Share News

స్కీం వెనుక స్కాం

ABN , Publish Date - May 05 , 2024 | 03:33 AM

పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోలు వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలే రంగంలోకి దిగారు.

స్కీం వెనుక స్కాం

జగనన్న ఇళ్ల కాలనీల్లో వేల కోట్లు దోపిడీ

  1. పేదల పేరుతో వైసీపీ పెద్దలకు పండగ

  2. స్థలాల కొనుగోలులో కోట్లు కొల్లగొట్టేశారు

  3. పనికిరాని భూములను చౌక ధరకు కొని

  4. ప్రభుత్వానికి 4-5 రెట్లకు అమ్మేశారు

  5. స్థలాల సేకరణకే 55 వేల కోట్లు ఖర్చు

  6. లే అవుట్ల లెవెలింగ్‌కు 33 వేల కోట్లు

  7. ఇందులోనూ కోట్లు కుమ్ముడు

  8. ఇళ్ల నిర్మాణంలోనూ అవినీతి

  • వైసీపీ నేతలకు పండగ

పథకం.. పేదలకు! ఆ పేరుతో కాసుల పండగ మాత్రం అధికార వైసీపీ నేతలకు! జగనన్న ఇళ్ల కాలనీలకు భూసేకరణ పేరిట వేల కోట్లు దోచేశారు. స్థానిక నేతలు.. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై భారీ అవినీతికి పాల్పడ్డారు.

  • కోట్లు కుమ్మేశారు

పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 25,360 ఎకరాల భూములు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.55 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వమే చెబుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి.. వాటిని తిరిగి నాలుగైదు రెట్లు ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేశారు. దళితులు, గిరిజనులను కూడా బెదిరించి వారి భూములను తక్కువ ధరకు కొట్టేశారు.

  • లెవెలింగ్‌లోనూ కుమ్ముడు

భూములను మెరక చేసి (లెవెలింగ్‌) జగనన్న కాలనీలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.33 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇందులోనూ సగానికిపైగా సొమ్మును అధికార పార్టీ నేతలు జేబులో వేసుకున్నారు. మట్టి తరలింపు పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. ఇక ఇళ్ల నిర్మాణంలోనూ కాంట్రాక్టర్లు సొమ్ములు నొక్కేశారు.

  • ఊళ్లకు దూరంగా స్థలాలు..!

చాలాచోట్ల ఊరికి దూరంగా, శ్మశానాలకు దగ్గరగా, లోతట్టు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. నివాస యోగ్యం కానీ చోట ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆవ భూములు, బంక భూములు కూడా కొనుగోలు చేసి పేదలకు అంటగట్టారు. చిన్నపాటి వర్షాలకే జగనన్న లే అవుట్లు చెరువులుగా మారాయి.

పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోలు వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలే రంగంలోకి దిగారు. మరికొన్ని చోట్ల బంధువులు, బినామీలను ముందు పెట్టి వ్యవహారం నడిపించారు. మొదట జనావాసాలకు దూరంగా, నివాసం ఉండటానికి ఏమాత్రం సౌకర్యం లేనిచోట తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ భూములనే జగనన్న కాలనీల కోసం కొనుక్కునేలా అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వానికి భారీ ధరకు అంటకట్టారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల అధికార పార్టీ నేతలు కోట్లు వెనకేసుకున్నారు. జగనన్న కాలనీల లెవెలింగ్‌ పనుల్లోనూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ళ్లు లేని పేదలందరికీ స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు నిర్మిస్తాం. ఒక్కో లబ్ధిదారుడికి 2 నుంచి 5 లక్షల విలువైన ఇంటిని ఆస్తిగా అందజేస్తాం’ అని గత ఎన్నికల ముందు వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో 5 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారు.

మిగిలినవి ఎప్పటికి పూర్తవుతాయో కానీ ఈ పథకం వైసీపీ నేతలకు కల్పవృక్షంలా మారింది. పేదలకు ఇళ్ల స్థలాల సేకరణకు అధికార పార్టీ నేతలు చౌక ధరకు భూములు కొని, ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మి భారీగా సొమ్ము చేసుకున్నారు. ఆ తర్వాత జగనన్న కాలనీల లెవెలింగ్‌ పేరుతోనూ వేల కోట్లు దండుకున్నారు.

భూముల కొనుగోలు, లెవలింగ్‌ పనులకు ప్రభుత్వం దాదాపు 83 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకం వల్ల పేదలకు కలిగిన ప్రయోజనం అంతంతే. వైసీపీ నేతలు మాత్రం కోట్లు కొల్లగొట్టారు. నివాస యోగ్యం కానీ చోట స్థలాలు ఇవ్వడంతో చాలాచోట్ల పేదలు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్ల పట్టాలను ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేశారు. 15 వేలకు పైగా జగనన్న కాలనీలను ఏర్పాటు చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. చాలా చోట్ల మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు.


