ఎన్‌డీపీఎల్ నియంత్రణకు చర్యలు
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:18 AM
ఇతర రాష్ర్టాల్లో పన్ను చెల్లించిన మద్యం(ఎన్‌డీపీఎల్) రాష్ట్రంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.

ఎక్సైజ్ ఈడీ రాహుల్‌దేవ్ శర్మ
అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ర్టాల్లో పన్ను చెల్లించిన మద్యం(ఎన్‌డీపీఎల్) రాష్ట్రంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ‘పొరుగు మద్యం.. అదే జోరు’ కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చాక రాష్ట్రంలోకి ఎన్‌డీపీఎల్ దిగుమతి తగ్గిందన్నారు. అక్టోబరులో 3114 కేసులు, నవంబరులో 3899 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2023తో పోల్చి చూసినా గత రెండు నెలల్లో ఎన్‌డీపీఎల్ తగ్గిందన్నారు. ఎన్‌డీపీఎల్ కట్టడికి సరిహద్దుల్లో 29 చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామని, మరో 19 బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని చెక్‌పోస్టుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. అన్ని డిస్టిలరీల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మద్యంలో స్ర్టెంథ్‌పై 13 రకాల పరీక్షలు, ఈఎన్‌ఏపై 9 రకాల పరీక్షలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.