ముగ్గురు చొప్పున అభ్యర్థుల ఎంపిక
ABN , Publish Date - Mar 04 , 2024 | 03:18 AM
సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25పార్లమెంటు స్థానాల్లో పోటీకి అభ్యర్థుల్ని సిద్ధం చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారు.
పొత్తు నిర్ణయం అధిష్ఠానానిదే: పురందేశ్వరి
అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25పార్లమెంటు స్థానాల్లో పోటీకి అభ్యర్థుల్ని సిద్ధం చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారు. ఏ నియోజక వర్గానికి ఏ అభ్యర్థి బాగుంటారనే దానిపై రెండు రోజుల పాటు కేంద్ర పార్టీ ముఖ్యుడు శివ ప్రకాశ్‌తో కలిసి స్ర్కీనింగ్ కమిటీ చర్చించింది. మొత్తం కసరత్తు పూర్తయ్యాక సమావేశ వివరాలను పురందేశ్వరి వివరించారు. కార్యకర్తలు, మేనిఫెస్టో కమిటీ అభిప్రాయాలు తీసుకుని మొత్తం దరఖాస్తుల్లో ఒక్కో నియోజక వర్గానికి మూడింటిని ఎంపిక చేశామని చెప్పారు. వాటిని కేంద్ర నాయకత్వానికి పంపుతామని, పార్లమెంటరీ కమిటీ తుది జాబితా ఖరారు చేస్తుందన్నారు. రాష్ట్రంలో పొత్తుల గురించి ఢిల్లీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకొంటుందని, అభ్యర్థుల ఎంపిక తాము చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది ప్రజల్ని కలిసి మేనిఫెస్టో తుది రూపకల్పన చేస్తామని చెప్పారు.
మోదీ హయాంలోనే మహిళా సాధికారత
ఎస్సీ కమిషన్ తరహాలో ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించింది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ తర్వాత దేశంలో వెనుకబడిన వర్గాల గురించి ఆలోచన చేస్తున్న నేత మోదీ మాత్రమేనని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, అన్నమయ్య జిల్లాకు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు, వందలాది మంది మహిళలు ఆదివారం ఆమె సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం పాటు పడుతున్న ప్రధాని మోదీ ప్రభుత్వం స్వయం శక్తితో నారీమణులు నిలబడేందుకు తోడ్పాటునందిస్తోందని చెప్పారు