Share News

ఒకవైపే సీఎస్‌ చూపు

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:44 AM

రాష్ఠ్రంలో ఉద్యోగులకు ఆదర్శప్రాయంగా ఉండాల్సి న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి కేవలం ఒక్క వైపే చూస్తున్నారు.

ఒకవైపే సీఎస్‌ చూపు

విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల బదిలీల్లో భాగంగా ఏపీలో పనిచేస్తున్న రెండువేలమంది ఉద్యోగులు తెలంగాణకు వెళతామని ఏళ్ల తరబడి అడుగుతున్నారు. సీఎస్‌ చిన్న సంతకం చేస్తే రిలీవ్‌ అవ్వాలని ఎదురుచూస్తున్నారు. వారందరినీ కాదని సీఎంవోలో సీఎం, అధికారుల డిజిటల్‌ సంతకాలు ఫోర్జరీ చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఉద్యోగిని ఆగమేఘాలపై తెలంగాణకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఒక ‘సంతకాల దొంగ’ పట్ల సీఎస్‌ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ రాష్ట్ర సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణకు వెళ్లేందుకు 2 వేల మంది ఉద్యోగులు

సీఎస్‌ సంతకం కోసం ఎదురుచూపులు

వారిని కాదని ‘సంతకాల దొంగ’కు ఏర్పాట్లు

సీఎంవో స్కామ్‌ నిందితుడిపై అంత ప్రేమేంటో!

సీఎం డిజిటల్‌ సంతకం ఫోర్జరీ చేసిన అటెండరు

బెయిల్‌పై రాగానే హైదరాబాద్‌ లేక్‌వ్యూకు

ఇప్పుడు శాశ్వతంగా తెలంగాణకు పంపే ఏర్పాట్లు

ప్రభుత్వం మారితే తిప్పలు తప్పవనుకుంటున్నారా?

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

రాష్ఠ్రంలో ఉద్యోగులకు ఆదర్శప్రాయంగా ఉండాల్సి న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి కేవలం ఒక్క వైపే చూస్తున్నారు. తన పేషీలో అటెండర్‌గా పనిచేస్తూ సీఎంవోలో సీఎం సంతకం సహా మిగిలిన సెక్రటరీల డిజిటల్‌ సంతకాలు చోరీ చేసి, సొమ్ము చేసుకున్న ఘనుడికి రాచమర్యాదలు జరుగుతున్నాయి. సీఎంవోలో డిజిటల్‌ సంతకాల చోరీ అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చిన తర్వాత సీఐడీ క్రిమినల్‌ కేసు పెట్టి సీఎస్‌ పేషీ అటెండర్‌ అబ్దుల్‌ రజాక్‌ సహా సీఎంవోలో పనిచేస్తున్న మరో నలుగురిని అరెస్టు చేసింది. ఆ ఐదుగురు రెండు నెలలపాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌ వచ్చిం ది. ఈ ఐదుగురిలో ఒక్క రజాక్‌ని మాత్రమే తెలంగాణలోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌ్‌సలో విధులు నిర్వర్తించడానికి సీఎస్‌ డిప్యుటేషన్‌పై పంపారు. మిగిలిన నలుగురూ చిరుద్యోగులు. హోటళ్లలోనో, మరోచోటో పనిచేస్తున్నారు. ఇది జరిగి మూడు నెలలవుతోంది. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే, అకస్మాత్తుగా అబ్దుల్‌ రజాక్‌ను శాశ్వతంగా తెలంగాణకు పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు రజాక్‌ ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. 2021లో సచివాలయంలో పనిచేస్తున్న క్లాస్‌ - 4 ఉద్యోగులు దాదాపు 200 మంది తెలంగాణకు వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో వచ్చిన 10 రోజుల్లోనే దాదాపు 200 మంది ఉద్యోగులు తెలంగాణకు వెళ్లిపోయారు. ఇందులో రజాక్‌ కూడా ఉన్నారు. కానీ, ఆయన వెళ్లలేదు. ఇక్కడ సీఎంవోలో, సీఎస్‌ పేషీలో పనిచేస్తూ, డిజిటల్‌ సంతకాల చోరీ ద్వారా రెండు చేతులా అక్రమార్జన చేస్తూ ఉండిపోయారు. ఒక్కసారిగా స్కామ్‌ బయటపడడం, అరెస్టవడం, బెయిల్‌పై బయటకు రావడం జరిగిపోయాక వీరిలో కొత్త భయం మొదలైంది. ప్రభుత్వం మారితే సీఎంవోలో స్కామ్‌ అంతా తవ్వితే ఇంకేం బయటపడతాయో, అప్పుడెవరెవరు ఇరుక్కుపోతామోనని ఆందోళన పడుతున్నారు. అందుకే ఆ స్కామ్‌ ఆనవాళ్లు పూర్తిగా చెరిపేయడంలో భాగంగానే రజాక్‌ను తెలంగాణకు పంపించేస్తున్నారని తెలుస్తోంది. 2021లో క్లాస్‌ - 4 ఉద్యోగుల కేటగిరీలో తెలంగాణకు వెళ్లేందుకు తనకు అవకాశం లభించినా కొవిడ్‌ కారణంగా వెళ్లలేకపోయాను, ఇప్పుడు ఆ అనుమతి వినియోగించుకొనే చాన్స్‌ ఇవ్వమని రజాక్‌ వినతిపత్రం ఇచ్చారు. సాధారణంగా ఏ కేడర్‌లో ఉన్నప్పుడు అనుమతి లభిస్తే ఆ కేడర్‌లోనే అంతర్రాష్ట్ర బదిలీ జరగాలి. కానీ, రజాక్‌కు క్లాస్‌ -4 ఉద్యోగిగా ఉన్నప్పుడు అనుమతి లభించింది. ఆ తర్వాత ఆయనకు ప్రమోషన్‌ వచ్చి క్లాస్‌ - 3 ఉద్యోగి అయ్యారు. ఇప్పుడు ఆ అవకాశం ఎలా వినియోగించుకోగలరు? పైగా క్రిమినల్‌ కేసులో అరెస్టై బెయిల్‌పై ఉన్న ఉద్యోగిని వేరే రాష్ట్రానికి శాశ్వతంగా ఎలా పంపిస్తారు ? ఈ వ్యక్తి ఫోన్‌ ద్వారా సీఎంవో స్కామ్‌కి సంబంధించి లక్షల రూపాయల లావాదేవీలు జరిగాయని సీఐడీ గుర్తించింది. ఇలాంటి వ్యక్తిపై సీఎస్‌ కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆ ఉద్యోగులను చూడరా?

