Share News

వివేకా హత్యలో శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర

ABN , Publish Date - Jan 06 , 2024 | 02:49 AM

ఏపీ సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిది కీలకపాత్ర అని వివేకా కుమార్తె సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు.

వివేకా హత్యలో శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర

ఆధారాల చెరిపివేతకే పరిమితం కాదు

హత్యకు ముందు రెక్కీ నిర్వహించారు

కుట్ర అమలు చేసేందుకు డబ్బులిచ్చారు

మా ప్రాణాలకు సైతం ముప్పుంది: సునీత

సాక్షులను బెదిరించారు: సీబీఐ అధికారులు

ఆధారాల చెరిపివేతకే జైలా: శివశంకర్‌

బెయిల్‌ పిటిషన్‌పై టీ-హైకోర్టు తీర్పు రిజర్వు

హైదరాబాద్‌, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిది కీలకపాత్ర అని వివేకా కుమార్తె సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. శివశంకర్‌రెడ్డి దాఖలుచేసిన బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అయిన సునీతారెడ్డి తరఫున న్యాయవాది టి. స్వేచ్ఛ వాదనలు వినిపిస్తూ.. శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వరాదని అభ్యర్థించారు. హత్యా స్థలంలో ఆధారాల చెరిపివేత అభియోగాలు మాత్రమే ఉన్నాయంటూ పిటిషనర్‌ తప్పించుకోవాలని చూస్తున్నారని, వివేకాను హత్య చేయడానికి కుట్ర చేశారనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి తదితరులతో శివశంకర్‌రెడ్డి హత్యకు కుట్ర చేశారని.. దీనిని అమలు చేయడానికి ఏ-1 గంగిరెడ్డిని ఎంచుకున్నారని తెలిపారు. అంతా మేం చూసుకుంటామని దస్తగిరికి స్వయంగా ఫోన్‌లో భరోసా ఇచ్చారని తెలిపారు. అవినాశ్‌రెడ్డి తదితరులతో శివశంకర్‌రెడ్డి చర్చలు జరిపిన వాట్సా్‌పకాల్‌ డేటా, గూగుల్‌ టేకౌట్‌ డేటా ఉందన్నారు. రెండేళ్లుగా శివశంకర్‌రెడ్డికి, వివేకాకు మాటలు లేవని.. అయినప్పటికీ వివేకా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని తెలిపారు. హత్య కుట్ర అమలుకు రూ.40 కోట్లు అందజేశారని తెలిపారు. ఎమ్మెల్సీ సీటు రాకపోవడానికి వివేకానే కారణమనే కోపం ఉందని, కడప జిల్లాల్లో పోలీసు యంత్రాంగం మొత్తం శివశంకర్‌రెడ్డి చెప్పుచేతల్లో ఉందని పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ నుంచి ఎస్పీ వరకు బదిలీలు, ప్రమోషన్‌లు ఆయన చేతిలోనే ఉన్నాయన్నారు. అదనపు ఎస్పీ స్థాయి వ్యక్తి ప్రమోషన్‌ గురించి చర్చించిన కాల్‌డేటా కూడా ఉందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులతో మాట్లాడిన డేటా ఉందని తెలిపారు. ‘సునీత ఉంటే కదా’ అని బీటెక్‌ రవిని బెదిరించారని, రవి జైల్లో ఉన్నప్పుడు ఆయనను కలిసిన ఎంపీ సీఎం రమేశ్‌కు ఈ విషయం రవి చెప్పారని కోర్టుకు వివరించారు. సునీత, ఆమె భర్తపైనా కేసులు పెడుతున్నారని, వారికి ప్రాణభయం ఉందని తెలిపారు. ఈ హత్య కేసుకు సంబంధించి శివశంకర్‌రెడ్డి అరెస్టు కాకముందు నుంచి అందరిపైనా నిఘా పెట్టారని చెప్పారు. సాక్షుల స్టేట్‌మెంట్‌లు, ప్రెస్‌మీట్ల వివరాలు, సునీతారెడ్డి చార్జిషీట్‌ కాపీ తీసుకున్న విషయాలు వంటి వివరాలను శివశంకర్‌రెడ్డి సేకరించారని తెలిపారు.

భయభ్రాంతులకు గురిచేశారు: సీబీఐ

సీబీఐ తరఫున స్పెషల్‌ పీపీ అనిల్‌ తల్వార్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ శివశంకర్‌రెడ్డి సాక్షులను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. అందుకే సీఐ శంకరయ్య, గంగాధర్‌రెడ్డి వంటివారు కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి రాలేదన్నారు. సీబీఐ దర్యాప్తు అధికారిపైనే కేసులు పెట్టారని పేర్కొన్నారు. శివశంకర్‌రెడ్డి బయటకు వస్తే సాక్షులు తీవ్రంగా ప్రభావితమవుతారని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వివేకా హత్య కుట్రలో శివశంకర్‌రెడ్డి భాగస్వామ్యం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. పిటిషనర్‌పై ఉంది ఆధారాల చెరిపివేత అభియోగాలు మాత్రమేనని.. ఏడేళ్లలోపు జైలుశిక్ష పడే అభియోగాలే కాబట్టి బెయిల్‌ ఇవ్వాలని కోరారు. ఆధారాల చెరిపివేతకే దీర్ఘకాలం జైల్లో ఉంచడం సరికాదన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

Updated Date - Jan 06 , 2024 | 02:49 AM