Share News

సమన్వయకర్తలకు సెగ

ABN , Publish Date - Jan 08 , 2024 | 06:02 AM

అధికార వైసీపీ.. కొత్తగా నియమించిన నియోజకవర్గాల ఇన్‌చార్జిలపై అసమ్మతి పెల్లుబుకుతోంది.

సమన్వయకర్తలకు సెగ

ఎస్‌.కోట, అరకు నియోజకవర్గాల్లో మార్చాల్సిందేనంటూ నేతల పట్టు

విశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోనూ అసమ్మతి

ఎండాడ(విశాఖసిటీ)/ప్రత్తిపాడు(గుంటూరు), జనవరి 7: అధికార వైసీపీ.. కొత్తగా నియమించిన నియోజకవర్గాల ఇన్‌చార్జిలపై అసమ్మతి పెల్లుబుకుతోంది. పలు చోట్ల సమన్వయకర్తలను మార్చాల్సిందేనంటూ స్థానిక నాయకులు పట్టుబడుతున్నారు. ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట, అల్లూరి సీతారామరాజుజిల్లా అరకు సమన్వయకర్తలను మార్చాలని డిమాండ్‌ చేస్తూ ఈ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆదివారం విశాఖలోని ఎండాడలో ఉన్న వైసీపీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారు పెద్ద ఎత్తున తరలివచ్చి, నినాదాలతో హోరెత్తించారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు ఈసారి టికెట్‌ ఇవ్వొద్దని అక్కడి నాయకులు డిమాండ్‌ చేశారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ‘గడపగడపకు’ సరిగ్గా నిర్వహించలేదని ఆరోపించారు. ఐప్యాక్‌ టీమ్‌ ఆయన దగ్గర ప్యాకేజీ తీసుకుని తప్పుడు నివేదికలు ఇచ్చిందన్నారు. స్థానికులకే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ మాధవిని(ఈమె సొంతూరు పాడేరు పరిధిలో ఉంది) అరకు అసెంబ్లీ స్థానానికి సమన్వయకర్తగా నియమించడాన్ని అక్కడి నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఐదు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం పలు మండలాల నాయకులు విశాఖ వచ్చి వైసీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ‘మాధవి గో బ్యాక్‌’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వైసీపీ ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డికి అసమ్మతి నాయకులు వినతిపత్రాలు అందజేశారు. విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తానని సుబ్బారెడ్డి వారికి హామీ ఇచ్చారు.

ప్రత్తిపాడులో..

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మాల సామాజిక వర్గం నుంచి వైసీపీకి వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి. వైసీపీలో ఉన్న మాల సంఘం నాయకులు తొలిసారి సమావేశమై తమ భవిష్యత్తుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించే పనిలో పడ్డారు. తొలి నుంచి వైసీపీకి బలంగా ఉన్న ఆ సామాజిక వర్గం ప్రత్తిపాడు ఇన్‌చార్జిగా నియమితులైన బలసాని కిరణ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా గళం విప్పింది. గుంటూరు జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో మాల సంఘం నాయకులు ఆదివారం సమావేశమయ్యారు. ప్రత్తిపాడులో ఎక్కువ శాతం ఓట్లున్న తమ సామాజిక వర్గానికే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన బలసాని నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల మరణించిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వద్దకు వెళ్లిన ఆయన.. అదే రోజు మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జ్ఞాపకార్థ కూటమికి వస్తున్నానని చెప్పి కూడా వెళ్లకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఆయన వద్ద మాదిగలకే ప్రాధాన్యం ఉంటుందని, మాలలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు. రావిపాటివారిపాలెం కమ్యూనిటీ స్థలంలో నివాసం ఉంటున్న మాల సామాజిక వర్గానికి చెందిన గృహాలను కూల్చివేసే ప్రయత్నంలో బలసాని పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. 45వేల ఓట్లు ఉన్న తమకు ఏ పార్టీ ప్రాధాన్యం ఇస్తే వారికే మొగ్గు చూపేందుకు వీరు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మాలల వ్యతిరేకతా రాగంతో ప్రత్తిపాడు వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రత్తిపాడు ఎంపీపీ భర్త చెంచు రామారావుతో పాటు సీనియర్‌ వైసీపీ నాయకుడు వాడపల్లి ఫ్రాన్సిస్‌, నడింపాలెం ఎంపీటీసీ వాసిమళ్ల మాణిక్యరావు, మాజీ ఎంపీటీసీ భాగ్యారావు, మామిడి అశోక్‌, తుమ్మలపాలెం ఎంపీటీసీ భర్త ఏసోబు, కొండేపాడు వైస్‌ ప్రెసిడెంట్‌ మేరిబాబు, నేలపాటి అనిల్‌తో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరు కావడం వైసీపీని కలవరపాటుకు గురిచేసింది.

Updated Date - Jan 08 , 2024 | 06:02 AM