Share News

దుర్గగుడిలో తొక్కిసలాట!

ABN , Publish Date - May 25 , 2024 | 03:47 AM

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. వేలాదిగా వచ్చిన భక్తులను నియంత్రించాల్సిన దేవస్థానం అధికారులు, భద్రతా సిబ్బంది చేతులెత్తేయడంతో చంటిపిల్లలతో వచ్చిన మహిళలు అల్లాడిపోయారు.

దుర్గగుడిలో తొక్కిసలాట!

సెలవులు, శుక్రవారం కావడంతో పెరిగిన రద్దీ

తగిన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం

విజయవాడ (వన్‌టౌన్‌), మే 24: విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. వేలాదిగా వచ్చిన భక్తులను నియంత్రించాల్సిన దేవస్థానం అధికారులు, భద్రతా సిబ్బంది చేతులెత్తేయడంతో చంటిపిల్లలతో వచ్చిన మహిళలు అల్లాడిపోయారు. తొక్కిసలాట జరిగి ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వేసవి సెలవులు ముగుస్తుండటం.. శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి దర్శనార్థం వేకువజాము నుంచే భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. రద్దీని అంచనా వేసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. శుక్రవారం సుమారు 40 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని ఉంటారని సమాచారం. ఇంత భారీ సంఖ్యలో భక్తులు వచ్చినా క్యూలైన్లలోని భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంలో సమన్వయ లోపంతో తోపులాటలు జరిగాయి. శివాలయం మెట్ల ప్రాంతంలో పనులు జరుగుతున్నందున భారీ క్రేన్‌ను అక్కడే ఉంచి పనులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు కూడా తమ వాహనాలను మార్గమధ్యంలోనే నిలిపివేశారు. ఏడవ అంతస్థు లిఫ్టుకు వెళ్లే మార్గం వద్ద, అన్నదాన కేంద్రం వద్ద తీవ్రస్థాయిలో తోపులాట చోటుచేసుకోవడంతో విజయవాడ వాంబే కాలనీకి చెందిన రాజేశ్వరి, విశాఖకు చెందిన కల్పనకు తీవ్ర గాయాలయ్యాయి. కల్పనకు కాలు విరిగిపోయింది. వారిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను రప్పించగా ఆ అంబులెన్స్‌ గోశాల వద్ద ట్రాఫిక్‌లో 45 నిమిషాల సేపు ఆగిపోయింది. సుమారు గంట తర్వాత వారిని ఆసుపత్రికి తరలించగలిగారు.

Updated Date - May 25 , 2024 | 03:48 AM