స్టాక్స్ క్రేజ్!
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:00 AM
కరోనాకు ముందు వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో లక్షా పాతిక వేల సంఖ్యలో ఉండే ఇన్వెస్టర్లు (మధుపరులు) అనంతరం కాలంలో అనూహ్యంగా పెరిగిపోయారు.
స్టాక్ మార్కెట్ పట్ల ఉమ్మడి కృష్ణాజిల్లాలో క్రేజ్ పెరిగింది! స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి 4 లక్షల మందికిపైగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఉన్నారంటే ఏ రేంజ్‌లో ఆకర్షితులౌతున్నారో అర్థం చేసుకోవాల్సిందే. విజయవాడ నగరం 2.10 లక్షలతో అగ్రస్థానంలో ఉండగా, కంకిపాడు, మైలవరం, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు, పామర్రు, గన్నవరం, హనుమాన్ జంక్షన్, నున్న, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాలతో పాటు చిన్న ప్రాంతాలను కూడా కలుపుకుని మరో 1.90 లక్షలమంది ఇన్వెస్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారు కూడా స్టాక్ మార్కెట్ పట్ల ఆసక్తి చూపుతున్నారన్నది ఈ గణాంకాలను బట్టి అర్థమౌతోంది. - ఆంధ్రజ్యోతి, విజయవాడ
కరోనాకు ముందు వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో లక్షా పాతిక వేల సంఖ్యలో ఉండే ఇన్వెస్టర్లు (మధుపరులు) అనంతరం కాలంలో అనూహ్యంగా పెరిగిపోయారు. కరోనా తదనంతరం ఏడాది తర్వాత నుంచి స్టాక్ ఇన్వె్‌స్టమెంట్లు భారీగా పెరిగాయి. స్టాక్ మార్కెట్ వృద్ధి చెందుతున్నా అపోహల కారణంగా చాలామంది పెట్టుబడులు పెట్టడానికి స్టాక్ మార్కెట్స్ మంచివి కావని భావించటంతో ఇక్కడ ఇన్వెస్టర్ల సంఖ్య పెద్దగా ఉండేది కాదు. దేశీయ స్టాక్ మార్కెట్ నికరంగా పెరుగుతుండటం, స్టాక్స్‌తె ఇన్వె్‌స్టమెంట్ చేసినవారు భారీ లాభాలను ఆర్జించడంతో క్రమేపీ స్టాక్ మార్కెట్ వైపు అడుగులు పడ్డాయి. బ్యాంకులు, పోస్టాఫీసుల కంటే కూడా ఎక్కువ లాభాలను తెచ్చి పెడుతుండటంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు స్టాక్ మార్కెట్‌ను పర్యవేక్షించే వ్యవస్థలుండేవి కావు. మోసాలు జరిగేవి. సెబీ వచ్చాక పరిస్థితి మారింది. స్టాక్ మార్కెట్‌లో సిస్టమాటిక్ ఇన్వె్‌స్టమెంట్ ప్లాన్ (సిప్) వచ్చాక నష్టమంటూ ఉండటం లేదు. ఒకవేళ నష్టం వచ్చే పరిస్థితులుంటే ముందుగానే సేఫ్‌జోన్‌లోకి వెళ్లిపోయేలా ఈ సిప్స్ ఉంటున్నాయి. గతంలో ఇందులో పెట్టుబడులు ఎలా పెట్టాలి? ఎలాంటి షేర్లు కొనాలి? వంటి వాటి పట్ల కనీస అవగాహన ఉండేది కాదు. దీంతో స్టాక్ ఏజంట్స్ వ్యవస్థ పుట్టుకొచ్చింది. వీరి సాయంతో స్టాక్ మార్కెట్‌లోకి అడుగు పెట్టడం, వారు సూచించిన షేర్లను కొనటం చేస్తున్నారు. లాభాలు వచ్చినప్పుడు ఏజెంట్లు వీటిని విక్రయిస్తారు. తద్వారా పెట్టుబడిదారులకు లాభాలు వస్తున్నాయి. స్టాక్స్‌లోనే కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ అనేవి వచ్చాయి. వీటిలో నష్టాల కంటే లాభాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వ్యవస్థలో ఫండ్ మేనేజర్ల పర్యవేక్షణలో మ్యూచువల్ ఫండ్స్ సిప్స్ జరుగుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుండటంతో ఎంతోమంది ఇటువైపు చూస్తున్నారు. ఏడాదిన్నగా లక్షన్నర మందికి ఇన్వెస్టర్లు పెరిగారని స్టాక్ ఏజెంట్లు చెబుతున్నారు. దీనికి కారణం మొబైల్స్. ఏంజల్ వన్ స్టాక్స్, అప్‌స్టాక్స్ ఎం స్టాక్, గ్రో స్టాక్స్, జెరోధా కైట్, ఇండ్ మనీ, ఫైవ్ పైసా వంటి అనేక స్టాక్ ఇన్వె్‌స్టమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టే వారిసంఖ్య పెరిగిందంటున్నారు. ఈ యాప్స్‌లోనే స్టాక్ ఏజెంట్ సేవలు అందుతున్నాయి. ఎలాంటి షేర్లలో పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయి? ఏ షేర్లను కొనవచ్చు? వంటి సలహాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా షేర్ల ఎనాలసిస్ ఇస్తున్నాయి. కంపెనీల షేర్లు ఎలా ఉంటున్నాయి? నిలకడతనం, షేర్ల పెరుగుదల వంటివి పట్టికల్లో ఇస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే యాప్‌లో ఉన్న సులభతర ఇంటర్‌ఫేజ్ కారణంగా షేర్లు ఎలా కొనాలో, అమ్మాలో కూడా తెలిసిపోతోంది.
