Share News

‘చంద్రగిరి’లో రాళ్లదాడి!

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:09 AM

తిరుపతి జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

‘చంద్రగిరి’లో రాళ్లదాడి!

వైసీపీ, టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత

తిరుపతిలో నామినేషన్‌ కేంద్రం వద్ద తోపులాటలు.. పరస్పర కవ్వింపులు

ఎమ్మెల్యే చెవిరెడ్డి వాహనంపై దాడి

తిరుపతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి), సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకటమణి ప్రసాద్‌(నాని) గురువారం నామినేషన్లు దాఖలు చేసేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో చంద్రగిరిలో వేర్వేరుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. పోటాపోటీగా జనసమీకరణ చేయడంతో వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. మోహిత్‌, ఆయన తండ్రి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆర్డీవో కార్యాలయంలోకి వెళ్లిన కాసేపటికి పులివర్తి నానీ కూడా లోనికి వెళ్లారు. వెలుపల టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తుండడంతో వైసీపీ కార్యకర్తలు ప్రతిగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పరస్పరం ఘర్షణ పడ్డారు. రాళ్లు, జెండా కర్రలతో దాడి చేసుకున్నారు. అయితే.. దీనిని ముందుగానే నియంత్రించాల్సిన పోలీసులు.. తాపీగా తేరుకుని.. వెంటనే లాఠీచార్జి చేశారు. అదికూడా టీడీపీ వారినే లక్ష్యంగా చేసుకుని చెదరగొట్టడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాస్కర రెడ్డి వాహనంపై జెండా కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

సూళ్లూరుపేటలో వైసీపీ నేతల బాహాబాహీ

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ ర్యాలీలో ఆ పార్టీకే చెందిన నెల్లూరు డీసీసీబీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌రెడ్డి బాహాబాహాకి దిగారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య ముందే ప్రచార రథంలో పరస్పరం తోపులాటకు దిగారు. నువ్వెంతంటే నువ్వెంతంటూ తొడగొట్టి.. చెప్పులతో కొట్టుకొనే వరకు దిగారు.

Updated Date - Apr 26 , 2024 | 04:09 AM