Share News

సుగాలి ప్రీతి కేసు సీఐడీకి

ABN , Publish Date - Aug 28 , 2024 | 03:13 AM

తన కుమార్తె సుగాలి ప్రీతి హత్యాచార కేసును సీఐడీకి అప్పగిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చినట్లు ప్రీతి తల్లి పార్వతీదేవి వెల్లడించారు.

సుగాలి ప్రీతి కేసు సీఐడీకి

హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు.. మీడియాతో ప్రీతి తల్లి పార్వతి

అమరావతి, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): తన కుమార్తె సుగాలి ప్రీతి హత్యాచార కేసును సీఐడీకి అప్పగిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చినట్లు ప్రీతి తల్లి పార్వతీదేవి వెల్లడించారు. ఈ కేసును రీఓపెన్‌ చేసి, సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌తో విచారణ చేయిస్తామని హోంమంత్రి చెప్పారని ఆమె తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయంలో హోం మంత్రి అనితను ఆమెతోపాటు జనసేన నాయకుడు హర్షద్‌, ప్రజా సంఘాల నాయకుడు బాలసుందరం కలిసి, కేసు పూర్వా పరాలను వివరించారు. ప్రీతికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం పార్వతీదేవి మీడియాతో మాట్లాడుతూ, ‘కర్నూలులో 2017లో నా కుమార్తెను కొందరు అత్యాచారం చేసి అన్యాయంగా చంపేశారు. నిందితులను అప్పట్లో అరెస్టు చేసి జైలుకు పంపినా, కొద్దిరోజులకే విడుదల చేసేశారు. మాకు న్యాయం చేయలేదు. బాధితురాలికి న్యాయం జరగకపోతే రోడ్లపైకి వస్తానంటూ జగన్‌ సర్కారును హెచ్చరిస్తూ.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ 2020లో కర్నూలులో నిరసన ర్యాలీ చేశారు. తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు జగన్‌ ప్రభుత్వం చెప్పినా, తప్పుడు జీవో ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది. ఏడేళ్లుగా ఎంతోమంది నేతలను కలిసి న్యాయం కోరినా జరగలేదు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ మా కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచనలో ఉన్నారని హోంమంత్రి భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని చెప్పారు.

Updated Date - Aug 28 , 2024 | 07:11 AM