృషి ఫలితంగా వలంటీర్లను ఎన్నికల విధులకు దూరం చేయగలిగామని చెప్పారు. మే 1, 2 తేదీల్లో పెన్షన్‌దారులకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఓటు అమ్ముకోవద్దని, విద్యావంతులు తప్పకుండా ఓటింగ్‌లో పాల్గొనాలని, మంచి పరిపాలన, అభివృద్ధికి తోడ్పడే అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఆలోచనలను లఘు చిత్రాలు అందించాయని చెప్పారు. కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.రంగయ్య, పారదర్శక ఎన్నికల పర్యవేక్షణ సమితి కన్వీనర్‌ పి.వి.మల్లికార్జునరావు, ప్రముఖ ఇంజనీర్‌ కుర్రి రామసుబ్బారావు, సూర్య ఇన్వెస్టిగేషన్‌ వ్యవస్థాపకుడు కాళహస్తి సత్యనారాయణ, తెలుగు భాషోద్యమ సమాఖ్య కన్వీనర్‌ వి.సింగారావు, ప్రముఖ రంగస్థల నటుడు నాయుడు గోపి, ప్రముఖ న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు, ప్రముఖ దర్శకుడు చిట్టినేని శివకోటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.

Updated Date - Apr 24 , 2024 | 03:08 AM