Share News

ఏడాదిన్నరకో కార్యదర్శి!

ABN , Publish Date - May 27 , 2024 | 04:05 AM

‘విద్యాశాఖలో స్థిరత్వం ఉంటేనే మెరుగైన ఫలితాలు సాధ్యం. ఈ విషయం తెలిసినప్పటికీ ఇతర శాఖల తరహాలోనే విద్యాశాఖ అధికారులను కూడా ప్రభుత్వాలు పదే పదే బదిలీ చేస్తున్నాయి.

ఏడాదిన్నరకో కార్యదర్శి!

పాఠశాల విద్యాశాఖలో తరచూ బదిలీలు

కార్యదర్శి సగటు పదవీకాలం 1.4ఏళ్లు

ఎస్పీడీ పదవీకాలం ఒకటిన్నరేళ్లే.. స్థిరత్వం లేకపోతే ఫలితాలు కష్టం

రాష్ర్టాలకు కేంద్ర విద్యాశాఖ లేఖ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘విద్యాశాఖలో స్థిరత్వం ఉంటేనే మెరుగైన ఫలితాలు సాధ్యం. ఈ విషయం తెలిసినప్పటికీ ఇతర శాఖల తరహాలోనే విద్యాశాఖ అధికారులను కూడా ప్రభుత్వాలు పదే పదే బదిలీ చేస్తున్నాయి. ఇది విద్యార్థుల చదువులపై ప్రభావం చూపిస్తుంది. మెరుగైన ఫలితాల సాధనకు ప్రతికూలంగా మారుతుంది’ అని కేంద్ర విద్యాశాఖ అభిప్రాయపడింది. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులను తరచూ బదిలీ చేస్తుండడమే ఇందుకు కారణం! గత పదేళ్ల కాలంలో పాఠశాల విద్యాశాఖకు ఎంత మంది కార్యదర్శులు, సమగ్రశిక్ష అభియాన్‌కు ఎంత మంది ఎస్పీడీలు పనిచేశారనే వివరాలను తాజాగా రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల మార్పిడిని పరిశీలిస్తే... 2014-15 నుంచి ఇప్పటివరకూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శులుగా ఎనిమిది మంది పనిచేశారు. ఇందులో బుడితి రాజశేఖర్‌ రెండు సార్లు కార్యదర్శిగా చేశారు. దీంతో కార్యదర్శుల సగటు పదవీకాలం 1.4 సంవత్సరాలు మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. తెలుగుదేశం హయాంలో ఆదిత్యనాథ్‌ దాస్‌ మాత్రమే నాలుగేళ్లకు పైగా కార్యదర్శిగా పనిచేశారు. మొత్తం టీడీపీ ప్రభుత్వంలో ఇద్దరు అధికారులే కార్యదర్శులుగా ఉండగా, ఈ ప్రభుత్వంలో ఆరుగురు అధికారులు మారిపోయారు.

మధ్యలో జేఎస్వీ ప్రసాద్‌, అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అతి తక్కువ కాలం పనిచేశారు. ఇక బుడితి రాజశేఖర్‌ను అకస్మాత్తుగా మార్చిన ప్రభుత్వం వైసీపీ అనుకూల అధికారిగా ముద్రపడిన ప్రవీణ్‌ ప్రకాశ్‌కు పాఠశాల విద్యాశాఖ బాధ్యతలు అప్పగించింది. ఇక సమగ్రశిక్ష ప్రాజెక్టుకు కీలకంగా వ్యవహరించే స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పోస్టులకూ అధికారులను ప్రభుత్వం ఇష్టానుసారంగా మార్చేసింది. పదేళ్లలో పది మంది అధికారులు ఎస్పీడీలుగా పనిచేశారు. వీరిలో ఇద్దరు రెండుసార్లు చేయడంతో, సగటు పదవీకాలం కేవలం 1.2 సంవత్సరాలుగా ఉంది. టీడీపీ ప్రభుత్వంలో నలుగురు అధికారులు ఎస్పీడీలుగా చేశారు. ఈ ప్రభుత్వంలో 2019 నుంచి ఇప్పటివరకూ ఆరుగురు అధికారులు మారారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క అధికారీ వరుసగా రెండేళ్లు ఆ సీటులో ఉండలేదు. ఇలా విద్యాశాఖలో కీలకమైన అధికారులను తరచూ బదిలీలు చేయడం వల్ల సరైన ఫలితాలు రావని కేంద్ర విద్యాశాఖ అభిప్రాయడుతోంది.

ఇలా మారిస్తే ప్రగతి కష్టం

‘‘పాఠశాల విద్యాశాఖ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలతో కలిపి అనేక పథకాలు అమలుచేస్తోంది. వీటి అమలులో కీలక అధికారుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యాశాఖ అధికారులను తరచూ మారుస్తున్నాయి. దీనివల్ల విద్యా సంబంధిత పథకాల అమలులో స్థిరమైన పురోగతి సాధించడం కష్టమవుతుంది. ఇది కేవలం నిధులను సకాలంలో వినియోగించడం ఒక్క విషయంలోనే కాకుండా విద్యా నాణ్యత లక్ష్యాలపై ప్రభావం చూపుతుంది. పదే పదే అఽధికారులను మార్చడం వల్ల కోరుకున్న ఫలితాలు సాధించలేం. ముఖ్యంగా విద్యా రంగంలో స్థిరమైన నాయకత్వం అవసరం. అందువల్ల విద్యాశాఖలో కీలక అధికారులు మరీ తక్కువ కాలం కాకుండా ఆ హోదాల్లో కొనసాగితేనే పురోగతి పెరుగుతుంది’’ అని విద్యాశాఖ తన లేఖలో పేర్కొంది.

నచ్చినట్లు చేయకపోతే మార్చేయ్‌

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులను ఇష్టానుసారంగా మార్చేసింది. పాఠశాల విద్యాశాఖలోనూ ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాట వినని అధికారులను అకారణంగా బదిలీ చేసింది. ఈ ప్రభుత్వంలో పెద్ద పోస్టు వస్తుందని ఆశపడి పాఠశాల విద్యాశాఖకు వచ్చిన ఓ సీనియర్‌ అధికారి.. చివరికి మాట వినలేదనే కారణంతో బదిలీ అయ్యారు. ఇక వివాదాస్పద అధికారులను పాఠశాల విద్యాశాఖలో నియమించడం కూడా ఈ ప్రభుత్వంలోనే ఎక్కువగా జరిగింది. ఇంటర్‌ విద్యాశాఖలోనూ పరీక్షల సమయంలో కీలక అధికారులను మార్చి గందరగోళం చేసింది.

Updated Date - May 27 , 2024 | 04:05 AM