Share News

రాయలకోటలో శంకర్‌దాదా

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:52 AM

సొంత నియోజకవర్గంలో బలమైన నేత ఉండటంతో సీటు దక్కలేదు. సామాజిక సమీకరణాలు కలసి రావడంతో గత ఎన్నికల్లో పొరుగు నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

రాయలకోటలో శంకర్‌దాదా

ఎమ్మెల్యే, సోదరుల అడ్డగోలు దోపిడీ

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆ నియోజకవర్గ కేంద్రానికి ఘనమైన చర్రిత ఉంది. రాయలవారు ఏలిన కోట ఉంది. ప్రస్తుతం రాజులు, రాజ్యాలు లేకపోయినా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సామంతరాజు! ఆయన సోదరులు మండలాలను పంచుకుని పాలెగాళ్లలా పాలన చేస్తున్నారు.

నియోజకవర్గంలో అవకాశమున్న దేన్నీ వదలకుండా దోపిడీ చేస్తున్నారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న

కియ పరిశ్రమను ఆదాయ వనరుగా మార్చుకుని.. బినామీల ద్వారా అక్రమ మార్గాల్లో కోట్లు దోచుకుంటున్నారు. ఇక ఎవరైనా వెంచర్‌ వేయాలంటే కప్పం కట్టాలి. ఇసుక రవాణా సహా అక్రమ వ్యవహారాలన్నింటిలో వాటాలు ఇవ్వాల్సిందే. అక్రమ సంపాదనతో దాదాపు 400 ఎకరాల విలువైన భూములు కొనుగోలు చేసినట్టు సొంత పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.

సొంత పార్టీలోనే సెగ

ఎమ్మెల్యేపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. తమకు సదరు ప్రజానిధి వద్దంటూ ధర్నాలు చేసే దాకా వ్యవహారం వెళ్లింది. ఆయన వాహనాలపైకి చెప్పులు విసిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గడప గడపలోనైతే అడుగడుగునా నిరసన సెగ తగిలింది. స్థానికంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పార్టీ అధిష్ఠానం

ఉమ్మడి జిల్లాలోనే మరో పార్లమెంటు నియోజకవర్గం ఇన్‌చార్జిగా బదిలీ చేసింది.

మండలాలవారీగా పంచుకుని వసూళ్లు

కియాలో బినామీల పేరుతో అక్రమార్జన

ఉద్యోగులను తరలించే వాహనాలూ వారివే

కార్మికుల వేతనాల్లోనూ కమీషన్లు

రియల్‌ ఎస్టేట్‌, ఇసుక తవ్వకాల్లో దందాలు

అక్రమ సంపాదనతో భారీ వెంచర్‌

400 ఎకరాల విలువైన భూములు కొనుగోలు

స్థానిక వ్యతిరేకతతో సదరు నేత ‘బదిలీ’

(పుట్టపర్తి-ఆంధ్రజ్యోతి)

సొంత నియోజకవర్గంలో బలమైన నేత ఉండటంతో సీటు దక్కలేదు. సామాజిక సమీకరణాలు కలసి రావడంతో గత ఎన్నికల్లో పొరుగు నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదృష్టం కలసి రావడంతో మంత్రి కూడా అయ్యారు. అప్పటి వరకు సౌమ్యుడిగా కనిపించిన సదరు ప్రజాప్రతినిధి.. పదవి రావడంతో తనలోని మరో కోణాన్ని బయటకు తీశారు. సొంత పార్టీ నేతలే విస్తుపోయేలా అక్రమార్జనకు తెరలేపారు. అవినీతి దందాలో ఎమ్మెల్యేకు సోదరులు అండగా నిలిచారు. అంతా కలసి అడ్డూ అదుపూ లేకుండా దోపిడీ సాగించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే నియోజకవర్గంలో ఆదాయ వనరులపై గురి పెట్టారు. కియ కార్ల పరిశ్రమ ఏర్పాటుతో ఆటోమొబైల్‌ హబ్‌గా నియోజకవర్గం ఏర్పడటం వారికి బాగా కలసి వచ్చింది. టీడీపీ హయంలో ఏర్పాటైన కియ కార్ల పరిశ్రమలో తుక్కు నుంచి కాంట్రాక్టు కార్మికుల ఏజెన్సీ దాకా అంతా ఎమ్మెల్యే సోదరులే చూసుకుంటూ భారీగా దోచుకుంటున్నారు. అడ్డదారుల్లో వందల కోట్లు వెనకేసుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, అక్రమ ఇసుక రవాణా.. ఇలా దేన్నీ వదలకుండా మామూళ్లు దండుకుంటున్నారు. సొంత పార్టీ నేతలే భరించలేనంతగా ఎమ్మెల్యే, ఆయన సోదరుల అవినీతి తారస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే, ఆయన సోదరులపై అధికార పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే అయ్యాక ఓ సామాజిక వర్గాన్ని తొక్కిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. వారిపై అక్రమ కేసులు బనాయించి, ముప్పుతిప్పులు పెట్టారు.

