Share News

నరసాపురం వరకు ‘నైరుతి’

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:48 AM

నైరుతి రుతుపవనాలు రాయలసీమ, కోస్తాంధ్రలోని అనేక ప్రాంతాలకు విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది.

నరసాపురం వరకు ‘నైరుతి’

నాలుగైదు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరణ.. పలుచోట్ల వర్షాలు.. అనంతలో భారీగా పంటనష్టం

పొంగి ప్రవహించిన వాగులు, వంకలు.. నీట మునిగిన ఉద్యాన పంటలు

పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూలిన స్తంభాలు, చెట్లు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

నైరుతి రుతుపవనాలు రాయలసీమ, కోస్తాంధ్రలోని అనేక ప్రాంతాలకు విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతం, కేరళలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఇంకా అరేబియా సముద్రం నుంచి కేరళ మీదుగా పడమర గాలులు వీస్తున్నాయి. దీంతో నైరుతి రుతుపవనాలు కర్ణాటకతోపాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, రాయలసీమలో ఎక్కువ ప్రాంతాలు, కోస్తాలో నరసాపురం వరకూ విస్తరించాయి. కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించాయి. రానున్న నాలుగైదు రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీ్‌సగఢ్‌లో పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమ గాలుల ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు రాష్ట్రంలోని అనేకచోట్ల వర్షాలు, పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిశాయి. సోమవారం కూడా పలుచోట్ల వర్షాలు కురిశాయి. బనగానపల్లెలో 18, శ్రీశైలంలో 17, నర్సీపట్నంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలోని అన్ని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రాప్తాడు సమీపంలోని పండమేర వంక పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బొమ్మనహాల్‌, కణేకల్లు మండలాల్లో వేదవతి హగరి నదికి భారీగా నీరు చేరింది. ఉద్దేహాల్‌ వద్ద వంతెనపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో బళ్లారి, కళ్యాణదుర్గం ప్రాంతాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

అనంతపురం జిల్లావ్యాప్తంగా 17.90 హెక్టార్లల్లో రూ.34.72 లక్షల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అరటి, మామిడి, బొప్పాయి, టమోటా పంటలు ధ్వంసమయ్యాయి. బొమ్మనహాళ్‌ మండలంలో 200 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. రూ.60 లక్షలకుపైగా పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో వంకలు, వాగులు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లాయి. 12 ఎకరాల్లో సాగుచేసిన అరటి మొక్కలు నీటమునిగాయని, రూ.10 లక్షల దాకా నష్టపోయానని రైతు కనగానపల్లిలో రైతు బట్టా నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. గాలివానకు పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ స్తంభాలు, వైర్లు తెగిపోయాయి. కర్నూలు-ఉల్చాల ప్రధాన రహదారిలో వంతెన కూలిపోయి సి.బెళగల్‌ మండలం గుండ్రేవుల, సంగాల, కొత్తకోట, కర్నూలు రూరల్‌ మండలం రేమట, ఉల్చాల తదితర సమీప ప్రాంతాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. కల్లూరు మండలంలో వక్కెర వాగుకు వరద పోటెత్తింది. కర్నూలు నగరంలోని అశోక్‌నగర్‌ సెంటర్‌లో ప్రధాన రహదారి పక్కనే ఉన్న భారీ వృక్షం కూలి ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంపై పడింది. చిత్తూరు, ప్రకాశం, కర్నూలు, అల్లూరి, మన్యం, విశాఖ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి.

నేడు పిడుగులతో వర్షాలు..

రానున్న 24 గంటల్లో రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటప్పుడు, పిడుగులు పడే సమయంలో ఆరుబయట ఉండొద్దని సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.

ఒకే రోజు 110 మి.మీ. వర్షం

బెంగళూరులో 133 సంవత్సరాల రికార్డు బద్ధలు

బెంగళూరు, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరంలో వర్షాలు సాధారణమే. అయితే, జూన్‌ ఆరంభంలోనే ఆదివారం ఒకే రోజు ఏకంగా 110.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 133 ఏళ్ల నాటి రికార్డును బద్ధలు కొట్టింది. బెంగళూరులో 1891 జూన్‌ 16న 101.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆ రికార్డును తాజా వర్షం తిరగరాసింది. నగరంలో శని, ఆదివారాలలో మొత్తం 140.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా వర్ష బీభత్సం కొనసాగింది. ఒక్కరోజులోనే 261 విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. 200కు పైగా చెట్లు కూలాయి. దాదాపు నగరమంతటా చెట్లు, కొమ్మలు విరిగిపడిన దృశ్యాలు కనిపించాయి. ఈనెల 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధనశాఖ ప్రకటించింది.

Updated Date - Jun 04 , 2024 | 03:48 AM