Share News

‘శిరోముండనం’ కేసు విచారణ వాయిదా

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:02 AM

దళిత యువకులకు శిరోముండనం చేసిన ఘటనలో విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన అప్పీలు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.

‘శిరోముండనం’ కేసు విచారణ వాయిదా

బాధితులను ప్రతివాదులుగా చేర్చండి

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు హైకోర్టు ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): దళిత యువకులకు శిరోముండనం చేసిన ఘటనలో విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన అప్పీలు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. బాధితుల తరఫున న్యాయవాదులు ఎన్‌.అశ్వనీకుమార్‌, జవ్వాజి శరత్‌చంద్ర వాదనలు వినిపిస్తూ... ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 15(ఏ) ప్రకారం బాధితులను ప్రతివాదులుగా చేర్చకుండా లేదా వారికి నోటీసులు ఇవ్వకుండా అప్పీలుపై విచారణ జరపడానికి వీల్లేదని పేర్కొన్నారు. బాధితులు తమ వాదనలు చెప్పుకొనే అవకాశం ఇవ్వాల్సి ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు బాధితులను ప్రతివాదులుగా చేర్చాలని అప్పీలుదారుల తరఫు న్యాయవాదులను ఆదేశించారు. విచారణను మే 1కి వాయిదా వేశారు. దళిత యువకులకు శిరోముండనం చేయడంతో పాటు వారి మీసాలు, కనుబొమలు తొలగించిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మరో ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించి విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వారికి 18 నెలలు జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.42 వేలు చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లింపులో విఫలమైతే మరో 6 నెలలు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మరో ఎనిమిది మంది హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.

Updated Date - Apr 24 , 2024 | 07:14 AM