Share News

80% మూత!

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:36 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో.. ప్లాంటులోని ఒక్కో విభాగాన్ని షట్‌డౌన్‌ చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్లాంటు మూసివేత తప్ప మరో మార్గం లేదని కార్మిక వర్గాలు

80% మూత!

స్టీల్‌ప్లాంటులో ఒక్కో విభాగం షట్‌డౌన్‌

పోర్టు కార్మికుల సమ్మెతో.. ‘ఉక్కు’కు ఆగిన బొగ్గు

చోద్యం చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో.. ప్లాంటులోని ఒక్కో విభాగాన్ని షట్‌డౌన్‌ చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్లాంటు మూసివేత తప్ప మరో మార్గం లేదని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పక్కనే ఉన్న అదానీ గంగవరం పోర్టులో కార్మికుల ఆందోళన వల్ల ప్లాంటుకు ముడి పదార్థాల సరఫరా ఆగిపోయిన సంగతి తెలిసిందే. బొగ్గు లేకపోవడం వల్ల స్టీల్‌ప్లాంటులో అత్యంత కీలకమైన కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలు మూడింటిని ఆపేశారు. ఇంకో రెండింటిని నామమాత్రంగా నడుపుతున్నారు. అవి కూడా కొన్ని గంటలే నడుస్తాయని అంటున్నారు. సింటర్‌ ప్లాంటు, స్టీల్‌ మెల్టింగ్‌ షాపు, బ్లాస్ట్‌ ఫర్నేసులు, వైర్‌ రాడ్‌ మిల్స్‌...ఇలా అన్నింటినీ 80 శాతం షట్‌డౌన్‌ చేశారు. తక్షణమే బొగ్గు సరఫరాను పునరుద్ధరించకపోతే భారీనష్టం వాటిల్లుతుందని యాజమాన్యం ఆందోళన చెందుతోంది. కాగా.. గంగవరం పోర్టులోని నౌకల్లో ఉన్న బొగ్గు తెచ్చుకునేందుకు స్టీల్‌ప్లాంటు యాజమాన్యం ఒక ప్రణాళిక రూపొందించింది. ఇందుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేలా 15 మంది కార్మికులను సిద్ధం చేసింది. మంగళవారం సాయంత్రం ఓ ఐదుగురిని పోర్టు వెనుక గేటు నుంచి లోపలకు పంపించింది. వారు నౌకల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయగా, పోర్టు కార్మికులు అడ్డుకుని, వెనక్కి పంపేశారు. మంగళవారం రాత్రి మరో బృందాన్ని పంపగా.. వారిని కూడా వెనక్కి పంపేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక పోర్టు యాజమాన్యం ప్రతినిధులే ఫోన్‌ చేసి, బొగ్గు తీసుకువెళ్లడానికి రావాలని కోరారు. దాంతో మరో బృందం పోర్టులోకి వెళ్లగా.. పోర్టు ఉన్నతాధికారి ఒకరు వారికి అడ్డం పడ్డారు. దీంతో ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. విశాఖ స్టీల్‌ప్లాంటులో ఇంత సంక్షోభం నెలకొన్నా.. అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్రం గానీ స్పందించడం లేదు. సమస్య పరిష్కరించే దిశగా ఎటువంటి చర్యలు, చర్చలు చేపట్టలేదు. వారు, వారు గొడవలు పడితే.. స్టీల్‌ప్లాంటు మూత పడుతుందని, తమకూ అదే కావాలన్నట్టుగా రెండు ప్రభుత్వాలూ చోద్యం చూస్తున్నాయి.

Updated Date - Apr 18 , 2024 | 03:36 AM