కియలో కుమ్ముడే కుమ్ముడు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమా అంటూ వచ్చిన కియ పరిశ్రమ, అనుబంధ సంస్థలు వేలాది మందికి ఉపాధి కల్పించగా.. వైసీపీ వచ్చాక ఒక్క పరిశ్రమనూ తీసుకురాలేకపోయింది. ఇక సదరు నేత ఎమ్మెల్యేగా గెలిచాక కియను తన ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. చివరకు ఆ పరిశ్రమలో శ్రమను కూడా వదలకుండా దోచుకుంటున్నారు. కాఫీ కప్పు మొదలుకొని ఉద్యోగులను తరలించే ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టు బస్సులు, లేబర్‌ కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు.. అన్నీ వారివే. తుక్కు రవాణా, కంటైనర్లు, క్యాంటీన్‌.. అన్నీ బెదిరించి మరీ లాక్కున్నారు. తన బినామీల ద్వారా నడిపిస్తున్నారు. లేబర్‌ ఏజెన్సీల ద్వారా కాంట్రాక్ట్‌ కార్మికులను కియతో పాటు అనుబంధ సంస్థల్లో పెట్టి.. వారికి వచ్చే వేతనాల్లో కమీషన్లను దండుకుంటున్నారు. ప్రైవేటు బస్సులు, కంటైనర్లకు కర్ణాటక నుంచి డీజిల్‌ను ట్యాంకర్లతో తెస్తున్నారు. కియ ఉద్యోగులను తరలించే బస్సుల ద్వారా నెలకు రూ.10 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. పరిశ్రమలో కార్ల తయారీలో ఉత్పన్నమయ్యే స్ర్కాప్‌ అమ్మకాల ద్వారా నెలకు రూ.2 కోట్ల దాకా సంపాదిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారమంతా ఎమ్మెల్యే సోదరుల్లో ఒకరు చూసుకుంటున్నారు. తన బంధువు (మండల స్థాయి ప్రజాప్రతినిధి) పేరిట ఏజెన్సీ పెట్టి నియోజకవర్గ కేంద్రం మండలంతో పాటు మరో రెండు మండలాల్లో కియతో పాటు అనుబంధ సంస్థలలో పని చేసేందుకు 150 మంది వరకు సెక్యూరిటీ గార్డులను పంపుతున్నారు. పరిశ్రమ ఒక్కొక్కరికి రూ.13 వేలు వేతనం ఇస్తుండగా, వారికి రూ.8 వేలు మాత్రమే ఇస్తూ, ఒక్కో గార్డుపై నెలకు రూ.5 వేల వరకూ దండుకుంటున్నారు. ఈ లెక్కన నెలకు రూ.7.5 లక్షలు నొక్కుతున్నారు. అదేవిధంగా 150 వరకు గాలిమరల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసి, బినామీ పేరుతో నెలకు రూ.7 లక్షల వరకు దోచుకుంటున్నారు.

లే అవుట్‌ వేస్తే కప్పం కట్టాల్సిందే..

