Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

బరితెగించిన గంజాయి ముఠా

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:32 AM

శ్రీకాకుళం జిల్లా పలాసలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. కంటైనర్‌ లారీలో గంజాయిని చెన్నైకి తరలిస్తుండగా అడ్డుకున్న పోలీసులను ఢీకొట్టేలా వాహనాన్ని పోనిచ్చారు.

బరితెగించిన గంజాయి ముఠా

ఎస్‌ఈబీ పోలీసులపైకి దూసుకెళ్లిన కంటైనర్‌

పలాసలో ఎస్‌ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు

విశాఖలో కంటైనర్‌ పట్టివేత.. 380 కిలోలు స్వాధీనం

పలాస(ఆనందపురం)విశాఖపట్నం, మార్చి 3: శ్రీకాకుళం జిల్లా పలాసలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. కంటైనర్‌ లారీలో గంజాయిని చెన్నైకి తరలిస్తుండగా అడ్డుకున్న పోలీసులను ఢీకొట్టేలా వాహనాన్ని పోనిచ్చారు. దీంతో ఎస్‌ఐతో సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం గారబంద వద్ద గంజాయిని కంటైనర్‌లో నింపి పలాస మీదుగా చెన్నై తరలిస్తున్నారని ఎస్‌ఈబీ పోలీసులకు సమాచారం అందింది. శనివారం అర్ధరాత్రి ఎస్‌ఈబీ ఎస్‌ఐ గోరు ప్రభాకర్‌, కానిస్టేబుల్స్‌ బొడ్డేపల్లి సురేష్‌, బలగాన సంతోశ్‌కుమార్‌ బృందం శ్రీకాకుళం జిల్లా పలాస జాతీయరహదారి నెమలినారాయణపురం వద్ద మాటు కాసింది. ఆదివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఆ కంటైనర్‌ లారీ రానే వచ్చింది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులపైకి దూసుకెళ్లడంతో ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్‌ గాయాలకు గురై ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. కంటైనర్‌ ఆగకుండా దూసుకుపోయింది. సమాచారం అందుకున్న విశాఖ జిల్లా ఆనందపురం పోలీసులు ఆ కంటైనర్‌ను గుర్తించారు. ఆపకుండా ముందుకు పోవడంతో.. 7కిలోమీటర్లు వెంబడించి.. పరదేశిపాలెం వద్ద పట్టుకున్నారు. అందులో జేసీబీ స్పేర్‌ పార్ట్స్‌ ఉన్నాయంటూ, పత్రాలు తీసుకువాస్తమని డ్రైవర్‌, క్లీనర్లు పరారయ్యారు. కంటైనర్‌ను స్టేషన్‌కు తరలించి తనిఖీ చేయగా 80 ప్యాకెట్ల (380కిలోలు) గంజాయి లభించింది. దీనివిలువ రూ.8లక్షలు ఉంటుందని సీఐ చెప్పారు. కాగా, గాయపడిన పలాస పోలీసులను శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్చారు.

Updated Date - Mar 04 , 2024 | 07:33 AM