Share News

హింసాత్మక ఘటనలకు ఎస్పీలదే బాధ్యత

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:16 AM

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా స్పష్టం చేశారు.

హింసాత్మక ఘటనలకు ఎస్పీలదే బాధ్యత

ఎన్నికల్లో మీడియా పాత్ర కీలకం

ఉద్యోగులు పార్టీలకు సపోర్టు చేస్తే చర్యలు

పార్టీ అనుబంధ చానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయం ఆ పార్టీ, అభ్యర్థి ఖాతాలకే!

మీడియా వర్క్‌షాపులో సీఈవో మీనా

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా స్పష్టం చేశారు. హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు ఎస్సీలు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే వారిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హింసలేని, రీపోలింగ్‌కు ఆస్కారంలేని ఎన్నికలే లక్ష్యంగా ఈసారి ఎన్నికల నిర్వహణ ఉంటుందని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీడియా మాధ్యమాలు, మీడియా ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు మీనా అధ్యక్షతన అమరావతి సచివాలయంలో మీడియా వర్క్‌షాపు జరిగింది. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. అందుకు అనుగుణంగా మీడియా ప్రతినిధులు సహకరించాలని కోరారు. పెయిడ్‌ న్యూస్‌ అంశాన్ని ఆయన వివరిస్తూ.. ప్రచార మాధ్యమాల్లో ప్రచురితం, ప్రసారమయ్యే పెయిడ్‌ ఆర్టికల్స్‌పై ఎన్నికల కోడ్‌ అమలు నుంచి గట్టి నిఘా ఉంటుందన్నారు. అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి పెయిడ్‌ న్యూస్‌ అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తామని చెప్పారు. ఇందుకోసం జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలో ఉండే మీడియా సర్టిఫికేషన్‌, మీడియా మానిటరింగ్‌ కమిటీలు ఎంతో అప్రమత్తంగా పర్యవేక్షిస్తుంటాయని తెలిపారు. పెయిడ్‌ న్యూస్‌గా నిర్ధారణ అయిన ఆర్టికల్స్‌కు సంబంధించి రేటు కార్డు ప్రకారం ఖరారు చేయబడిన సొమ్మును సంబంధిత అభ్యర్థికి అనుమతించిన వ్యయం కింద జమ అవుతుందని తెలిపారు.

ప్రకటనలకు ప్రి సర్టిఫికేషన్‌ తీసుకోవాల్సిందే..

డిజిటల్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాల్లో ఎన్నికల ప్రకటనలు ఇవ్వాలంటే పార్టీలు, అభ్యర్థులు ప్రి సర్టిఫికేషన్‌ తీసుకోవాల్సిందేనని మీనా స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు ప్రకటనలు రూపొందించుకోవాలని సూచించారు. పార్టీకి అనుబంధంగా ఉండే చానెళ్లలోని వార్తలు, ప్రకటనలపై ప్రత్యేక నిబంధనలు ఉన్నాయన్నారు. పార్టీ అనుబంధ చానెళ్లలో వచ్చే వార్తలను పెయిడ్‌ న్యూస్‌గా పరిగణించే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి వార్తలను ఎంసీఎంసీ కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్పారు. ప్రకటనలు, పెయిడ్‌ న్యూస్‌ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే అభ్యర్థులపై చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు సపోర్టు చేయకూడదని, ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా ఉద్యోగ సంఘాల నేతలు ఈ విధంగా చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు వివిధ రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 140 ప్రకటనలకు పర్మిషన్‌ ఇచ్చామని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థికి రూ. 40 లక్షలు, ఎంపీ అభ్యర్థికి రూ.95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించిందని సీఈవో తెలిపారు.

Updated Date - Mar 16 , 2024 | 02:16 AM