Share News

ఆదినేపల్లె వద్ద ఆగిన నీళ్లు

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:05 AM

హంద్రీనీవా జలాలను కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా రామకుప్పానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి విడుదల చేసిన 2గంటల్లోనే కాలువలో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది.

ఆదినేపల్లె వద్ద ఆగిన నీళ్లు

లిఫ్ట్‌కు నీళ్లందకపోవడంతో పంపింగ్‌ ఆపివేత

రామకుప్పానికినీరందించేందుకు అష్టకష్టాలు

వి.కోట, ఫిబ్రవరి 26: హంద్రీనీవా జలాలను కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా రామకుప్పానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి విడుదల చేసిన 2గంటల్లోనే కాలువలో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. వి.కోట మండలం ఆదినేపల్లె వద్ద లిఫ్ట్‌కు నీరందకపోడంతో అధికారులు పంప్‌హౌస్‌ వద్ద పంపులను ఆపేశారు. దీంతో రాజుపేట వద్ద జగన్‌ నీటిని కిందకు విడుదల చేశాక కాల్వ ద్వారా నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఇదేంటని చూసేందుకు వెళ్లిన రైతులకు లిఫ్ట్‌ ద్వారా వచ్చే నీరు ఆగిపోవడం కనిపించింది. సీఎం అట్టహాసంగా కుప్పానికి నీరందించామనడంతో ఎంతో ఆనందపడ్డామని, తీరా కాల్వలో చూస్తే నీరు రాకపోవడంతో ఇది ఎన్నికల కోసం చేసిన హంగామాగా తేటతెల్లమైందని నివ్వెరపోయారు. పుంగనూరు నుంచి పెద్దపంజాణి, గంగవరం, బైరెడ్డిపల్లె, వి.కోట మీదుగా రామకుప్పానికి వచ్చిన జలాలు ఎక్కడా చెరువులకు వదలకపోవడంతో ఈ మాత్రమైనా చేరుకున్నాయి. అదే చెరువులకు నీరు నింపిఉన్నట్లైతే నీరు కుప్పానికి చేరేది కాదని అధికారులు గుసగుసలాడుతున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కుప్పానికి నీరందించామని చెప్పుకొనేందు వైసీపీ పెద్దలు తాపత్రయపడ్డారే తప్ప, చెరువులు నింపి నీటి కొరత తీర్చే ప్రయత్నం చేయలేదని స్థానిక రైతులు ప్రభుత్వ తీరును నిరసిస్తున్నారు. మొత్తానికి ఇరిగేషన్‌ అధికారులు రెండు నెలలు పడ్డ కష్టం రెండు గంటల్లోనే ఆవిరి కావడంతో అధికారులు అసంతృప్తికి లోనయ్యారు.

Updated Date - Feb 27 , 2024 | 09:27 AM