Share News

సుప్రీంకూ అదే స్ర్కిప్టు!

ABN , Publish Date - May 22 , 2024 | 04:22 AM

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై జేపీ వెంచర్స్‌కు ఎన్జీటీ భారీ పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. ట్రైబ్యునల్‌ తీర్పుపై సుప్రీంకోర్టులో జేపీ వెంచర్స్‌ అప్పీల్‌చేయగా స్టే లభించింది.

సుప్రీంకూ అదే స్ర్కిప్టు!

ఎన్జీటీకి ఇచ్చినట్లు ‘మన’ ఫార్మాట్‌లోనే ఉండాలి

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు కళ్లకు గంతలు కట్టేందుకు ఓ ముఖ్య అధికారి మంత్రాంగం మొదలుపెట్టారు. ఇసుక రీచ్‌ (బీ2)ల్లో అసలు తవ్వకాలే జరగడం లేదని.. ఇంతకు ముందు కూడా తవ్వలేదని.. అక్కడ కనీసం మనిషి నడిచిన ఆనవాళ్లు కూడా కనిపించడం లేదంటూ నివేదిక ఇవ్వాలని కలెక్టర్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. అంతా ఒక్క మాట మీద నిలబడి.. గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి ఇచ్చినట్లుగా.. ఏ అక్రమాలూ లేవన్న ఏకవాక్య ఫార్మాట్‌కు కట్టుబడి ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది.

ఇసుక తవ్వకాల్లో అక్రమాలే లేవని చెప్పండి

తవ్వకాలు, అక్రమాల్లేవని రిపోర్టు ఇవ్వండి

కలెక్టర్లపై ముఖ్య అధికారి, వసూల్‌ రాజా ఒత్తిళ్లు

వారికి నేరుగా నీలకంఠుడి ఫోన్లు

అందరూ ఇదే పాటించాలని స్పష్టీకరణ

భిన్నంగా పంపితే తెలిసిపోతుందని బెదిరింపు

మీరే దొరికిపోతారని బ్లాక్‌మెయిలింగ్‌

పెద్దలు చెప్పినట్లు చేస్తే కోర్టుతో సమస్య

అందుకు భిన్నంగా వెళ్తే పెద్దలతో తంటా

ఒత్తిళ్లతో నలిగిపోతున్న కలెక్టర్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై జేపీ వెంచర్స్‌కు ఎన్జీటీ భారీ పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. ట్రైబ్యునల్‌ తీర్పుపై సుప్రీంకోర్టులో జేపీ వెంచర్స్‌ అప్పీల్‌చేయగా స్టే లభించింది. తాజాగా ఈ కేసు విచారణకొచ్చింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఇదివరకు జేపీ వెంచర్స్‌, ఇప్పుడు కొత్త కాంట్రాక్టు సంస్థలైన ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీలు కూడా అక్రమ తవ్వకాలు చేస్తున్నాయంటూ గుంటూరుకు చెందిన నాగేంద్రకుమార్‌ సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన కోర్టు.. ఎన్జీటీ ఆదేశాలను ఏపీ సర్కారు, రెండు కాంట్రాక్టు సంస్థలు ఉల్లంఘించినట్లు ప్రాఽథమికంగా నిర్ధారించింది. ఈ నేపఽథ్యంలో ఎంపిక చేసిన రీచ్‌ల్లో జిల్లా కలెక్టర్లు, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిపుణుల కమిటీలు వేర్వేరుగా పరిశీలన చేసి నివేదికలు ఇవ్వాలని ఈ నెల 11వ తేదీన ఆదేశించింది. కలెక్టర్లు ఇసుక రీచ్‌లను సందర్శించి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆధారాలతో కోర్టుకు నివేదించాలి. అయితే ఈ నివేదికలు ఎలా ఉండాలన్నదానిపై జగన్‌ ప్రభుత్వానికి ఓ స్పష్టత ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్జీటీకి 26 జిల్లాలకుగాను 23 జిల్లాల కలెక్టర్లు ఒకే ఫార్మాట్‌లో నివేదిక ఇచ్చారు. తాము తనిఖీ చేసిన ఇసుక రీచ్‌ల్లో ఇంతకు ముందు మైనింగ్‌ చేసిన ఆనవాళ్లు లేవని.. ఇప్పుడు ఇసుక తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు లేవని.. భారీ యంత్రాలను ఉపయోగించలేదని వారు పేర్కొన్నారు. మిగతా మూడు జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో ఇసుక రీచ్‌లే లేవని నివే దించారు.