మనవాళ్ల పెట్టుబడులు ఈ షేర్లలోనే..
స్టాక్ మార్కెట్‌లో మనవాళ్లు ఏ రంగంలో పె ట్టుబడులు పెడుతున్నారన్నది చూస్తే ఫార్మా, ఆ యిల్, బ్యాంకింగ్, టైర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఎక్కువుగా పెట్టుబడులు పెడుతున్నారని తెలుస్తోంది. వినియోగించబడే ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీల్లో ఎక్కువగా షేర్లు కొంటున్నారని సమాచారం. వినియోగ ఆధారిత కంపెనీలు మంచి లాభాలను సాధిస్తాయన్న నమ్మకంతో పెట్టుబడులు పెడుతున్నారని ఏజెంట్లు చెబుతున్నారు. పాల ఉత్పత్తుల డెయిరీలు, స్టీల్ కర్మాగారాలు, సిమెంట్ పరిశ్రమలు, పెయింట్స్, టెక్స్‌టైల్స్, లెదర్ గూడ్స్ తయారీ కంపెనీల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని ఏజెంట్లు చెబుతున్నారు.
దీర్ఘకాలిక పెట్టుబడుల వైపే ఆసక్తి
స్టాక్ మార్కెట్‌లో అడుగు పెడుతున్న ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులు దీర్ఘకాలిక పెట్టుబడులనే పెడుతున్నారు. దీంట్లో న ష్టాలు తక్కువ, లాభాలు ఎక్కువనే ఆస క్తి చూపిస్తున్నారు. స్టాక్ మార్కెట్‌లో రోజు వారీ ట్రేడింగ్ నడుస్తుంది. దీన్ని డైలీ ట్రేడింగ్ అంటారు. రోజూ స్టాక్ మా ర్కెట్ ప్రారంభం కాగానే షేర్లు కొనటం, అదేరోజు మా ర్కెట్ ముగిసే నాటికి అమ్మటం చేస్తుంటారు. అయితే డైలీ ట్రేడింగ్ అనేది జూదం వంటిదని స్టాక్ ఏజెంట్లు చెబుతున్నారు. దీనివల్ల నష్టాలే ఎక్కువని చెబుతున్నా రు. ఇందులో సింహభాగం నష్టాలే చవిచూసే వాళ్లే ఎక్కువ. గతంలో విజయవాడలో పెద్ద సంఖ్యలో డైలీట్రేడింగ్‌కు పాల్పడేవారు. చాలా మంది అంతులేని నష్టాన్ని చవిచూశారు. స్టాక్ మార్కెట్‌పై పూర్తి అవగాహన లేనివారు డైలీ ట్రేడింగ్‌లోకి దిగి నష్టపోయారు. ప్రస్తుతం యాప్స్ అందుబాటులోకి వచ్చాక పరిస్థితి మారింది.
సోదరా.. జాగ్రత్త..!
ఏ రంగంలోనైనా మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుం ది. స్టాక్స్.. షేర్స్ వీటి వల్ల లా భాలు ఎలా వస్తాయో నష్టాలు కూడా అదేస్థాయిలో ఉంటా యి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి..? షేర్స్ అంటే ఏ మిటి..? ఏ షేర్స్‌లో పెడితే లాభాలు వస్తాయి, నష్టాలు ఎక్కడ తక్కువగా ఉంటా యి. అసలు ఎప్పుడు షేర్ కొనాలి.. ఎప్పుడు విక్రయించాలి అనే వాటిపై కూలంకషంగా తెలుసుకోవాలి. తెలిసినవాళ్ల నుంచి నేర్చుకోవాలి. మార్కెట్‌పై పూర్తి అవగాహన వచ్చాక మనపై మనకు నమ్మకం వచ్చాక ఇందులోకి దిగటం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాకాక ఎలా పడితే అలా కొనేసి నష్టాలొస్తున్నాయని వెనకా ముందు ఆలోచించకుండా నష్టాలకే అమ్ముకుంటే ఈ రంగంలో మనగడ కష్టమని వారు చెబుతున్నారు. కాబట్టి సోదరా బీ కేర్‌ఫుల్.