Share News

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమే కావాలి!

ABN , Publish Date - Jul 20 , 2024 | 04:10 AM

విద్యార్థుల ఆసక్తి, మార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగా ఇంజనీరింగ్‌ కాలేజీలు సీట్లు మార్చుకుంటున్నాయి.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమే కావాలి!

కంప్యూటర్‌ సైన్స్‌లో 93% సీట్లు భర్తీ

ఈసీఈలో 87%, ఈఈఈ 71%,

మెకానికల్‌ 61%, సివిల్‌ 62%

30 బ్రాంచీల్లో వంద శాతం నిండిన సీట్లు

ఒక బ్రాంచిలో ఒక్క సీటూ భర్తీ కాలేదు

మొత్తం సీఎ్‌సఈ మయంగా బీటెక్‌ విద్య

ట్రెండ్‌కు తగ్గట్టుగా పెరిగిన సీఎ్‌సఈ సీట్లు

అదే బాటలో కాలేజీలు..

రాష్ట్రంలో పెరిగిన 25 వేల సీట్లు

ఇంజనీరింగ్‌ అంటే కంప్యూటర్‌ సైన్స్‌! ఇది తప్ప మరేదీ లేదన్నంతగా ట్రెండ్‌ మారిపోయింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమే లక్ష్యంగా విద్యార్థులు బీటెక్‌ కోర్సుల్లో చేరుతున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, ఐవోటీ, సైబర్‌ సెక్యూరిటీ... చివరికి బ్లాక్‌ చైన్‌ కోర్సు అయినా ఫర్లేదు! ఈ నేపథ్యంలోనే ఏఐసీటీఈ ఈ ఏడాది కాలేజీలకు సీట్ల పరిమితిని ఎత్తేసింది. దీంతో గతేడాదితో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు 25 వేల సీఎ్‌సఈ సీట్లు పెరిగాయి. అయినా మొత్తం భర్తీ అయ్యే పరిస్థితి వచ్చిం ది. మిగతా కోర్సులకు ఆ పరిస్థితి లేదు!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విద్యార్థుల ఆసక్తి, మార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగా ఇంజనీరింగ్‌ కాలేజీలు సీట్లు మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు అన్ని కోర్సులకూ సమ ప్రాధాన్యం, అడ్మిషన్లు ఉండేవి. కొంతకాలంగా సీఎ్‌సఈ ట్రెండ్‌ పెరగడంతో ఆ బ్రాంచ్‌లలో సీట్లు పెంచుకుని మెకానికల్‌, సివిల్‌, ఈఈఈ లాంటి కోర్సులను అప్రాధాన్య జాబితాలో పెడుతున్నాయి. గతేడాది వరకూ ఒక కాలేజీలో ఒక బ్రాంచ్‌కు 240 సీట్లు దాటి కేటాయించేవారు కాదు. ఆ పరిమితిని ఈ ఏడాది ఏఐసీటీఈ ఎత్తేయడంతో కాలేజీల్లో మిగిలిన బ్రాంచ్‌లలో సీట్లు తగ్గించుకుని సీఎ్‌సఈలో పెంచుకున్నాయి. అందువల్లే రాష్ట్రంలో మొత్తం 1.81లక్షల సీట్లు ఇంజనీరింగ్‌లో ఉంటే ఒక్క సీఎ్‌సఈలో లక్ష సీట్లు ఉన్నాయి. మిగిలిన అన్ని బ్రాంచ్‌లు కలిపినా సీఎ్‌సఈ స్థాయిలో లేవు.

