Sharmila : న్యాయం వైపా, నేరం వైపా?
ABN , Publish Date - May 10 , 2024 | 04:54 AM
‘ప్రపంచమంతా కడప వైపు చూస్తోంది. కడప ప్రజలు న్యాయం వైపో, నేరం వైపో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’
కడప ప్రజలు ఆలోచించాలి
చెల్లెళ్ల కన్నా భార్య తరపు బంధువులే ఎక్కువయ్యారా?: షర్మిల
ఓట్లతో షర్మిల కొంగు నింపండి: సౌభాగ్యమ్మ
పులివెందుల, మే 9: ‘ప్రపంచమంతా కడప వైపు చూస్తోంది. కడప ప్రజలు న్యాయం వైపో, నేరం వైపో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో గురువారం ఆమె బస్సు యాత్ర నిర్వహించారు. వేంపల్లె, వేముల, లింగాల, పులివెందుల మండలాల్లో యాత్ర సాగింది. షర్మిల మాట్లాడుతూ ఓటర్లు న్యాయం వైపు నిలబడాలని, హంతకులకు శిక్ష పడేలా చూడాలని పిలుపునిచ్చారు. ‘వివేకానందరెడ్డిని అంత క్రూరంగా ఏడుసార్లు గొడ్డలితో నరికి చంపితే.. సాక్షి చానెల్‌లో మాత్రం హార్ట్‌అటాక్ అని చెప్పారు. సాక్షి చానెల్ నడుపుతున్నది వైఎస్ భారతి. అలా ఎందుకు చెప్పారో ఈ రోజు వరకూ సమాధానం చెప్పలేదు. అవినాశ్‌రెడ్డిని కాపాడాల్సిన అవసరం ఏముంది? చెల్లెళ్లు ఒకవైపు.. భార్య బంధువులు మరోవైపు ఉన్నారు. చెల్లెళ్ల కంటే వారే ఎక్కువయ్యారా?’ అని ప్రశ్నించారు. ‘చిన్నాన్న హత్యకుగురైతే నిందితుల పక్షాన మూర్ఖంగా ఎందుకు నిలబడ్డారో జగన్ సమాధానం చెప్పలేదు. ఐదేళ్లుగా నిందితుడిని కాపాడుకుంటూ రావడమే కాకుండా మళ్లీ అదే నిందితుడు అవినాశ్‌రెడ్డికి టికెట్ ఇచ్చాడు. ‘అవినాశ్‌రెడ్డి నిర్దోషి అని జనగ్ నమ్ముతున్నారట. కాబట్టి ఆయనకు సపోర్టు చేస్తున్నారట. గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఏముంది. జగన్ కన్విన్స్ అయితే ప్రపంచం మొత్తం కన్విన్స్ కావాలా? ఆయన ఏమన్న లా నా? కాన్‌స్టిట్యూషనా?. కన్విన్స్ కావాల్సింది ప్రజలు కాదా, సీబీఐ కాదా, జడ్జిలు కాదా? అని ప్రశ్నించారు. మీ అందరి ఓట్లతో షర్మిల కొంగు నింపాలని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ ప్రజలను కోరారు. రాజశేఖర్‌రెడ్డి పరిపాలన చూడాలంటే షర్మిలతోనే సాధ్యమన్నారు.