నియోజకవర్గంలో పరిశ్రమ ఏర్పడ్డాక అన్ని మండలాలలో భూముల విలువ అమాంతంగా పెరిగింది. ఇంతకుముందు ఎకరా రూ.5 లక్షలు విలువ ఉన్న భూమి ప్రస్తుతం రూ.2 కోట్లకు చేరింది. అంతేగాక ఈ నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. దీంతో భూముల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రానికి ఆగ్నేయ దిశలో ఉన్న ఓ మండలంలో సదరు నేత కొంతమంది నాయకులను బినామీలుగా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఎవరు లే అవుట్‌ వేయాలన్నా వీరిని కలవాల్సిందే. ఎకరంలోగా లే అవుట్‌ వేస్తే ఒక రేటు, అంతకు పైన వేస్తే మరో రేటు కప్పం కట్టాలి. అంతేగాక వాస్తుకు అన్ని విధాలుగా సరిపోయే ఒకటి లేదా రెండు ప్లాట్లు ప్రజాప్రతినిధి సోదరుడి పేరిట రిజిస్ర్టేషన్‌ చేయించాలి. ఇదే మండలంలో సుమారు 200 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. తాము కొనుగోలు చేసే భూముల పక్కన అసైన్డ్‌ భూములు ఉండేలా చూసుకుంటారు. కొనుగోలు చేసిన భూముల్లో వాటిని కూడా కలుపుకొంటారు. ఇలా అక్రమాల్లో ఆరితేరిపోయారు.

ఇసుకలో మామూళ్లు

ఇసుక అక్రమంగా తరలించేవారి నుంచి సదరు ప్రజాప్రతినిధి సొంత మనుషులు నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఇటీవల ఓ మండల కేంద్రం వద్ద ఏర్పాటైన ఇసుక రీచ్‌ నుంచి నెలకు రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. మొదట రీచ్‌ నిర్వాహకులు అడిగినంత మొత్తం ఇవ్వడానికి నిరాకరించడంతో సొంత పార్టీ నాయకులతో రీచ్‌ నిర్వహణకు అడ్డుపడేలా చేసినట్లు సమాచారం. దీంతో నిర్వాహకులు వారి దారికొచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటక మద్యం తీసుకువచ్చి నియోజకవర్గంలో విక్రయించే వారి నుంచి కూడా నెలవారీ మామూళ్లు పిండుకుంటున్నారు.

అక్రమ సంపాదనతో భూములు

ప్రతి నెలా భారీగా వస్తున్న అక్రమ సంపాదనను నియోజకవర్గంలోని మండలాలతో పాటు పొరుగు నియోజకవర్గం, కర్ణాటక ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఎమ్మెల్యే పెట్టుబడిగా పెడుతున్నారు. ఆ ప్రాంతాల్లో 400 ఎకరాలకు పైగా విలువైన భూములు కొనుగోలు చేసినట్లు సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఎమ్మెల్యే సోదరులు బినామీల పేరుతో రియల్‌ వెంచర్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కేంద్రానికి ఆగ్నేయ దిశలో ఉన్న మండల కేంద్రం వద్ద కొత్తగా నిర్మాణం చేపడుతున్న జాతీయ రహదారి పక్కన భారీ వెంచర్‌ వేస్తున్నారు.

సొంతపార్టీ వారిపైనే కేసులు

తాను గెలుపొందేందుకు ఎంతగానో కృషి చేసిన ముఖ్య నాయకులపైనే ఎమ్మెల్యే అక్రమ కేసులు బనాయించారు. ఏ విషయంలోనైనా ప్రశ్నించినా, వ్యతిరేకించినా కేసులు పెట్టిస్తారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 50 మంది సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యే బాధితులుగా ఉన్నారు. దీన్ని బట్టి ఆయన అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే వేధింపుల గురించి అధికార పార్టీలో ఓ పెద్దనేతకు చెప్పేందుకు బాధిత నాయకులు వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సమావేశానికి హాజరయ్యేందుకు ఆ పెద్దనేత వస్తుండగా నియోజకవర్గ కేంద్రం వై జంక్షన్‌లో వాహనాలను అడ్డుకుని చెప్పులు విసిరారు. అలాగే పక్కనే ఉన్న మండలంలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమానికి వెళుతుండగా ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించి చెప్పులు విసిరేందుకు ప్రయత్నించారు. పంపకాల్లో ప్రజాప్రతినిధి సోదరుడికి, ఆ కార్యకర్తకు మధ్య విభేదాలు రావడంతో కార్యకర్త పేరు మీద ఉన్న నాలుగు ప్లాట్లను వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాలని ఒత్తిడి తెచ్చారు. కార్యకర్త ఒప్పుకోకపోవడంతో అక్రమ కేసు బనాయించి నానా ఇబ్బందులకు గురిచేశారు.

Updated Date - Feb 07 , 2024 | 05:06 AM