Share News

Sharmila : సీబీఐ చార్జిషీటులో వైఎ్‌సను చేర్చింది మేం కాదు!

ABN , Publish Date - May 12 , 2024 | 04:23 AM

జగన్మోహన్‌రెడ్డిపై అక్రమాస్తుల కేసు చార్జిషీటులో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరును కాంగ్రెస్‌ పార్టీ చేర్చలేదని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.

Sharmila : సీబీఐ చార్జిషీటులో వైఎ్‌సను చేర్చింది మేం కాదు!

ఆయన పాదయాత్రే నా జోడో యాత్రకు స్ఫూర్తి

నా తండ్రితో వైఎస్‌ బంధం రాజకీయం కాదు

వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారు

బీజేపీ సిద్ధాంతానికి రాజశేఖర్‌రెడ్డి వ్యతిరేకం

జగన్‌ మాత్రం ఒక్క మాటా అనడం లేదు

ఎందుకంటే ఆయనపై అవినీతి కేసులున్నాయి

షర్మిల నా చెల్లి.. గెలిపిస్తామని మాటివ్వండి

కడప ప్రజలకు రాహుల్‌గాంధీ అభ్యర్థన

కడప, మే 11 (ఆంధ్రజ్యోతి): జగన్మోహన్‌రెడ్డిపై అక్రమాస్తుల కేసు చార్జిషీటులో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరును కాంగ్రెస్‌ పార్టీ చేర్చలేదని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ఇది వారి (జగన్‌ అండ్‌ కో) స్వలాభం కోసం చేసిన పనిగా తేల్చిచెప్పారు. ‘రాజశేఖర్‌రెడ్డి మా మనిషి. ఆయనకెప్పుడూ నష్టం రానివ్వం. రాజశేఖర్‌రెడ్డి సిద్ధాంతం కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతం. మేం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం’ అని తేల్చిచెప్పారు. ఆయన చేసిన పాదయాత్ర తన ‘భారత్‌ జోడో యాత్ర’కు స్ఫూర్తిగా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారమిక్కడ పుత్తా ఎస్టేట్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో రాహుల్‌ పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో కడప చేరుకున్న ఆయన అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయ వచ్చారు. పీసీసీ అధ్యక్షురాలు, కడప లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి వైఎస్‌ షర్మిలారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌తో కలిసి రాహుల్‌ వైఎస్‌ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కడప సభావేదిక వద్దకు చేరుకున్నారు. తన తండ్రి రాజీవ్‌గాంధీ, రాజశేఖర్‌రెడ్డి సోదరులని తెలిపారు. వారిది చాలా సంవత్సరాల పురాతన స్నేహమన్నారు. ‘రాజశేఖర్‌రెడ్డి కేవలం ఈ రాష్ట్రానికి మాత్రమే దారి చూపించలేదు, దేశానికి మొత్తం ఆయన మార్గదర్శకులయ్యారు. ఆయన చేసిన పాదయాత్రే నా భారత్‌ జోడో యాత్రకు స్ఫూర్తి. నా తండ్రి పోయాక రాజశేఖర్‌రెడ్డే నా మెంటార్‌గా వ్యవహరించారు. భారతదేశం మొత్తం పాదయాత్ర చేయాలని ఆయన నాతో అన్నారు. నేను నాయాత్ర ద్వారా విద్వేష వీధుల్లో ప్రేమ దుకాణాలు తెరిచానంటే.. అది ఆయన ప్రోద్బలం, ప్రోత్సాహం వల్లే’ అని వివరించారు. పేదల కోసం, సామాజిక న్యాయం కోసం రాజశేఖర్‌రెడ్డి రాజకీయాలు చేశారని.. ఇప్పుడది రాష్ట్రంలో లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదని ఆక్షేపించారు. ఈరోజు రాష్ట్రాన్ని బీజేపీ బీ టీం నడిపిస్తోంది.

మేం రాగానే హామీల అమలు..

ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ముందు తలవంచుకుని నిలబడిందని.. వాళ్లు అవినీతి కూపంలో మునిగిపోయారని రాహుల్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే చేసిన వాగ్దానాలు అమలు చేసేదన్నారు. ‘2024లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే పదేళ్ల ప్రత్యేకహోదా లభిస్తుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి తీరతాం, కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మిస్తాం. ప్రతి వాగ్దానం నెరవేర్చుతాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాగ్దానాలు చేశాం. రూ.2 లక్షల రైతు రుణమాఫీ.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.. 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. నిరుపేదలకు రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడగానే రెండు మూడు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. దేశంలో ఉన్న ప్రతి పేద కుటుంబం జాబితాను తయారు చేస్తాం. ప్రతి కుటుంబం నుంచి ఓ మహిళను ఎన్నుకుని ప్రతి నెలా రూ.8,500 చొప్పున ఆమె ఖాతాలో ఏటా లక్ష జమ చేయబోతున్నాం. కోట్లాది మందిని లక్షాధికారులను చేయాలనుకుంటున్నాం. సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారని మీడియా అంటోందని రాహుల్‌ ఆక్షేపించారు. కానీ మోదీ కొందరు పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు అప్పనంగా అప్పజెప్పితే మాత్రం.. విప్లవం జరుగుతోంది, అభివృద్ధి జరుగుతోందని మీరంతాఅంటారు. మీరందరూ అదానీ మీడియా..భారతదేశ మీడియా కానేకాదు’అని విమర్శించారు.


ప్రధానికి జగన్‌ భయపడుతున్నారు..

జగన్‌ ప్రభుత్వం ప్రధానికి భయపడుతోందని.. అది ఈ రాష్ట్రానికి మంచిది కాదని రాహుల్‌ అన్నారు. ‘కాంగ్రె్‌సకు, రాజశేఖర్‌రెడ్డికి ఉన్న సంబంధం ఏంటంటే.. ఉభయులూ ఒక్కటే. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రె్‌సలో ఉన్నారు, కాంగ్రెస్‌ రాజశేఖర్‌రెడ్డిలో ఉంది. మా పార్టీ ఆయన ఆలోచనలకు వ్యతిరేకతంగా ఎప్పుడూ ప్రవర్తించదు. సీబీఐ చార్జిషీటులో కాంగ్రెస్‌ ఆయన పేరు చేర్చిందన్నది పూర్తిగా అబద్ధం.. ఈరోజు రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, నా చెల్లెలు షర్మిల మీ ముందు నిలబడ్డారు. రాజశేఖర్‌రెడ్డి సైద్ధాంతిక ఆలోచనలు పార్లమెంటులో వినపడాలంటే ఆమె పార్లమెంటులో ఉండాలి. షర్మిలను మోదీ ఏమీ చేయలేరు. ఆమె ముందు సీబీఐ, ఈడీ నిలబడలేవు. ఆమెను లోక్‌సభకు పంపుతానని నాకు వాగ్దానం చేయండి’ అని ప్రజలను కోరారు.

జగన్‌ ఊసరవెల్లి

ఏది పడితే అది మాట్లాడుతున్నాడు: షర్మిల

అన్నా.. అక్కా మీరు ఏవైపు? కడప ప్రజలు న్యాయంవైపు నిలబడతారా.. నేరం వైపు నిలబడతారా..? న్యాయాన్ని గెలిపిస్తారా.. నేరాన్ని గెలిపిస్తారా అని దేశం కాదు.. ప్రపంచం మొత్తం చూస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి అన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఊసరవెల్లిలా ఏదిపడితే అది మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. సొంత చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇంత వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ నిందితులను కాపాడుతున్నారని.. రాజకీయాల కోసం ఇంత దిగజారడం అవసరమా అని నిలదీశారు. అది భరించలేకనే న్యాయం కోసం ఎదురునిలబడ్డానని తెలిపారు. కడప సభలో ఆమె మాట్లాడుతూ.. పదేపదే రాజశేఖర్‌రెడ్డి పేరును సీబీఐ చార్జిషీట్‌లో కాంగ్రెస్‌ పార్టీ చేర్చిందని జగన్‌ చెబుతున్నారని.. అయితే అలా చేసింది కాంగ్రెస్‌ కాదని.. జగనేనని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా శాండ్‌, ల్యాండ్‌, లిక్కర్‌ మాఫియా. ఇవన్నీ సరిపోవన్నట్లు చిన్నాన్నను హత్య చేసిన వాళ్లను జగన్‌ పక్కనపెట్టుకుని తిరుగుతున్నాడు. జగన్‌ ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు.. ఇచ్చిన ఒక్క వాగ్దానమైనా నెరవేర్చారా? బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు.. వచ్చిందా అన్నా.. వచ్చిందా అక్కా (జనం లేదు లేదని నినదించారు)..? మనకుందా రాజధాని..?’’ అని షర్మిల ప్రశ్నించారు. కాగా, కడప సభలో షర్మిల హావభావాలు, ప్రసంగం ఆద్యంతం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని తలపించాయి. ఆమె వేదిక పైకి ఎక్కి మాట్లాడుతూ చేయి ఊపడం, ప్రజలకు అభివాదం చేయడం అంతా తండ్రిలానే ఉండడం జనాన్ని బాగా ఆకట్టుకుంది.

Updated Date - May 12 , 2024 | 04:23 AM