Share News

అరాచక పార్టీతో పోరాటం

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:56 AM

‘రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఏపీ గతిని మారుస్తాయి. ఈ ఎన్నికల్లో మన కూటమి పోరాడుతున్నది అరాచకాన్ని, హింసను, కక్ష సాధింపునూ నమ్ముకున్న పార్టీతో అని మరచిపోవద్దు’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన

అరాచక పార్టీతో పోరాటం

ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలి

టీడీపీ, బీజేపీతో సమన్వయంతో వెళ్లాలి

ఒత్తిళ్లు వస్తే వెంటనే పార్టీ దృష్టికి తేవాలి

జనసేన అభ్యర్థులకు పవన్‌ దిశానిర్దేశం

అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ‘రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఏపీ గతిని మారుస్తాయి. ఈ ఎన్నికల్లో మన కూటమి పోరాడుతున్నది అరాచకాన్ని, హింసను, కక్ష సాధింపునూ నమ్ముకున్న పార్టీతో అని మరచిపోవద్దు’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అభ్యర్థులు, నాయకులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ‘ఈ ఎన్నికల్లో మనం కచ్చితంగా గెలిచి తీరాలి. ఎన్నికల ప్రక్రియలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలి. టీడీపీ, బీజేపీ నాయకులు, శ్రేణులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. ప్రతి దశలోనూ అభ్యర్థులు, నాయకులు, శ్రేణులు అప్రమత్తంగా అడుగులు వేయాలి. ఏ విధమైన ఒత్తిళ్లు వచ్చినా తక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమావళి, నామినేషన్‌ దాఖలు నుంచి పోలింగ్‌ వరకూ ఉండే వివిధ దశలు, నియమ నిబంధనలు, పొందాల్సిన అనుమతులను తెలియచేసే పత్రాలను అందించారు. అధినేతను కలిసిన వారిలో కందుల దుర్గేశ్‌, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణ, లోకం మాధవి, పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, పత్సమట్ల ధర్మరాజు, దేవ వరప్రసాద్‌, పంచకర్ల రమేశ్‌ బాబు, వంశీకృష్ణ యాదవ్‌, సుందరపు విజయ్‌కుమార్‌, ఆరణి శ్రీనివాసులు ఉన్నారు.

ఉమ్మడి ప్రభుత్వంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యం: నాగబాబు

‘విద్య, వైద్యం, ఉపాధి అనేవి జనసేన పార్టీకి అత్యంత ప్రధానమైనవి. సామాన్యులకు నిత్యం అవసరమయ్యే ఈ మూడు అంశాలను అధికారంలో ఉన్న పార్టీ గాలికి వదిలేసింది’ అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కే నాగబాబు ఆరోపించారు. ఈ మధ్య కాలంలో ప్రమాదానికి గురై మరణించిన 62 మంది క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.3.10 కోట్ల విలువైన బీమా చెక్కులు కార్యకర్తల కుటుంబాలకు ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘జనసేన పార్టీకి ఎలాంటి అధికారం లేకపోయినా పార్టీ కార్యకర్తలకు అధినేత పవన్‌ భరోసా ఇస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన జనసైనికులు, వీర మహిళలకు భరోసా ఇచ్చేలా క్రీయాశీలక బీమా పథకం జనసేన పార్టీ తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ 255 మందికి పైగా బీమా చెక్కులను అందించాం. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేసేలా ప్రణాళికలు ఉంటాయి. ఈ ప్రభుత్వం పతనమైన తర్వాత రాష్ట్రానికి నవశకం రాబోతుంది’ అని పేర్కొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 04:56 AM