ఈ నివేదికలను చూసి ఎన్జీటీ విస్మయం వ్యక్తం చేస్తూ నివేదికలన్నీ ఒకే ఫార్మాట్‌లో ఉన్నాయేమిటి.. ముందే మాట్లాడుకుని రాశారా అని ప్రశ్నించింది. వారి నివేదికలకు పూర్తి భిన్నంగా కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ నిపుణుల జాయింట్‌ కమిటీ రిపోర్టులు ఉన్నాయి. కృష్ణా, గోదావరి, నాగావళి, వంశధార నదుల పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా రెండు టన్నుల బకెట్‌ సామర్ధ్యం కలిగిన జేసీబీలను ఉపయోగిస్తున్నారని ఆధారాలతో కేంద్ర బృందం ఎన్జీటీకి నివేదికలు ఇచ్చింది. ప్రభుత్వ పెద్దల ఆదేశం మేరకే కలెక్టర్లు ఏకవాక్య నివేదికలు ఇచ్చార ని తేలిపోయింది. అయితే అప్పటికే జేపీ వెంచర్స్‌ సుప్రీంకోర్టు నుంచి స్టే పొందడంతో ఎన్జీటీ తీర్పు ఇవ్వలేదు. కేసును సుప్రీంకోర్టుకే అప్పగించింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును విచారించి మరోసారి ఇటు కలెక్టర్లు, ఇటు కేంద్ర బృందం వేర్వేరుగా విచారణ జరపాలని ఆదేశించింది. కలెక్టర్లు సుప్రీంకోర్టుకు ఇచ్చే నివేదికల విషయంలోనూ సేమ్‌ స్ర్కిప్టును అమలు చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఎన్జీటీని తప్పుదోవ పట్టించినట్లుగానే సుప్రీంకోర్టుకు కూడా సింగిల్‌ ఫార్మాట్‌ నివేదికలు ఇప్పించాలని నిర్ణయించారు. ‘మా జిల్లాల పరిధిలో ఇంత కు ముందు గానీ, ఇప్పుడు గానీ ఇసుక తవ్వకాలకు భారీ యంత్రాలను ఉపయోగించడం లేదు. అక్రమ తవ్వకాలనేవే లేవు’ అని ఒకే ఫార్మాట్‌లో రిపోర్టులివ్వాలని కలెక్టర్లకు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ముఖ్య అధికారి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.

కలెక్టర్ల నివేదిక ఎలా ఉండాలో గనుల శాఖ ఉన్నతాధికారి ఓ ఫార్మాట్‌ను రూపొందించారు. దాని ప్రకారమే కలెక్టర్లు అక్షరం పొల్లుపోకుండా నివేదిక ఇవ్వాలని ముఖ్య అధికారి వారితో ఇప్పటికి మూడుసార్లు ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. అయితే కోడ్‌ తర్వాత కొన్ని జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు. గత ఫిబ్రవరిలో వారికంటే ముందున్న కలెక్టర్లు ఇచ్చిన నివేదికలను వారికి గుర్తుచేస్తూ అదే ఫార్మాట్‌లో నివేదికలు ఇవ్వాలని ముఖ్య అధికారి ఒత్తిడి చే స్తున్నారు. ఇక ఇదే విషయంపై ముఖ్యనేత వద్ద పనిచేస్తున్న వసూల్‌ రాజా రంగంలోకి దిగారు. కలెక్టర్లకు నాలుగు రోజుల క్రితం ఫోన్‌ చేసినట్లు తెలిసింది. ‘మళ్లీ జగనే సీఎంగా రాబోతున్నారు. మనం ఇంతకు ముందు నిర్ణయించిన ఫార్మాట్‌లోనే నివేదికలు తయారు చేయండి. ఎన్జీటీకి ఒకలా, సుప్రీంకు మరోలా నివేదికలు ఇస్తే మీరే దొరికిపోతారు. నివేదికలు తారుమారైతే మీరే దోషులుగా సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. జగన్‌ సార్‌ వచ్చాక కూడా మీరే కలెక్టర్లుగా కొనసాగుతారు. కాబట్టి మన ఫార్మాట్‌లోనే పంపండి’ అని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. తాజాగా గత రెండ్రోజులుగా వసూల్‌ రాజా వద్ద ఉన్న ఓ నీలకంఠుడు ఇదే విషయమై వారితో మాట్లాడుతున్నట్లు తెలిసింది. ’సార్‌ చెప్పిన దానికి భిన్నంగా మీరు ఏం పంపినా మాకు ఇక్కడ తె లిసిపోతుంది’ అని బెదిరిస్తున్నట్లు సమాచారం.

కలెక్టర్లకు విషమ పరీక్షే..

ఇసుక అక్రమ తవ్వకాలపై కలెక్టర్లతోపాటు కేంద్ర, అటవీ, పర్యావరణ శాఖలోని నిపుణుల బృందం కూడా సుప్రీంకోర్టుకు వేర్వేరుగా నివేదికలు ఇవ్వనుంది. ఇది ఒకరకంగా కలెక్టర్లకు విషమ పరీక్ష లాంటిదే. ప్రభుత్వ పెద్దలు, ముఖ్య అధికారి, వసూల్‌ రాజా కోరిక మేరకు నివేదికలు ఇస్తే.. వాటితో కేంద్ర బృందం రిపోర్టులకు పొంతన లేకుండా ఉంటే కలెక్టర్లు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురవుతారు. వాస్తవాలకు భిన్నంగా నివేదికలు ఇస్తే తాము అడ్డంగా దొరికిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - May 22 , 2024 | 04:22 AM