10న మేదరమెట్లలో ‘సిద్ధం’ మహాసభ
ABN , Publish Date - Mar 03 , 2024 | 02:49 AM
ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన ఈ నెల 10న నాల్గవ సిద్ధం మహాసభ జరుగుతుందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు.
త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తాం: విజయసాయిరెడ్డి
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 2: ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన ఈ నెల 10న నాల్గవ సిద్ధం మహాసభ జరుగుతుందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సభ అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని చెప్పారు. ఒంగోలులో శనివారం ఆయన ‘సిద్ధం’ సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మేదరమెట్ల సభకు తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలోని 43 నియోజకవర్గాల నుంచి 15 లక్షల మంది హాజరవుతున్నట్లు తెలిపారు. వంద ఎకరాల స్థలంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. త్వరలో మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు. ఎమ్యెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గతంలో జరిగిన వాటి కంటే భారీస్థాయిలో ప్రజలు హాజరయ్యేలా మేదరమెట్ల సభ నిర్వహిస్తామన్నారు.