భార్గవ్‌రెడ్డిపై బీఎన్‌ఎస్ సెక్షన్లు చెల్లవు
ABN , Publish Date - Nov 28 , 2024 | 06:14 AM
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్

ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో పొన్నవోలు వాదనలు
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇంచార్జి సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ల పై బుధవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్‌ను వివిధ కేసుల్లో నిందితుడిగా చేర్చారని చెప్పారు. బీఎన్‌ఎస్ చట్టం అమల్లోకి రాకముందు పెట్టిన పోస్టులపై ఆ చట్టం కింద పెట్టిన సెక్షన్ల నమోదు చెల్లుబాటు కావన్నారు. అధికార పార్టీ చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని, ఒకే అంశంపై పదుల సంఖ్యలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చెల్లుబాటుకాదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించడానికి వీల్లేదన్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ కేసులు పెట్టి బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 111ను పోలీసులు దుర్వినియోగం చేశారన్నారు. సమయం ముగియడంతో వ్యాజ్యాలపై తదుపరి విచారణను కోర్టు 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కె కృపాసాగర్ ఉత్తర్వులు ఇచ్చారు. తనపై నమోదైన 5 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ భార్గవ్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా మరో 3 పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో దాఖలు చేసిన ఐదు కేసుల్లో వాదనలు విన్న హైకోర్టు, తాజా మూడు పిటిషన్లలో పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.