Share News

బోర్డు నియంత్రణలోకి శ్రీశైలం, సాగర్‌!

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:26 AM

కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి.

బోర్డు నియంత్రణలోకి శ్రీశైలం, సాగర్‌!

2 రాష్ట్రాల అంగీకారం.. విద్యుత్కేంద్రాలు మినహా 10 కాంపోనెంట్ల అప్పగింత

ప్రతి చోటా ఇరు రాష్ట్రాల నుంచీ ఒక్కో ఉద్యోగి.. త్రిసభ్య కమిటీ నిర్ణయం

మేరకే నీటి విడుదల.. సాగర్‌ వరకే సీఆర్‌పీఎఫ్‌.. కేఆర్‌ఎంబీ భేటీలో నిర్ణయం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. గురువారమిక్కడి జలసౌధలో చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌ అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ నుంచి ఈఎన్‌సీ సి.మురళీధర్‌, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ మోహన్‌కుమార్‌, నాగార్జునసాగర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ అజయ్‌కుమార్‌, కృష్ణాబేసిన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.విజయకుమార్‌, ఏపీ నుంచి ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డితో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నరపాటు సమావేశం జరిగింది. జలవిద్యుత్కేంద్రాలు తప్ప మిగిలిన 10 ఔట్‌లెట్లు.. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వేతో పాటు రివర్‌ స్లూయిస్‌, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, హంద్రీ-నీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నాగార్జునసాగర్‌ లెఫ్ట్‌ కెనాల్‌ హెడ్‌ రెగ్యులేటర్‌, నాగార్జునసాగర్‌ ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌-హెడ్‌రెగ్యులేటర్‌-పరిసరాలు, ఏఎమ్మార్‌ ఎత్తిపోతల పథకం-పంప్‌ హౌస్‌ పరిసరాలు, సాగర్‌ ప్రాజెక్టు స్పిల్‌వేతో పాటు రివర్‌, చూట్‌ స్లూయిస్‌, నాగార్జునసాగర్‌ రైట్‌ కెనాల్‌ హెడ్‌ రెగ్యులేటర్‌పై చర్చించారు. వీటన్నింటినీ బోర్డు నియంత్రణలోకి తీసుకెళ్లడానికి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు అంగీకరించారు. నీటి విడుదల కోసం కేఆర్‌ఎంబీ ప్రత్యక్ష నియంత్రణలో ప్రతి కాంపోనెంట్‌ వద్ద తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి మరొక ఉద్యోగిని నియమించాలని నిర్ణయించారు. 10 కాంపోనెంట్ల వద్ద మూడు షిఫ్టుల్లో (ఒక షిఫ్టు 8గంటలు) 30 మంది చొప్పున బోర్డు నియంత్రణలో పనిచేయడానికి సమ్మతించారు. నీటి విడుదల మాత్రం బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ (బోర్డు సభ్యకార్యదర్శి డీఎం రాయిపూరే, తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌, ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి) నిర్ణయం మేరకే జరిగేలా అంగీకారం కుదిరింది. అయితే సాగర్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ పనులను తెలంగాణ.. శ్రీశైలం పనులను ఏపీ చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టులు/కాంపోనెంట్ల తాత్కాలిక నిర్వహణకు నియమించిన సిబ్బందికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వేతనాలు చెల్లించాలని నిశ్చయించారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలను సాగర్‌ ప్రధాన కట్ట వద్దే పరిమితం చేయనున్నారు. వివాదం తలెత్తితే మాత్రం శ్రీశైలంతో పాటు ఇతర కాంపోనెంట్ల వద్దా సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరిస్తారు.

Updated Date - Feb 02 , 2024 | 03:26 AM