Share News

రాష్ట్రంలో ఏడు నూతన విమానాశ్రయాలు..!

ABN , Publish Date - Aug 28 , 2024 | 03:08 AM

రాష్ట్రంలో 7 కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై పరిశీలన జరుపుతున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

రాష్ట్రంలో ఏడు నూతన విమానాశ్రయాలు..!

అక్టోబరులో సీ ప్లేన్‌ డెమో.. ప్రకాశం బ్యారేజి నుంచి శ్రీశైలం వరకు

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

అమరావతి, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 7 కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై పరిశీలన జరుపుతున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్‌, కుప్పం, ఒంగోలు- నెల్లూరు, అనంతపురంలో ఏర్పాటుపై పరిశీలన, సర్వే జరుగుతోంది. సీ ప్లేన్‌ కార్యకలాపాలు త్వరలో రాష్ట్రంలో ప్రా రంభం కానున్నాయి. మొట్టమొదటి సీ ప్లేన్‌ డెమోను అక్టోబరులో రాష్ట్రంలో నిర్వహిస్తాం. విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి శ్రీశైలం వరకూ దీనిని నిర్వహిస్తాం. ఈ రెండు చోట్లా సీ ప్లేన్‌ లాండింగ్‌, టేకాఫ్‌ రెండూ నీళ్ళలోనే జరుగుతుంది. మామూలు విమానాశ్రయాల నిర్మాణానికి వేల ఎకరాల్లో భూ మి అవసరం. కాని సీ ప్లేన్‌కు ఒక పెద్ద రిజర్వాయర్‌ ఉంటే చాలు. భూ సమస్యకు పరిష్కారంగా సీ ప్లేన్‌ విధానాన్ని ప్రోత్సహించాలన్నది మోదీ ప్రభుత్వ ఆలోచన. సీ ప్లేన్‌ను వైద్యం, పౌర రవాణాకు కూడా ఉపయోగపడేలా నిబంధనలు సడలిస్తున్నాం’ అని వివరించారు. విజయవాడ విమానాశ్రయం నుంచి మరిన్ని ప్రాంతాలకు విమానాలు నడపడానికి చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రయాణ అవసరాల కోసం తెప్పిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందన్నారు.

సామాన్యుడి కోసమే రెవెన్యూ సదస్సులు

సామాన్యుడికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న నమ్మకం కలిగించడానికే సెప్టెంబరు నుంచి రెవెన్యూ సదస్సులు పెడుతున్నామని రామ్మోహన్‌నాయు డు చెప్పారు. ప్రజా దర్బార్‌ సత్ఫలితాలు ఇస్తోందని కేంద్ర మంత్రి అన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 07:16 AM