కష్ట కాలంలో ఖాకీల సేవ!
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:30 AM
నేరాలు.. నిందితులు.. అంటూ తిరిగే పోలీసులు.. తమ సహజ శైలికి భిన్నంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు.
వరద బాధితులకు అండదండలు
సహజ శైలికి భిన్నంగా పోలీసు విధులు
బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీ
బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ ఫస్ట్
శివారుల్లో సహాయం ముమ్మరం
అధికారులు, సిబ్బంది సమన్వయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సాయం
విజయవాడ/వన్‌టౌన్, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): నేరాలు.. నిందితులు.. అంటూ తిరిగే పోలీసులు.. తమ సహజ శైలికి భిన్నంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్నారు. ‘‘అమ్మా బోటు వచ్చింది ఎక్కండి’’, ‘‘ఆహారం అందిందా? నీళ్ల బాటిళ్లు వచ్చాయా?’’.. అంటూ బుడమేరు ముంపు ప్రాంత బాధితులకు సాయం చేస్తున్నారు. అంతేకాదు.. వరదలో చిక్కుకున్నామని ఎవరైనా ఫోన్ చేస్తే చాలు వెంటనే అక్కడకు చేరిపోతున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తున్నారు. విజయవాడలోని సింగ్‌నగర్, ప్రకాశ్‌నగర్, పాయకాపురం, రాధానగర్, ప్రశాంతినగర్ తదితర ప్రాంతాలు బుడమేరు వరద కారణంగా నడుములోతు నీటిలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధితులను రక్షించేందుకు పోలీసులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించడం, నిత్యావసరాల పంపిణీ వంటివి చురుగ్గా చేస్తున్నారు. ఎక్కడా విసుగు, విరామం లేకుండా కష్టపడుతున్నారు. ఇదేసమయంలో వరద నీరు తగ్గిన ఇళ్లలో దొంగతనాలు జరగకుండా కూడా ఓ కంట కనిపెడుతున్నారు. విజయవాడ నగర పోలీసులతోపాటు పొరుగునే ఉన్న కృష్ణా జిల్లా పోలీసులను కూడా వరద సహాయక చర్యల కోసం పిలిపించారు. సుమారు వెయ్యి మందికిపైగా పోలీసు సిబ్బంది వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. పోలీసు శాఖతోపాటు ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా బాధితులకు సాయం చేస్తున్నారు. శుక్రవారం పాతరాజరాజేశ్వరిపేటలోని మారుమూల ప్రాంతంలో ఓ కుటుంబం చిక్కుకుపోయింది. సాయం కోసం పోలీసులకు సమాచారం అందించడంతో విజయవాడ నార్త్ ఏసీపీ ఎం. రాజారావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఆగమేఘాలపై స్పందించారు. ట్రాక్టర్‌పై బయలుదేరారు. అయితే.. కొంత దూరం వెళ్లిన తర్వాత నీటి మట్టం పెరగడంతో ట్రాక్టర్ ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో అక్కడే ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తమ వెంట తెచ్చిన బోటులో వెళ్లి నలుగురు సభ్యులున్న కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. స్థానిక పోలీసుల సహకారం తోడవడంతో ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు మరింత సులువుగా సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు
వరద ప్రారంభమైన రోజు నుంచి విధులు నిర్వహిస్తున్నా. నా ఉద్యోగ జీవితంలో ఇలాంటి విపత్కర పరిస్థితి చూడలేదు. బాధితుల కష్టాలను చూస్తుంటే ఎంత బాధ్యతగా మా విధులు నిర్వహించాలో అర్ధమవుతోంది. బాధితులు ఇబ్బంది పడకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాం. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం.
- జి. రామకృష్ణ, విజయవాడ ఏడీసీపీ
బాధితుల సంఖ్య ఊహించనిది
వరదలో చిక్కుకున్నవారి ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. బాధితుల సంఖ్య ఊహించనంతగా ఉంది. ఎప్పటికప్పుడు వారికి ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తున్నాం. 5 రోజుల నుంచి డ్యూటీలోనే ఉన్నాం. బాధితుల కష్టాలు చూసి అలసట కూడా రావడం లేదు.
- సురేశ్, విజయనగరం, ఎస్‌డీఆర్‌ఎఫ్
దొంగతనాలు జరగకుండా...
వరద ముంపు తీవ్రంగా ఉంది. బాధితులు చాలా నష్టపోయారు. వారు కోలుకోవాలంటే చాలాకాలం పడుతుంది. 4రోజులు నుంచి డ్యూటీ చేస్తున్నా. ఆహారం, తాగునీరు బాధితులకు చేరేలా చూస్తున్నాం. వారి ఇళ్లలో దొంగతనాలు జరగకుండా చూస్తున్నాం.
- కె. పవన్ కుమార్, కానిస్టేబుల్, కాకినాడ