Share News

కేరళకు ‘నైరుతి’

ABN , Publish Date - May 31 , 2024 | 03:25 AM

దేశంలోని రైతులకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఖరీఫ్‌ పంటల సాగుకు ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి.

కేరళకు ‘నైరుతి’

సాధారణం కంటే రెండు రోజుల ముందే రాక

ఈశాన్య భారతంలో పలు రాష్ట్రాలకూ విస్తరణ

దోహదం చేసిన తుఫాన్‌.. 3-4 రోజుల్లో ఏపీకి?

ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం

ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మంచి వర్షాలు: నిపుణుల అంచనా

విశాఖపట్నం, మే 30(ఆంధ్రజ్యోతి): దేశంలోని రైతులకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఖరీఫ్‌ పంటల సాగుకు ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. ఈ మేరకు ఐఎండీ ప్రకటన చేసింది. గడచిన రెండు రోజుల నుంచి కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, అరేబియా సముద్రం మీదుగా పడమర గాలులు బలంగా వీయడం, అవి కూడా సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో సుమారు గంటకు 50 కి.మీ. వేగంతో వీస్తుండడంతో కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయని ఐఎండీ ప్రకటించింది. సాధారణ తేదీ(జూన్‌ 1) కంటే రెండు రోజులు ముందుగానే ఈ ఏడాది రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. కేరళతోపాటు ఈశాన్య భారతంలో నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు పూర్తిగా, త్రిపుర, మేఘాలయ, అసోంలో పలు ప్రాంతాలకు, అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలకు, మాల్దీవులు, కొమరిన్‌లో మిగిలిన భాగాలకు, తమిళనాడులో కొంతమేర, బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించేందుకు రీమల్‌ తీవ్ర తుఫాన్‌ దోహదపడింది. జూన్‌ ఐదో తేదీకల్లా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఏడు రోజులు ముందుగానే వచ్చాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

కేరళ, ఈశాన్య రాష్ర్టాల్లోకి ఒకేసారి..

నైరుతి రుతుపవనాలు కేరళను, ఈశాన్య రాష్ట్రాలను ఒకేసారి తాకడం చాలా అరుదు. సాధారణంగా కేరళలోకి జూన్‌ 1న, ఈశాన్య రాష్ట్రాల్లోకి జూన్‌ 5న రుతుపవనాలు ప్రవేశిస్తాయి. 2017లో మోరా తుఫాను వల్ల కేరళను, ఈశాన్య రాష్ట్రాలను రుతుపవనాలు ఒకే రోజు తాకాయి. ఇప్పుడూ రీమల్‌ తీవ్ర తుఫాను ప్రభావంతో ఈ రెండు ప్రాంతాలను ఒకేసారి రుతుపవనాలు తాకాయని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. కేరళ కంటే ముందే ఈశాన్య రాష్ట్రాలకు రుతుపవనాలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయని పేర్కొన్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడడంతోపాటు మరికొన్ని అనుకూల అంశాల నేపథ్యంలో ఈనెల 31వ తేదీ నాటికి కేరళకు రుతుపవనాలు వస్తాయని ఈనెల 15వ తేదీన ఐఎండీ ప్రకటించింది. అయితే, ఈనెల 19న అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశించిన రుతుపవనాలు తరువాత రెండు, మూడు రోజుల్లో బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించాయి. ఈలోగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర తుఫాన్‌గా మారి 26వ తేదీ అర్ధరాత్రి బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్‌ మధ్య తీరం దాటడం అరేబియా సముద్రంలో రుతుపవన మేఘాలు ముందుకు కదలడానికి దోహదపడింది. రుతుపవనాలు రానున్న రెండు, మూడు రోజుల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లో కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది.

మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రానికి?

రానున్న రెండు, మూడు రోజుల్లో తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలో పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో పడమర గాలులు మరింతగా బలపడితే మూడు నుంచి నాలుగు రోజుల్లో ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు అంచనా వేశారు. ఒకవేళ తమిళనాడు, కర్ణాటక వరకు వచ్చిన తరువాత నెమ్మదిస్తే మాత్రం మరికొద్ది సమయం పడుతుందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో గత ఏడాది జూన్‌ 8న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఆ తరువాత దేశంలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించినా సరైన వర్షాలు పడకపోవడంతో వ్యవసాయ దిగుబడులు తగ్గాయి.

ఈ ఏడాది అధిక వర్షపాతం..

జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలలను నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఏడాదిలో కురిసే వర్షంలో 70 శాతం ఈ సీజన్‌లోనే కురుస్తుంది. దేశంలో 50 శాతం పంటలను వర్షాధారంపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్‌లో 87 సెంటీమీటర్ల వర్షపాతం కురవాలి. అయితే 2024లో సీజన్‌ దీర్ఘకాల సగటులో 106 శాతం వర్షం కురుస్తుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. వాయువ్య, ఈశాన్య భారతంలో పలు ప్రాంతాలు తప్ప దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రధానంగా కోర్‌ మాన్‌సూన్‌ జోన్‌ అంటే మధ్యభారతం, తూర్పుభారతంలో పలు రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో మే నెలాఖరుకు లేదా జూన్‌ తొలి వారంలోగా బలహీనపడి తటస్థ పరిస్థితులు నెలకొంటాయని ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో ఆగస్టు నాటికి లానినా ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో దేశంలో రుతుపవనాల రెండో భాగం(ఆగస్టు, సెప్టెంబరు)లో ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. నైరుతి సీజన్‌లో మొదటి నెల జూన్‌ ఖరీ్‌ఫకు ఎంతో కీలకమైనది. ఈ ఏడాది జూన్‌లో సాధారణ వర్షపాతం 16.69 సెంటీమీటర్లు నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ ఏడాది ప్రీమాన్‌సూన్‌ సీజన్‌(మార్చి నుంచి మే నెల వరకు) కేరళ, పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలు తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు విజ్రంభించాయి. రిజర్వాయర్‌లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం, పొడి వాతావరణం నెలకొనడంలో తొలకరి పనులకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు దేశంలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించి వ్యవసాయ రంగానికి ఊతమిస్తాయని వాతావరణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - May 31 , 2024 | 03:25 AM