Share News

Srisailam Sagar : నిండుకుండల్లా శ్రీశైలం సాగర్‌

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:32 AM

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Srisailam Sagar : నిండుకుండల్లా శ్రీశైలం సాగర్‌

గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

శ్రీశైలంలో 6, నాగార్జునసాగర్‌లో 20 గేట్లు ఎత్తివేత

కొనసాగుతున్న విద్యుత్‌ ఉత్పత్తి

శ్రీశైలం, వీపీ సౌత్‌, నరసరావుపేట, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం శ్రీశైలం డ్యాం 6 క్రస్టుగేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 1,25,641 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 211.4250 టీఎంసీల నిల్వ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 30,698 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు నీటితో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. జలాశయం ఆరు క్రస్టుగేట్ల ద్వారా 1,67,898 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. అలాగే, సాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 589.8 అడుగులకు చేరింది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకుగాను ప్రస్తుతం 311.45 టీఎంసీలకు నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 1,72,712 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ఆదివారం సాగర్‌ 20 క్రస్ట్‌ గేట్లను ఎత్తి 1,89,312 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి పులిచింతలకు 1.71 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. పులిచింతల పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 173.72 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకుగాను 43.79 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి 1.71 కూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 04:32 AM