అన్నా వదినలకు షర్మిల బాకీ!
ABN , Publish Date - Apr 21 , 2024 | 03:57 AM
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శనివారం కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు.
రూ.82 కోట్లకుపైగా అప్పిచ్చారని వెల్లడి
అన్న జగన్ ఇచ్చింది రూ.82.58 కోట్లు
వదిన భారతి ఇచ్చింది రూ.19.56 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 కేసులు
అఫిడవిట్‌లో వివరించిన పీసీసీ చీఫ్
కడప, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శనివారం కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు. అప్పుల విషయానికి వస్తే షర్మిల తన సొంత అన్న, వదినలకే రూ.82 కోట్లకు పైగా బకాయి ఉన్నారు. అన్న జగన్ రూ.82,58,15,000, వదిన భారతి రూ.19,56,620 షర్మిలకు అప్పులు ఇచ్చారు. ఇక, షర్మిల తన భర్త అనిల్‌కు రూ.30 కోట్లు అప్పు ఇచ్చారు. తల్లి విజయలక్ష్మి ద్వారా భర్త అనిల్‌కు రూ.40 లక్షలు అప్పు ఇప్పించారు. షర్మిల పేరుతో బ్యాంకు డిపాజిట్లు రూ.14.64 కోట్లు ఉండగా, భర్త అనిల్ పేరిట రూ.3.80 కోట్లు ఉన్నాయి. షర్మిల పేరిట షేర్లు రూ.2 కోట్లు, అనిల్ పేరిట రూ.2.50 కోట్లు ఉన్నాయి. ఆస్తుల విషయానికి వస్తే షర్మిల పేరుతో రూ.123 కోట్లు, భర్త అనిల్ పేరుతో రూ.40 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా షర్మిలకు ఉన్న బంగారు ఆభరణాల విలువ రూ.3.69 కోట్లు, వజ్రాల విలువ రూ.4.61 కోట్లు, అనిల్ పేరిట ఉన్న వజ్రాల విలువ రూ.42.60 లక్షలు, బంగారు ఆభరణాల విలువ రూ.81.60 లక్షలు ఉన్నట్టు అఫిడవిట్‌లో వివరించారు. షర్మిలకు బ్యాంకు ఖాతాల్లో నగదు రూ.22.09 లక్షలు ఉంటే, ఇడుపులపాయలో 39 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కేసుల విషయానికి వస్తే.. షర్మిలపై ఏపీ తెలంగాణలో 8 కేసులు నమోదయ్యాయి. వాటిలో కడపలో ఎన్నికల ప్రచార సమయంలో ఒకటి, విజయవాడలో ఒక కేసు, మిగిలినవి తెలంగాణలో ఉన్నాయి.