కన్వీనర్‌ కోటాలో భర్తీ ఇలా

ఇంజనీరింగ్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ఇటీవల ముగిసింది. 17న విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈ ఏడాది మొత్తం 1.81లక్షల సీట్లు రాష్ర్టానికి మంజూరయ్యాయి. ఇందులో కన్వీనర్‌ కోటా కింద 1,36,660 సీట్లు ఉంటే, వాటిలో 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయి. కంప్యూటర్‌ సైన్స్‌, దాని అనుబంధ కోర్సుల్లో 71,574 సీట్లు ఉండగా 66,504 (92.91శాతం) నిండాయి. ఈసీఈలో 24,121 సీట్లు ఉంటే 21,060 (87.3శాతం), ఈఈఈలో 8,800 సీట్లకుగాను 6,239 (70.89శాతం), మెకానికల్‌లో 7,996 సీట్లకుగాను 4,862 (60.8శాతం), సివిల్‌లో 6,760 సీట్లు ఉంటే 4,166 (61.62శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. సీఎ్‌సఈతో పాటు సీఎ్‌సఈ అనుబంధ కోర్సుల్లో దాదాపు సీట్లు నిండిపోయాయి. అక్కడక్కడా ఒకట్రెండు కాలేజీల్లో మాత్రమే ఉన్న సీఎ్‌సఈ సీట్లు కూడా భర్తీ అయిపోయాయి. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో 284, సీఎ్‌సఈ(స్పెషలైజేషన్‌ ఇన్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌)లో 95, సీఎ్‌సఈ డేటా ఎనలటిక్స్‌లో 62, సీఎ్‌సఈ అండ్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌లో 48, సీఎ్‌సఈ బిగ్‌ డేటా ఎనలటిక్స్‌లో 48 సీట్లు ఉంటే వంద శాతం భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్‌లో మొత్తం 72 బ్రాంచ్‌లు ఉంటే 30 బ్రాంచ్‌లలో వంద శాతం సీట్లు నిండాయి. ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్లానింగ్‌ కోర్సులో ఒక్కరు కూడా చేరలేదు. ఏడు బ్రాంచ్‌లలో అడ్మిషన్ల సంఖ్య రెండంకెలు చేరలేదు.

క్యాంప్‌సలో వారికే ప్రాధాన్యం

క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు సీఎ్‌సఈ కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఆ తర్వాత కొంతమేర ఈసీఈ కోర్సు చదివిన వారిని పరిగణలోకి తీసుకుంటున్నాయి. మెకానికల్‌, ఈఈఈ, సివిల్‌ బ్రాంచ్‌ల విద్యార్థులు క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు చాలా వరకు దూరమైపోతున్నారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివిన వారికి ఆటోమొబైల్‌, ఇతరత్రా మెకానిక్‌ లాంటి పెద్ద రంగాల్లో అవకాశాలు ఉంటున్నాయి. సివిల్‌ ఇంజనీర్లకు నిర్మాణ రంగంలో, ఈఈఈ చదివిన వారికి ఎలక్ర్టికల్‌, ఎలక్ర్టానిక్స్‌ రంగాల్లో మంచి అవకాశాలున్నా విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌కే మొగ్గు చూపుతున్నారు. సాఫ్ట్‌వేర్‌తో పోల్చి చూ స్తే మిగిలిన రంగాల్లో గ్రోత్‌ తక్కువగా ఉండ టం దీనికి కారణం. జీతాల పరంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అత్యంత వేగంగా గ్రోత్‌ సాధిస్తున్నా రు. ఇదే దేశవ్యాప్తంగా విద్యార్థులను సీఎ్‌సఈవైపు నడిపిస్తోంది. ఇక గతంలో ఏ బీటెక్‌ కోర్సు చేసినా హైదరాబాద్‌, బెంగళూరులాంటి నగరాలకు వెళ్లి కోచింగ్‌ సెంటర్లలో కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు అలా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిలో కూడా తొలుత సీఎ్‌సఈ బ్రాంచ్‌ వారికి ప్రాధాన్యత కనిపిస్తోంది. దీంతో మేనేజ్‌మెంట్‌ కోటాలోనైనా సీఎ్‌సఈలోనే చేరాలనే లక్ష్యం కనిపిస్తోంది.

Updated Date - Jul 20 , 2024 | 04:11 AM