Share News

మరో రెండేళ్లు ఇక్కడే ఉంటా!

ABN , Publish Date - Jun 07 , 2024 | 02:18 AM

‘‘నా డెప్యుటేషన్‌ కాలం ఇంకా రెండేళ్లుంది. అప్పటి వరకు నేను మండలిలోనే ఉంటా. ఎవరైనా జోక్యం చేసుకుంటే అట్రాసిటీ కేసులు పెట్టి, జైల్లో పెట్టిస్తా.

మరో రెండేళ్లు ఇక్కడే ఉంటా!

నా జోలికొస్తే కేసులు పెడతా

ఉన్నత విద్యామండలిలో

వైసీపీ అనుకూల అధికారిణి బెదిరింపులు

ఆమెపై గతంలో ఆర్థిక ఆరోపణలు

అమరావతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ‘‘నా డెప్యుటేషన్‌ కాలం ఇంకా రెండేళ్లుంది. అప్పటి వరకు నేను మండలిలోనే ఉంటా. ఎవరైనా జోక్యం చేసుకుంటే అట్రాసిటీ కేసులు పెట్టి, జైల్లో పెట్టిస్తా. అవసరమైతే ఎస్సీలతో కలిసి వారి ఇంటి ముందు ధర్నా చేస్తా’’ అంటూ ఉన్నత విద్యామండలిలో వైసీపీతో అంటకాగిన ఓ మహిళా అధికారి బెదిరింపుల పర్వానికి దిగారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె. హేమచంద్రారెడ్డి అధికారులను బెదిరించడమే లక్ష్యంగా ఆమెను జేఎన్‌టీయూ అనంతపురం నుంచి డెప్యుటేషన్‌పై మండలికి తీసుకొచ్చారు. కీలకమైన మండలి ఆర్థిక వ్యవహారాల బాధ్యతను అప్పగించారు. అప్పటి నుంచీ నిధుల దుర్వినియోగం మొదలైంది. అంతా ఆన్‌లైన్‌ బిల్లులు ఇస్తున్న ఈ కాలంలో మాన్యువల్‌ బిల్లులు పెడుతూ నిధులు పక్కదారి పట్టించారు. కార్యాలయ నిర్వహణ ఖర్చులు, ఇతరత్రా ఖర్చుల పేరిట ఎడాపెడా బిల్లులు రాసుకున్నారు. అలాగే, వ్యక్తిగత కేసులకు మండలి ఆఫీసును సొంత చిరునామాగా వాడుకోవడం గతంలో వివాదాస్పదమైంది. దీనిపై పత్రికల్లో వార్తలు వచ్చాయనే కోపంతో మండలిలోని జాయింట్‌ డైరెక్టర్‌పై అనేక రూపాల్లో ఫిర్యాదులు చేసి వేధించారు. తాజాగా మంగళవారం ఉదయం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి కొన్ని కీలకమైన ఫైళ్లను మెషీన్‌తో ముక్కలుగా చేసి ధ్వంసం చేశారు. ఈ వార్త పత్రికల్లో ప్రచురితమైంది. ఈ సమాచారం మండలి జాయింట్‌ డైరెక్టర్‌ వల్లే బయటికొచ్చిందని భావించిన హేమచంద్రారెడ్డి.. మహిళా అధికారి ద్వారా జేడీని మరోసారి బెదిరించారు. మళ్లీ పత్రికల్లో ఇలాంటి వార్తలు వస్తే ఆ జేడీపై అట్రాసిటీ కేసులు పెడతానంటూ మహిళా అధికారి జేడీ పీఏకు ఫోన్‌ చేసి బెదిరించారు. దీంతో తనను వేధింపులకు గురిచేస్తున్నారని జేడీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. గతంలోనూ చైర్మన్‌ అండతోనే ఆ మహిళా అధికారి ప్రభుత్వానికి, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదులు చేశారు. దీంతో ఇప్పుడు ఉన్నత విద్యాశాఖలో ఆ అధికారిణి అంటే అందరూ భయపడే పరిస్థితి వచ్చింది. చిత్రం ఏంటంటే.. ప్రభుత్వం మారినా వైసీపీతో అంటకాగిన ఆ అధికారిణి ఇలా వ్యవహరించడమే!!.

Updated Date - Jun 07 , 2024 | 07:24 AM