స్లాట్స్ ‘గగన`
ABN , Publish Date - Mar 04 , 2024 | 03:27 AM
దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైకి విజయవాడ నుంచి విమానాలు నడపాలంటే స్లాట్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది.
బెజవాడ నుంచి ఢిల్లీ, ముంబైకి స్లాట్స్ కటకట
డిమాండ్ ఉన్నా అక్కడి రన్‌వేలు రద్దీ
గుర్‌గావ్, నవీ ముంబైలో కొత్త ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వచ్చే వరకూ కష్టమే..
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైకి విజయవాడ నుంచి విమానాలు నడపాలంటే స్లాట్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో నెలకొన్న రద్దీనే ఇందుకు కారణం. కొవిడ్ ముందు వరకు దేశ రాజధానికి 3 విమాన సర్వీసులు నడిచేవి. ఆ తర్వాత రెండింటినే పునరుద్ధరించారు. మూడో దానికి మాత్రం స్లాట్ దొరకలేదు. ప్రస్తుత డిమాండ్ రీత్యా ఢిల్లీకి అదనంగా రోజుకు రెండు విమానాలు నడపాల్సి ఉంది. విమానయాన సంస్థల నుంచి ఆసక్తి ఉన్నా విమానాలను నడపలేని పరిస్థితి నెలకొంది. కారణం.. ఢిల్లీ విమానాశ్రయంపై విపరీతమైన రద్దీ ఉండటమే. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దశలవారీగా నాలుగు రన్‌వేలను అభివృద్ధి చేసినా అదే డిమాండ్ ఉంటోంది. దీంతో విమానాలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి స్లాట్స్ దొరకటం లేదు. పోనీ.. కనెక్టింగ్ ఫ్లైట్స్ ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదు. ఢిల్లీ విమానాశ్రయంపై ఒత్తిడి తగ్గించటానికి కేంద్రం గుర్‌గావ్‌లో సరికొత్త విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. ఇది అందుబాటులోకి రావాలంటే మరో రెండేళ్ల వరకు పట్టవచ్చని తెలుస్తోంది. అప్పటి వరకు ఢిల్లీకి అదనపు విమాన సర్వీసులు నడపటం కష్టమే! ఇక విజయవాడ నుంచి ముంబైకి గతంలో ఒక విమానం నడిచేది. అది కొవిడ్ ముందు రద్దయింది. ప్రస్తుతం విజయవాడ నుంచి ముంబైకి రోజూ విమాన సర్వీసు నడిపేంత డిమాండ్ ఉంది. కానీ, ఎయిర్‌పోర్టు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్లాట్ దొరకటం లేదు. ముంబై విమానాశ్రయంలో ఒకటే రన్‌వే ఉంది. దీంతో కేంద్రం నవీ ముంబైలో ఇంకో ఎయిర్‌పోర్టును నిర్మిస్తోంది. అందుబాటులోకి రావటానికి మరో ఏడాదిన్నర పట్టవచ్చు.
డొమెస్టిక్ ప్రయాణికులు ఇతర రాష్ట్రాలకు..
విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి డిమాండ్‌కు తగినట్టుగా విమానాలు లేకపోవటం, ముంబైకి అసలు విమానాలే లేకపోవడం వల్ల ఇక్కడి ప్రయాణికులు పొరుగు రాష్ర్టాలైన హైదరాబాద్, చెన్నైకు వెళ్తున్నారు. దీంతో డొమెస్టిక్ ఫ్లైట్స్ కోసం కూడా పొరుగు రాష్ర్టాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం విజయవాడ నుంచి షార్జాకు వారంలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయి. ట్రావెల్ ఏజెన్సీల గణాంకాల ప్రకారం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు ఉన్న డిమాండ్‌లో సగం విజయవాడ, కోస్తా జిల్లాల నుంచి వెళ్లే వారున్నారని తెలుస్తోంది. కనీసం సింగపూర్, దుబాయ్ వంటి వరల్డ్ డెస్టినేషన్ ఎయిర్‌పోర్టులకు విమానాలను నడిపినా వారికి వెసులుబాటుగా ఉంటుంది. ఈ అవకాశం కూడా లేకపోవటం వల్ల ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే వారిలో 70 శాతం మంది హైదరాబాద్ , 30 శాతం మంది చెన్నై వెళ్లాల్సి వస్తోంది.
విజయవాడ-విశాఖకు నో కనెక్టవిటీ
విజయవాడ-విశాఖ మధ్య రోడ్డు, రైలు మార్గాలకు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. నాన్‌స్టాప్‌గా చిన్నపాటి విమానాలు నడపగలిగేంత డిమాండ్ ఉన్నా ఒకే ఒక్క సర్వీసు నడుస్తోంది. విజయవాడ నుంచి తిరుపతికి మరో సర్వీసు డిమాండ్ ఉంది. కడపకు కూడా విమాన సర్వీసు డిమాండ్ ఉన్నా నడపలేని పరిస్థితి ఏర్పడింది.