Share News

కడుపు నింపేవి.. కలుపు మొక్కలే!

ABN , Publish Date - Feb 26 , 2024 | 03:17 AM

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం గాజా వాసుల ఆకలి కేకలకు కారణమవుతోంది. ఇజ్రాయెల్‌పై దాడిలో ఐక్య రాజ్య సమితి(ఐరాస) అనుబంధ సంస్థ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ సిబ్బంది పాత్ర వెలుగులోకి వచ్చాక.. ఆ సంస్థ కూడా గాజా నుంచి పూర్తిగా వైదొలగింది.

కడుపు నింపేవి.. కలుపు మొక్కలే!

గాజాలో ఆహార సమస్య తీవ్రం

కలుపు మొక్కల్ని కొనుక్కొని తింటున్న ప్రజలు

జబాలియాలో గుర్రాల్నీ తింటున్న శరణార్థులు

రంజాన్‌లోగా కాల్పుల విరమణ?

ఖాన్‌యూని్‌స, ఫిబ్రవరి 25: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం గాజా వాసుల ఆకలి కేకలకు కారణమవుతోంది. ఇజ్రాయెల్‌పై దాడిలో ఐక్య రాజ్య సమితి(ఐరాస) అనుబంధ సంస్థ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ సిబ్బంది పాత్ర వెలుగులోకి వచ్చాక.. ఆ సంస్థ కూడా గాజా నుంచి పూర్తిగా వైదొలగింది. ఇంతకాలం శరణార్థులకు అన్నపానీయాలను అందించిన యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ గాజాను వీడడంతో.. ఆకలి కేకలు పెరిగాయి. ముఖ్యంగా 22 లక్షల జనాభాలో 80ు మంది దక్షిణ గాజాలోని రఫాలో తలదాచుకుంటుండగా.. ఆ ప్రాంతంలో ఆహార సమస్య తీవ్రమైంది. దాంతో ‘మాలో’ అనే కలుపు మొక్కలను సేకరిస్తున్న వ్యాపారులు.. ఒక కట్ట మొక్కలకు 80 ఇజ్రాయెలీ షాకెల్స్‌(భారత కరెన్సీలో సుమారు రూ.1,800) వసూలు చేస్తున్నారు. సాధారణంగా ఈ మొక్కను నోటి ఎలర్జీ, గొంతునొప్పి వంటి రుగ్మతలకు ఔషధంగా వాడుతారు. ఆహారంగా ఈ మొక్కను తీసుకోవడం ప్రమాదమని తెలిసినా.. ఆకలిని తట్టుకోవడానికి మరో మార్గం లేదని గాజా వాసులు వాపోతున్నారు. ఉత్తర గాజాలో మాత్రం నీరు, ఆహారం, ఔషధాల కొరత లేదని తెలుస్తోంది. అయితే.. గాజాకు ఉత్తరాన, వెస్ట్‌బ్యాంక్‌లోని జబాలియా శిబిరంలోనూ ఆకలి కేకలు తీవ్రమయ్యాయి. దీంతో.. గుర్రాలను చంపి, వంట చేసి, పిల్లల కడుపు నింపాల్సి వస్తోందని శరణార్థులు వాపోతున్నారు. 1.4 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన ఈ శిబిరంలో లక్ష మంది ఉండగా.. భిక్షమెత్తుకుని బతకాల్సిన పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రంజాన్‌లోపు కాల్పుల విరమణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈజిప్ట్‌ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Feb 26 , 2024 | 03:17 AM