Seetaram Echuri ఆదర్శ కమ్యూనిస్టు సీతారాం ఏచూరి
ABN , Publish Date - Sep 12 , 2024 | 11:59 PM
విద్యార్థి దశ నుంచి తుదిశ్వాస విడిచే వరకు పేదల పక్షాన ఉద్యమించిన ఆదర్శ కమ్యూనిస్టు సీతారాం ఏచూరి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ అన్నారు. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు.
ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్
అనంతపురం కల్చరల్, సెప్టెంబరు 12: విద్యార్థి దశ నుంచి తుదిశ్వాస విడిచే వరకు పేదల పక్షాన ఉద్యమించిన ఆదర్శ కమ్యూనిస్టు సీతారాం ఏచూరి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ అన్నారు. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. గురువారం సాయంత్రం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గణేనాయక్ భవనలో సీతారాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య మార్గదర్శకత్వంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి సీపీఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా ఎదిగారన్నారు. మతోన్మాద, కార్పొరేట్ రాజకీయాల ప్రమాదాన్ని దేశ ప్రజలకు సూటిగా వివరించేవారన్నారు. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులను ఏకం చేసి ఇండియా వేదికను ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. అనంతపురం ఉమ్మడి జిల్లాలో జరిగిన అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారన్నారు. సీపీఎం, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో సీతారాం ఏచూరికి నివాళులర్పించడంతోపాటు సంతాపసభలు నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగేంద్రకుమార్, నల్లప్ప, ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, నగర కమిటీ అధ్యక్షుడు రామిరెడ్డి, ఆర్‌వి నాయుడు, ప్రకాష్, సురేష్ పాల్గొన్నారు.
సీపీఐ నాయకులు..
అనంతపురం విద్య: సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీశ, జిల్లా కార్యదర్శి జాఫర్ గురువారం వేర్వేరు ప్రకటనల్లో దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉంటూ దేశ రాజకీయాల్లో గొప్పనాయకుడిగా వెలిగారన్నారు. ఆయన మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి తమ సంతాపం తెలుపుతున్నామన్నారు.
ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: కాలవ
అనంతపురం అర్బన: సీతారాం ఏచూరి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం జీవిత కాలం అలుపెరగని పోరాటం సాగించిన ఆయన మరణం దురదృష్టకరమన్నారు. తెలుగుగడ్డపై పుట్టిన ఆయన విద్యార్థి దశ నుంచి మంచి నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. పార్లమెంట్‌లో, బయట ప్రజల గొంతుకగా నిలిచారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.