Share News

జగన్‌ ప్యాలెస్‌కు ప్రత్యేక రహదారి!

ABN , Publish Date - Jun 07 , 2024 | 02:07 AM

వైసీపీ అధినేత జగన్‌ తమ ఇళ్ల మధ్య నివాసం ఉంటున్నారన్న ఆనందం ఆ కాలనీ వాసులకు మూన్నాళ్ల ముచ్చటే అయింది.

జగన్‌ ప్యాలెస్‌కు ప్రత్యేక రహదారి!

ప్రభుత్వ స్థలంలో ఆర్‌అండ్‌బీ నిధులతో నిర్మాణం

దానికి సమాంతరంగా కాల్వకట్ట రోడ్డు మూసివేత

మూడేళ్లుగా విద్యార్థులు, స్థానికులకు ఇబ్బందులు

కాల్వకట్ట రోడ్డును తిరిగి తెరిపించాలని వినతులు

మంగళగిరి, జూన్‌ 6: వైసీపీ అధినేత జగన్‌ తమ ఇళ్ల మధ్య నివాసం ఉంటున్నారన్న ఆనందం ఆ కాలనీ వాసులకు మూన్నాళ్ల ముచ్చటే అయింది. 2019 ఎన్నికలకు ముందే తాడేపల్లి అమరారెడ్డి కాలనీ సమీపంలో జగన్‌ నివసించే ప్యాలెస్‌ నిర్మాణం పూర్తయింది. తర్వాత ఆయన ముఖ్యమంత్రి హోదాలో అందులోకి గృహప్రవేశం చేశారు. తన ప్యాలెస్‌ సమీపంలో పేదలెవరూ ఉండరాదని హుకుం జారీచేశారు. దీంతో సుమారు 277 మంది పేదల నివాసాలను కూల్చేశారు. తాడేపల్లి ప్యాలె్‌సకు రాకపోకల కోసం ప్రభుత్వ డొంకలో ఏర్పాటు చేసిన 15అడుగుల రోడ్డుకు కూల్చివేసిన పేదల ఇళ్ల తాలూకు స్థలాలను కలుపుకుంటూ ఏకంగా సెంట్రల్‌ డివైడర్‌తో కూడిన 40అడుగుల రోడ్డును 1.3కిలోమీటర్ల పొడవున రూ.5కోట్లతో నిర్మించారు. ఈ రహదారిని గత రెండున్నరేళ్లుగా జగన్‌ ప్యాలె్‌సకు వెళ్లి వచ్చేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ రోడ్డు వేసేందుకు గాను రేవేంద్రపాడు -సీతానగరం మధ్య ఉన్న కాలువ కట్ట రోడ్డును 8.7 కి.మీ నుంచి 7.4 కి.మీ వరకు విస్తరిస్తున్నట్టు, అందుకోసం రూ.5కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టు జీవోలో చూపారు.

తొలగించిన 277 నివాసాలకు నష్టపరిహారంగా రూ.7.61 కోట్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. ఈ రోడ్డులో అన్యులెవరూ వెళ్లకుండా రేయింబవళ్లు పోలీసు యంత్రాంగం కాలపా ఉంటుంది. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయినా ఈ రహదారి జగన్‌ ప్యాలెస్‌ కోసమే అనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. అదే రోడ్డుకు సమాంతరంగా బకింగ్‌ హామ్‌ కాల్వ కట్టపై వందల ఏళ్ల నుంచి ఉన్న రోడ్డును కూడ పూర్తిగా మూసివేశారు. దీంతో ప్రజలతోపాటు కేఎల్‌ వర్సిటీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్‌ నివాసానికి వెనుక అమరారెడ్డి కాలనీ ఉంది. దానిపక్కనే బకింగ్‌హామ్‌ కాల్వకట్టపై 15అడుగుల రోడ్డు ఉంది. నూతక్కి, రేవేంద్రపాడుతో పాటు దుగ్గిరాల మండలంలోని అనేక గ్రామాల ప్రజలు ప్రకాశం బారేజీ మీదుగా విజయవాడ వెళ్లడానికి ఈ రోడ్డును వినియోగించుకునేవారు. తాజా ఓటమితో జగన్‌ సీఎం పదవి కోల్పోయిన నేపథ్యంలో కాల్వకట్ట రోడ్డును తెరిపించడంతోపాటు ప్రభు త్వ స్థలంలో నిర్మించిన రహదారిని అందరూ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 02:07 AM