Share News

పోస్టింగ్‌ ఇప్పించండి

ABN , Publish Date - May 19 , 2024 | 03:32 AM

కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌(క్యాట్‌) తీర్పును అనుసరించి తనకు పోస్టింగ్‌ ఇప్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శనివారం లేఖ రాశారు.

పోస్టింగ్‌ ఇప్పించండి

ఎన్నికల కమిషన్‌కు ఏబీవీ లేఖ

సీఈసీకి పంపిన సీఈవో

అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌(క్యాట్‌) తీర్పును అనుసరించి తనకు పోస్టింగ్‌ ఇప్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శనివారం లేఖ రాశారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న తనకు పోస్టింగ్‌ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని, న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోనే అందరికన్నా సీనియర్‌ ఐపీఎస్‌ అయిన తన సస్పెన్షన్‌ చెల్లదంటూ పది రోజుల క్రితమే క్యాట్‌ తీర్పు ఇచ్చిందంటూ లేఖతోపాటు ఆ కాపీని జత చేశా రు. ఈ లేఖను సీఈవో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపించారు. సీఈసీ నిర్ణయం మేరకు ఏబీవీకి పోస్టింగ్‌ లభించే అవకాశం ఉంది.

పోలింగ్‌ ముగిసినా స్పందించని సర్కారు

రాష్ట్రంలో ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏ తప్పూ చేయని ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపులకు పాల్పడింది. అసలు కొనుగోలే చేయని పరికరాల్లో అవినీతి జరిగిందంటూ ఆయనపై సస్పెన్షన్లు విధిస్తూ వేధించింది. న్యాయ పోరాటం చేస్తున్న వెంకటేశ్వర రావుకు ఈ నెల 8న క్యాట్‌ తీర్పు పెద్ద ఉపశమనాన్ని కల్పించింది. తీర్పు వచ్చిన మూడు రోజుల్లోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డిని కలిసిన ఏబీవీ.. తనకు పోస్టింగ్‌ ఇవ్వాలని దరఖాస్తు సమర్పించారు. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున సీఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉందని చెప్పిన సీఎస్‌ నుంచి, ఆ తర్వాత కూడా ఎలాంటి స్పందనా లేకపోవడంతో నేరుగా రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ అందజేశారు.

Updated Date - May 19 , 2024 | 03:33 AM