Share News

వణికిస్తున్న మంప్స్‌..!

ABN , Publish Date - Mar 12 , 2024 | 02:36 AM

ఇటీవల గుంటూరులోని ప్రతిమనగర్‌కు చెందిన ఏడేళ్ల శైలేశ్‌కు ఉన్నట్టుండి రెండు చెంపల దగ్గర వాపు ఏర్పడింది.

వణికిస్తున్న మంప్స్‌..!

వ్యాక్సిన్‌ వేసినా.. ఆగని గవద బిళ్లలు

చిన్నారుల్లో ఇటీవల పెరుగుతున్న కేసులు

బూస్టర్‌ డోస్‌తోనే అడ్డుకట్ట సాధ్యమంటున్న వైద్యులు

గుంటూరు (మెడికల్‌), మార్చి 11: ఇటీవల గుంటూరులోని ప్రతిమనగర్‌కు చెందిన ఏడేళ్ల శైలేశ్‌కు ఉన్నట్టుండి రెండు చెంపల దగ్గర వాపు ఏర్పడింది. గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కూడా చుట్టుముట్టాయి. ఆస్పత్రికి తీసుకెళ్తే గవద బిళ్లల వ్యాధిగా (మంప్స్‌) వైద్యులు నిర్ధారించారు. యాంటీ బయోటిక్‌, నొప్పి నివారణ మాత్రలతో చికిత్స ప్రారంభించారు. శైలేశ్‌ వయసున్న పిల్లలు గుంటూరులో పెద్ద సంఖ్యలో మంప్స్‌ బారిన పడుతున్నారు. కొంతకాలంగా గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి పిల్లల వైద్య విభాగం ఓపీకి ప్రతి రోజూ మంప్స్‌ బాఽధితులు వస్తున్నారు. ఒక ్క గుంటూరులోనే కాదు,రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో బాధిత పిల్లలు కనిపిస్తున్నట్టు వైద్యవర్గాలు చెబుతున్నాయి.

వ్యాక్సిన్‌ ఇచ్చినా కూడా...

వ్యాక్సిన్‌ ద్వారా సులువుగా కట్టడి చేసే వాటిలో గవద బిళ్లల వ్యాధి ఒకటి. సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం కింద గవద బిళ్లల నివారణకు చిన్నారులందరికీ ఎంఎంఆర్‌ టీకాలు వేస్తున్నారు. బిడ్డ పుట్టిన 9వ నెలలో, 15వ నెలలో రెండు విడతలుగా మంప్స్‌ నిరోధక వ్యాక్సిన్‌ వేస్తున్నారు. అనంతరం 4-5 సంవత్సరాల మధ్య బూస్టర్‌ డోసు కూడా ఇస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పకడ్బందీగా జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో వందల సంఖ్యలో ఈ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను మూడు డోసులకు బదులు కొందరు పిల్లలు ఒక్కడోసే తీసుకున్నారని, దీనివల్ల వ్యాధి నుంచి పూర్తి రక్షణ లభించదని డాక్టర్లు చెబుతున్నారు. కొవిడ్‌-19 విజృంభించిన 2020, 2021 సంవత్సరాల్లో చాలా మంది పిల్లలకు మంప్స్‌ వ్యాక్సినేషన్‌ జరగలేదు. దీని ఫలితం ప్రస్తుతం కేసుల రూపంలో కనిపిస్తోందని వైద్య వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

వేగంగా సంక్రమించే అంటువ్యాఽధి...

గవద బిళ్లలు వేగంగా సంక్రమించే అంటువ్యాధి. సాధారణంగా 5 నుంచి 12 ఏళ్ల వయస్సు గల పిల్లలకు సోకుతుంది. పారామిక్సో వైరస్‌ దీనికి కారణం. బాధితుల్లో గవదల వాపు, 103 డిగ్రీల జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, అలసట, గొంతు మింగుడు పడకపోవడం, వృషణాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది వైరల్‌ వ్యాధి కావడంతో ప్రత్యేకంగా చికిత్స లేదు. వ్యాధి లక్షణాలను బట్టి సపోర్టివ్‌ థెరపీ ఇస్తారు. బాధిత చిన్నారుల్లో ఐదు నుంచి పది రోజుల్లోగా వ్యాధి లక్షణాలు తగ్గిపోతాయి. ఈ వైరస్‌ వృషణాలకు సోకితే మగవారిలో వంధ్యత్వం వస్తుంది. చెవులకు సోకితే వినికిడి శక్తి తగ్గిపోతుంది. అరుదుగా ఇది మెదడుకు పాకి వైరల్‌ మెనింజైటిస్‌ అనే ప్రాణాంతక జబ్బుగా మారుతుంది.

వ్యాధి కట్టడికి చర్యలు చేపడతాం..

రాష్ట్రవ్యాప్తంగా గవద బిళ్లల కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ స్పందించి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి అర్హులైన చిన్నారులందరికీ మరోసారి వ్యాక్సినేషన్‌ చేయాలని సూచించినట్టు వైద్య వర్గాల నుంచి వినవస్తుంది. గుంటూరు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ కేవీ సుబ్బరాజు మాట్లాడుతూ.. మంప్స్‌ కేసులు నమోదవడం గుర్తించామని, పిల్లలందరికీ మంప్స్‌ నిరోధక టీకాలు ఇచ్చినప్పటికీ కేసులు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. వ్యాధి కట్టడికి తగిన చర్యలు చేపడతామని తెలిపారు.

Updated Date - Mar 12 , 2024 | 02:36 AM