Share News

షాడో పాలన!

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:54 AM

జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పరిపాలన గాడి తప్పింది. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి వివిధ హోదాల్లో ఇక్కడే పనిచేస్తూ పాతుకుపోయిన ఏడీ ఒకరు షాడో డీఈవోగా వ్యవహరిస్తున్నారు. కార్యాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులను ఓ కోటరీగా ఏర్పాటు చేసుకుని వారితోనే అన్ని పనులు చక్కబెట్టిస్తున్నారు. ప్రతి పనీలోనూ అవినీతికి పాల్పడు తున్నట్లు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ పాలకులతో అంటకాగిన సదరు ఏడీ కూటమి ఎమ్మెల్యేల సిఫార్సులపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు మూటకట్టుకుంటున్నారు.

షాడో పాలన!

-డీఈవో కార్యాలయంలో ఏడీ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు

- వైసీపీ పాలకులతో అంటకాగి ‘కూటమి’ ఎమ్మెల్యేల సిఫార్సులు బుట్టదాఖలు

- చేయి తడిపితేనే ఫైళ్లకు మోక్షం కల్పిస్తున్న ‘ఏడీ’ కోటరీ

- కృష్ణా నూతన డీఈవోగా పీవీజే రామారావు

- ప్రస్తుత డీఈవో తాహెరాసుల్తానాను ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశం

- కొత్త డీఈవో హయాంలోనైనా కార్యాలయ పాలన గాడినపడేనా!

జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పరిపాలన గాడి తప్పింది. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి వివిధ హోదాల్లో ఇక్కడే పనిచేస్తూ పాతుకుపోయిన ఏడీ ఒకరు షాడో డీఈవోగా వ్యవహరిస్తున్నారు. కార్యాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులను ఓ కోటరీగా ఏర్పాటు చేసుకుని వారితోనే అన్ని పనులు చక్కబెట్టిస్తున్నారు. ప్రతి పనీలోనూ అవినీతికి పాల్పడు తున్నట్లు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ పాలకులతో అంటకాగిన సదరు ఏడీ కూటమి ఎమ్మెల్యేల సిఫార్సులపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు మూటకట్టుకుంటున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లా విద్యాశాఖాధికారిగా పీవీజే రామారావు నియమితులయ్యారు. నెల్లూరు డీఈవోగా పనిచేస్తున్న ఆయనను కృష్ణా డీఈవోగా ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల విద్యాశాఖాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం జీవోఆర్‌టీ నంబరు 433ను జారీ చేసింది. ఇప్పటి వరకు కృష్ణా డీఈవోగా పనిచేసిన తాహెరా సుల్తానాను ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

డీఈవో కార్యాలయంలో గాడి తప్పిన పాలన

జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కొంతకాలంగా పరిపాలన గాడి తప్పిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు పనిచేసిన డీఈవో విజయవాడ నుంచి మచిలీపట్నంలోని కార్యాలయానికి వారంలో రెండు, మూడు రోజుల మాత్రమే వచ్చేవారు. దీంతో కార్యాలయంలో పరిపాలన వ్యవహారాలు డీఈవో కార్యాలయంలో పనిచేసే ఏడీ చేతిలోకి వెళ్లిపోయాయి. ఆయన కూడా విజయవాడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి, సాయంత్రం ఐదు గంటలకు కార్యాలయం నుంచి వెళ్లిపోయేవారు. కలెక్టర్‌, జేసీ మచిలీపట్నంలోనే నివాసం ఉంటున్నా.. డీఈవో, ఏడీ మాత్రం విజయవాడలో నివాసం ఉంటూ మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయానికి వచ్చేవారు. డీఈవో కార్యాలయంలో ఇద్దరు ఏడీలు పనిచేస్తుండగా, పరిపాలనా వ్యవహారాలను ఒక ఏడీనే తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి డీఈవో కార్యాలయంలోనే వివిధ హోదాల్లో పనిచేసిన ఈ ఏడీ కార్యాలయంలోని అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్‌లను తన అదుపాజ్ఞాల్లో పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

వైసీపీ నాయకులతో అంటకాగి..

వైసీపీ ప్రభుత్వంలో సదరు ఏడీ ఆ పార్టీ నాయకులు చెప్పిన పనులను మాత్రం చకాచకా చేసేవాడని టీచర్లు ఆరోపిస్తున్నారు. మచిలీపట్నానికి చెందిన ఒక వైసీపీ నాయకుడు నిత్యం ఏడీ చాంబరులోనే ఉండి పనులు చేయించుకునేవారని తెలిసింది. వైసీపీ నాయకులతో అంటకాగిన ఈ ఏడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాకు చెందిన శాసన సభ్యులు చేసిన సిఫార్సులను సైతం పక్కనపెట్టేసి, ఈ పనులు కావని ఖరాఖండిగా చెప్పడం గమనార్హం. ఎమ్మెల్యేలు డీఈవోకు పలుమార్లు చెప్పినా డీఈవోకు షాడోగా వ్యవహరించిన ఈ ఏడీ రూల్‌ పొజిషన్‌ పేరుతో ఏవేవో సాకులు చెప్పి ఈ పనులు కాకుండా అడ్డుపుల్ల వేశాడని టీచర్లు బాహాటంగా చెప్పుకుంటున్నారు.