విభజనచట్టం ప్రకారం ఏర్పాటైన కమిటీ సూచనల మేరకు రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జరగాలి. కానీ, ఏపీ వైపు నుంచి ఎలాంటి ముందడుగు పడడంలేదు. దాదాపు 2,000 మంది సీఎస్‌ జవహర్‌రెడ్డి చేయాల్సిన ఒక్క సంతకం కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో భార్య, భర్త చెరో చోట, పిల్లలు మరో చోట, తల్లిదండ్రులు ఇంకో చోట ఉన్న కేసులే దాదాపుగా అన్నీ. సీఎస్‌ ఒప్పుకొంటే వారంతా తెలంగాణకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం సీఎస్‌ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మంత్రులతో సిఫారసు కూడా చేయించుకుంటున్నారు. కానీ,వీరిని సీఎస్‌ కనికరించడం లేదు.

ఇది ఏనాటి బంధమో!

అబ్దుల్‌ రజాక్‌ అరెస్టయ్యేవరకు సీఎస్‌ కార్యాలయం అటెండర్‌గా పనిచేశారు. 15 ఏళ్లుగా వివిధ సీఎ్‌సల వద్ద ఈ వ్యక్తి అటెండర్‌గా పనిచేస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు సీఎంవోలో పనిచేశారు. ఆ సమయంలో జవహర్‌ రెడ్డి సీఎం కార్యాలయ కార్యదర్శిగా ఉన్నారు. 2014-19 వరకు కూడా రజాక్‌ సీఎంవోలో అటెండర్‌గానే ఉన్నారు. 2019లో ప్రభుత్వ సలహాదారు పీవీ రమేశ్‌ దగ్గర అటెండర్‌గా చేశారు. ఆ తర్వాత నీలం సాహ్ని దగ్గర అటెండర్‌గా చేస్తూ, ఆమె ఎన్నికల కమిషనర్‌ కాగానే, ఆమెతో పాటు ఎన్నికల కమిషన్‌కి వెళ్లిపోయారు. ఆ తర్వాత జవహర్‌ రెడ్డి సీఎంవోలోకి రాగానే తిరిగి సీఎంవోలో అటెండర్‌గా చేరారు. ఆ తర్వాత జవహర్‌ రెడ్డి సీఎస్‌ అయ్యాక ఆయన వెంటే రజాక్‌ కూడా సీఎస్‌ కార్యాలయానికి వచ్చారు. కెరీర్‌ మొదట్నుంచీ సీఎంవో, సీఎస్‌ కార్యాలయం తప్ప మరెక్కడా పనిచేయడం లేదంటేనే రజాక్‌ ఎంతటి సమర్థుడో అర్థం చేసుకోవచ్చునని సచివాలయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Updated Date - Apr 06 , 2024 | 03:44 AM