Share News

షబ్నమ్‌ షో

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:36 AM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో తమ ప్లేఆఫ్‌ ఆశలను గుజరాత్‌ జెయింట్స్‌ సజీవంగానే ఉంచుకుంది. సోమవారం యూపీ వారియర్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో జెయింట్స్‌ 8 పరుగుల తేడాతో నెగ్గింది.

షబ్నమ్‌ షో

సత్తా చాటిన తెలుగు టీనేజర్‌

యూపీపై గుజరాత్‌ విజయం

దీప్తి పోరాటం వృథా

న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో తమ ప్లేఆఫ్‌ ఆశలను గుజరాత్‌ జెయింట్స్‌ సజీవంగానే ఉంచుకుంది. సోమవారం యూపీ వారియర్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో జెయింట్స్‌ 8 పరుగుల తేడాతో నెగ్గింది. విశాఖపట్నం టీనేజ్‌ పేసర్‌ షబ్నమ్‌ షకీల్‌ (3/11) బౌలింగ్‌లో అదరగొట్టింది. అటు ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ (60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 నాటౌట్‌) అద్భుత పోరాటం వృధా అవడంతో యూపీ దాదాపు నిష్క్రమించినట్టే. ముందుగా జెయింట్స్‌ 8 వికెట్లకు 152 రన్స్‌ చేసింది. మూనీ (74), వోల్వార్ట్‌ (43) రాణించారు. ఎకెల్‌స్టోన్‌కు 3, దీప్తికి 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యూపీ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 144 పరుగులు చేసి ఓడింది. పూనమ్‌ (36 నాటౌట్‌) రాణించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షబ్నమ్‌కు మూడు వికెట్లు దక్కాయి.

శతక భాగస్వామ్యంతో..: ఓ మాదిరి ఛేదనలో యూపీ 4 రన్స్‌కే మూడు.. 16 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. అయినా దీప్తి శర్మ పట్టు వదలకుండా చివరి వరకు నిలిచినా ఓటమి తప్పలేదు. తొలి ఓవర్‌లోనే హీలీ (4), ఆటపట్టు (0)లను అవుట్‌ చేస్తూ 16 ఏళ్ల తెలుగు పేసర్‌ షబ్నమ్‌ షాకిచ్చిం ది. తర్వాత బ్రైస్‌ (0), గార్డ్‌నర్‌ (1) కూడా వెనుదిరగడంతో పవర్‌ప్లేలో జట్టు 30/4తో కష్టాల్లో పడింది. ఏడో ఓవర్‌లో శ్వేత (8)ను కూడా షబ్నమ్‌ అవుట్‌ చేశాక, దీప్తి శర్మకు పూనమ్‌ జత కలిసింది. ఆఖరి 14 ఓవర్లు ఈ జోడీ గుజరాత్‌ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటూ లక్ష్యం వైపు సాగింది. ఇద్దరూ ఎడాపెడా షాట్లతో గుజరాత్‌పై ఒత్తిడి పెంచారు. 15వ ఓవర్‌లో ఫోర్‌తో దీప్తి హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుంది. అయినా చివరి ఓవర్‌లో 26 రన్స్‌ అవసరపడగా, దీప్తి రెండు సిక్సర్లు బాదినా మరో 8 పరుగుల దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఈ జోడీ ఆరో వికెట్‌కు అజేయంగా 109 పరుగులు జతచేసింది.

ఓపెనర్లు మినహా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు బెత్‌ మూనీ, వోల్వార్ట్‌ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరి జోరుతో పవర్‌ప్లేలో జట్టు 53 పరుగులు సాధించింది. అయితే ఈ దూకుడును ఎకెల్‌స్టోన్‌ అడ్డుకుంటూ వోల్వార్ట్‌ను అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే మరో ఎండ్‌లో టపటపా వికెట్లు కోల్పోతున్నా మూనీ మాత్రం పట్టు వదల్లేదు. 19వ ఓవర్‌లో రెండు ఫోర్లతో ఫిఫ్టీ పూర్తి చేసిన తను ఆఖరి ఓవర్‌లో ఐదు ఫోర్లతో 21 పరుగులు సాధించి స్కోరును 150 దాటించింది.

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్‌: 20 ఓవర్లలో 152/8 (మూనీ 74, వోల్వార్ట్‌ 43; ఎకెల్‌స్టోన్‌ 3/38, దీప్తి 2/22).

యూపీ: 20 ఓవర్లలో 144/5 (దీప్తి 88 నాటౌట్‌, పూనమ్‌ 36 నాటౌట్‌; షబ్నమ్‌ 3/11).

Updated Date - Mar 12 , 2024 | 01:36 AM