అడిగినంత సమర్పిస్తేనే ఫైళ్లకు మోక్షం!

జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తన మనుషులను కోటరీగా ఏర్పాటు చేసుకున్న సదరు ఏడీ టీచర్లకు సంబంధించి సర్వీస్‌ మేటర్లు, మెడికల్‌ బిల్లులు, డిప్యుటేషన్‌లు, సస్పెన్లన్‌లు ఎత్తివేయడం, పాఠశాలలకు గుర్తింపు ఇవ్వడం, రెన్యువల్‌ చేయడం ఇతరత్రా పరిపాలనా అంశాలలో తనదైన శైలిలో తెరవెనుక చక్రం తిప్పాడని టీచర్లు ఆరోపిస్తున్నారు. సిటిజన్‌చార్ట్‌ ప్రకారం వివిధ అంశాలకు సంబంధించిన ఫైళ్లలో కొన్నింటిని 15 రోజుల వ్యవధిలో పరిష్కరించాల్సి ఉన్నా తనను ప్రసన్నం చేసుకుని, అడిగినంత సమర్పించుకుంటేనే గాని ఈ ఏడీ సంబంధిత ఫైళ్లకు పరిష్కారం చూపేవారు కాదనే ఉప ఉపాధ్యాయులు చెప్పుకుంటున్నారు. టీచర్ల సమస్యలకు సంబంధించి కొన్ని ఫైళ్లు డీఈవో కార్యాలయంలో పెండింగ్‌లో ఉంటే వాటి సమాచారం యూనియన్‌ నాయకులకు ఇవ్వకుండా ఈ ఏడీ గోప్యత పాటించేవాడని యూనియన్‌ నేతలు ఆరోపిస్తున్నారు. డీఈవో దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినా ఈ ఏడీ పలు కారణాలు చూపి పరిష్కారం కాకుండా తొక్కిపెట్టాడని యూనియన్‌ నాయకులు విమర్శిస్తున్నారు. కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు సెక్రటరీ నియామకంలోనూ ఈ ఏడీ తనదైన శైలిలో వ్యవహరించాడని టీచర్లు అంటున్నారు. పెడనలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1,600 మందిపైగా విద్యార్థులు ఉంటారు. అక్కడ కుకింగ్‌ ఏజెన్సీపై అనేక ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ సక్రమంగా జరగకుండా ఈ ఏడీ, అతని వర్గీయులు అడ్డుపడటం గమనార్హం.

సస్పెండ్‌ అయిన టీచర్లకు ఇరిగి పోస్టింగ్‌ ఇవ్వడంలోనూ..

వివిధ కారణాలతో సస్పెన్షన్‌కు గురైన టీచర్లకు తిరిగి పోస్టింగ్‌ ఇవ్వడంలో ఏడీ, ఆయన కోటరీ నిబంధలకు విరుద్ధంగా తమ ఇష్టానుసారం వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. కైకలూరు మండలంలో పని చేసే ఒక టీచరు వివిధ ఆరోపణలపై సస్పెండ్‌ అయ్యాడు. మచిలీపట్నంలో నివాసం ఉండే ఈ టీచరును దూర ప్రాంతానికి బదిలీ చేయాలి. కానీ మచిలీపట్నం పక్కనే ఉన్న గూడూరు మండలంలోని పాఠశాలకు ఆయనను పంపారు. అవనిగడ్డ, కోడూరు మండలాల్లో బాలికలను వేధిస్తున్నారనే కారణంతో ఇద్దరు టీచర్లను సస్పెండ్‌ చేశారు. వారిని దూరప్రాంతానికి పంపాల్సి ఉంటే అవనిగడ్డ, కోడూరు మండలాల పక్కనే ఉన్న మోపిదేవి, నాగాయలంక మండలాల్లోని పాఠశాలలకు వీరిని పంపారు. ఈ ముగ్గురు టీచర్ల వ్యవహారంలో ఏడీ, ఆయన చుట్టూ ఉన్న కోటరీ గుట్టుచప్పుడు కాకుండా తమదైన శైలిలో పని చేసుకుపోయారని టీచర్లు, యూనియన్‌ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కృష్ణా డీఈవో కార్యాలయంలో కోటరీగా ఏర్పడి పరిపాలనను తమ గుప్పిట్లో పెట్టుకున్న సదరు ఏడీ, ఆయన మనుషుల పనితీరుపై నూతన డీఈవో దృష్టిసారించి, పరిపాలనను గాడిలో పెట్టాలని టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:54 AM