Share News

AP Politics : అయ్యో జగన్ బాణం రివర్స్.. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్‌ ఇచ్చిన కీలక హామీ ఏంటి..!?

ABN , Publish Date - Jan 06 , 2024 | 02:57 AM

‘జగనన్న వదిలిన బాణం’... దిశ మార్చుకుని జగన్‌పైకే వదిలిన బాణంలా మారుతోంది. కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్న సీఎం జగన్‌ సోదరి షర్మిల...

AP Politics : అయ్యో జగన్ బాణం రివర్స్.. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్‌ ఇచ్చిన కీలక హామీ ఏంటి..!?

త్వరలో జనంలోకి షర్మిల

జగన్‌ను అధికారం నుంచి దించేయడమే లక్ష్యం

కాంగ్రెస్‌ పెద్దలకు షర్మిల స్పష్టీకరణ!

మా ఇద్దరికీ సంబంధాలు సరిగా లేవు

నా రాజకీయ ఆకాంక్షలను తొక్కి పెట్టాడు

ఏపీలో జగన్‌ పాలన అస్తవ్యస్తం

ఎవరినీ కలవరు... ప్యాలెస్‌కే పరిమితం

ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో షర్మిల భేటీ

కర్తవ్య బోధ చేసిన అధిష్ఠానం పెద్దలు

పీసీసీ చీఫ్‌, కర్ణాటక నుంచి రాజ్యసభ?

రాహుల్‌ సుముఖంగా ఉన్నారని వెల్లడి!

కాంగ్రెస్‌ పూర్వవైభవానికి కార్యాచరణ

(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)

‘జగనన్న వదిలిన బాణం’... దిశ మార్చుకుని జగన్‌పైకే వదిలిన బాణంలా మారుతోంది. కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్న సీఎం జగన్‌ సోదరి షర్మిల... ఏపీలో జగన్‌ను గద్దెదించి, కాంగ్రె్‌సను అధికారంలోకి తెచ్చేందుకు సంపూర్ణంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రె్‌సలో విలీనం చేసిన షర్మిల... శుక్రవారం హైదరాబాద్‌ తిరిగి వెళ్లే ముందు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కీలక చర్చలు జరిపారు. ఖర్గేతో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ కూడా పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... జగన్‌ పాలనపై షర్మిల తన అభిప్రాయాలను సూటిగా చెప్పారు. ‘‘జగన్‌ పాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్‌ ఏ ప్రజా ప్రతినిఽధినీ కలుసుకోరు. తాడేపల్లి ప్యాలె్‌సకే పరిమితమవుతున్నారు’’ అని చెప్పారు. ఇక... తన రాజకీయ ఆకాంక్షలపై జగన్‌ నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జైలు పాలైనప్పుడు రాష్ట్రమంతటా తిరిగి వైసీపీని నిలబెట్టానని షర్మిల వివరించారు. తమ మధ్య సంబంధాలు సరిగా లేవని చెప్పారు. తన తండ్రి వైఎస్‌ కలను నెరవేర్చేందుకే తాను కాంగ్రె్‌సలో చేరానని, కాంగ్రె్‌సను అధికారంలోకి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జగన్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, బాబాయి వివేకానంద రెడ్డి హత్య, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం, ఒంటెత్తు పోకడలు అవలంబించడం తదితర అంశాలను ఆమె సమగ్రంగా వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వైసీపీలో ఉన్న పలువురు సీనియర్లు, నేతలు తనతో టచ్‌లో ఉన్నారని కూడా ఆమె చెప్పినట్లు సమాచారం.

పీసీసీ... రాజ్యసభపై సంకేతాలు..

జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు శాయశక్తులా పోరాడాలని షర్మిలను అధిష్ఠానం పెద్దలు కోరారు. ఆమెకు పీసీసీ పగ్గాలు అప్పగించాలని రాహుల్‌గాంధీ భావిస్తున్నారని, ఆయన అంచనాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఏప్రిల్‌లో కర్ణాటక నుంచి షర్మిలకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘‘కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన సేవలు మరువలేం. కానీ... జగన్‌ మూలంగా ఏపీలో పార్టీ తీవ్రంగా దెబ్బతింది. ఆ నష్టాన్ని పూరించే బాధ్యతను మీకు అప్పగిస్తున్నాం’’ అని షర్మిలకు ఖర్గే, వేణుగోపాల్‌ చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పునరుత్థానానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించాలని, ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా వైసీపీ నుంచి సీనియర్‌ నేతలను చేర్చుకోవడం, జగన్‌ పాలనలో వైఫల్యాలను ఎండగడుతూ శ్వేతపత్రాన్ని రూపొందించడం వంటి అంశాలపై షర్మిలతో చర్చించినట్లు తెలుస్తోంది. జగన్‌ ఓటు బ్యాంకుగా భావిస్తున్న దళిత క్రైస్తవులను ఆకర్షించేందుకు తాను బ్లూప్రింట్‌ను రూపొందిస్తానని షర్మిల భర్త అనిల్‌ కూడా చెప్పినట్లు సమాచారం. త్వరలో ఆయన పర్యటించనున్నట్లు తెలిసింది. కాగా... తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా షర్మిల పార్టీ పెద్దల్ని ఆహ్వానించారు. ఢిల్లీలో, హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని, ఒకటి రెండు రోజుల్లో స్పష్టత లభిస్తుందని షర్మిల చెప్పారు.

ఖర్గేతో రుద్రరాజు చర్చలు

శుక్రవారం సాయంత్రం పీసీసీ అఽధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పద్మశ్రీ సుంకర తదితరులు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో జగన్‌ పాలన ఘోరంగా ఉన్నదని వారు ఖర్గేకు వివరించారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించాలని ఖర్గేను కోరామని, ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేశారని రుద్రరాజు తెలిపారు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలోకి రావడంవల్ల పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొందని తెలిపారు.

Updated Date - Jan 06 , 2024 | 11:11 AM