Share News

పాపం.. పిల్లోడు!

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:05 AM

‘అవినాశ్‌ రెడ్డి చిన్న పిల్లోడు. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సర్టిఫికెట్‌ ఇచ్చేశారు. 39 ఏళ్ల వయసు..

పాపం.. పిల్లోడు!

వివేకా కేసులో ఈ పిల్లోడిదే కీలక పాత్ర

సాక్ష్యాధారాలతో నిరూపించిన సీబీఐ

అయినా జగన్‌ దృష్టిలో అవినాశ్‌ పసివాడే

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘అవినాశ్‌ రెడ్డి చిన్న పిల్లోడు. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సర్టిఫికెట్‌ ఇచ్చేశారు. 39 ఏళ్ల వయసు... దాదాపు ఆరడుగుల ఎత్తున్న కడప వైసీపీ అభ్యర్థిని ‘చిన్న పిల్లోడిని’ చేసేశారు. ఆయన జీవితాన్ని నాశనం చేస్తున్నారని కూడా వాపోయారు. వివేకా హత్య కేసులో ఈ ‘చిన్న పిల్లోడి’ పాత్రను సీబీఐ పూసగుచ్చినట్లు వివరించింది. దీని ప్రకారం...

ఈ చిన్న పిల్లోడు...

వివేకా హత్యకు ముందు రోజు రాత్రి నిందితులు ఈ చిన్న పిల్లోడి ఇంట్లో ఉన్నారని... రాత్రంతా ఈ ‘పిల్లోడి’ ఫోన్‌ యాక్టివ్‌గా ఉందని సీబీఐ సాంకేతిక ఆధారాలు సేకరించింది.

ఈ చిన్న పిల్లోడు...

వివేకాపై పడిన గొడ్డలివేటును గుండెపోటుగా మార్చడంలో ఈ చిన్న పిల్లోడి పాత్ర కీలకమని సీబీఐ నిర్ధారించింది. రక్తపు మరకలను చెరిపివేయించడం నుంచి వివేకా శరీరంపై గాయాలు కనపడకుండా ‘కవర్‌’ చేయించడం వరకూ... సాక్ష్యాఽధారాలు చెరిపే ప్రక్రియలో ఈ చిన్న పిల్లోడి పాత్ర ప్రధానమని గుర్తించింది.

ఈ చిన్న పిల్లోడు...

దేశమంతా అనేక మంది నేతలను సీబీఐ వణికిస్తుండగా... కడప గడపలో సీబీఐనే ఈ చిన్న పిల్లోడు వణికించారు. వివేకా కేసు దర్యాప్తు అధికారిపైనే కడప పోలీసులు కేసు పెట్టేశారు.

ఈ చిన్న పిల్లోడు...

తనను అరెస్టు చేసేందుకు వచ్చిన సీబీఐని ఈ చిన్న పిల్లోడు ముప్పు తిప్పలు పెట్టారు. తల్లిని కర్నూలు ఆస్పత్రిలో చేర్చించి... ఆస్పత్రి ముందు అనుచరులను మోహరించి... సీబీఐ అధికారులు అటువైపు రాకుండా చేశారు. వివేకా హత్య కేసులో ఈ చిన్న పిల్లోడిని అరెస్టు చేయలేక చేతులెత్తేసింది. కాగితాలపై ఉత్తుత్తి అరెస్టు చూపించి, బెయిలుపై పంపించేసింది. ఎందుకంటే... చిన్న పిల్లోడు కదా!

Updated Date - Apr 26 , 2024 | 05:06 AM