  • అస్మదీయులకే కాంట్రాక్టులు

ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టుల్లోనూ అధికార పార్టీ నేతలు దోచుకున్నారు. ఆప్షన్‌-3 ఇళ్లను ప్రభుత్వం నిర్మించకుండా అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బంధువులు, అనుచరులు డైరెక్టర్లుగా ఉన్న రాక్రీట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు 52,262 ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును అప్పగించారు.

జేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు 78,065 ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును ఇచ్చారు. దాదాపు 1500 కోట్ల విలువైన పనులను ఈ ఒక్క సంస్థకే కట్టబెట్టారు. దీనివెనుక రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో పని చేసిన ఒక అఖిల భారత సర్వీస్‌ అధికారి చక్రం తిప్పినట్లు సమాచారం.

ఇక అజాయా వెంచర్స్‌కు 23,571 ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును కట్టబెట్టారు. రాష్ట్రంలో ఆప్షన్‌-3 కింద నిర్మించాల్సిన ఇళ్లలో సగానికిపైగా కాంట్రాక్టులను ఈ మూడు సంస్థలకే ఇవ్వడం వెనుక లోపాయికారీ ఒప్పందాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మూడు సంస్థలతోపాటు జిల్లాలవారీగా కావాల్సిన వారికి కాంట్రాక్టులు ఇచ్చారు.

గృహ నిర్మాణ శాఖలో పని చేస్తున్న కొంతమంది అధికారులు కూడా తమ సమీప బంధువులను కాంట్రాక్టర్లుగా రంగంలోకి దింపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టకుండానే అడ్వాన్సుల రూపంలో రూ.కోట్ల ప్రజాధనాన్ని దోచేశారు.

ఒక్కో ఇంటి పునాదికి రూ.70 వేలు చొప్పున మొత్తం 3.50 లక్షల ఇళ్లకు అడ్వాన్సులు ఇచ్చారు. ఒక్కో ఇంటికి 342 కేజీల స్టీలు, 40 బస్తాల సిమెంట్‌ చొప్పున లక్షలాది టన్నుల స్టీలు, సిమెంటుతోపాటు ఉచితంగా ఇసుకను కూడా కాంట్రాక్టర్లకు సరఫరా చేశారు. దీనికి ప్రతిఫలంగా అధికారులు కమీషన్లు దండుకున్నారు. అడ్వాన్స్‌లు తీసుకున్న కాంట్రాక్టర్లు నామ్‌ కే వాస్తీగా పనులు చేపట్టారు. సిమెంటు, స్టీలు అమ్మేసుకుని కోట్లు కొల్లగొట్టారు.

  • అధికారులు, నేతలు కుమ్మక్కై..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగనన్న కాలనీలకు ఇళ్ల స్థలాల సేకరణలో అప్పటి రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ నేతలు కలసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు.

జక్కులనెక్కలం గ్రామంలో గతంలో దళిత వర్గాలకు అసైన్డ్‌ పట్టాలుగా ఇచ్చిన 7 ఎకరాలను రూ.20 లక్షల చొప్పున బినామీ వ్యక్తుల పేరుతో కొనుగోలు చేసి.. రూ.65 లక్షల చొప్పున ప్రభుత్వానికి విక్రయించారు. రెవెన్యూ అధికారులే దళారుల అవతారం ఎత్తి బినామీ పేర్లతో వ్యవహారం నడిపించారు. వైసీపీ నేతలతో కలసి లక్షల రూపాయలు ఆర్జించారు.

అలాగే బల్లిపర్రు గ్రామంలో రైతులను బెదిరించి 3 ఎకరాల అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి కూతవేటు దూరంలోని కేసరపల్లిలో ఎందుకూ పనికిరాని ముంపు ప్రాంతానికి చెందిన భూములను ఎకరం రూ.75 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో భారీఎత్తున అవినీతి జరిగిందని అప్పట్లో కలెక్టర్‌కు ఫిర్యాదులు వచ్చాయి.

  • రాక్రీట్‌ సంస్థపై కేసు

విజయవాడలోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన నున్న మోడల్‌ లే అవుట్‌లో ప్రభుత్వం తరఫున 600 ఇళ్లు కట్టించేందుకు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి బంధువులకు చెందిన రాక్రీట్‌ సంస్థ పనులను దక్కించుకుంది.

కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై కింద అందించే రూ.1.80 లక్షలు కాకుండా అదనంగా లబ్ధిదారుడు రూ.35 వేలు చెల్లించే పద్ధతిలో ఒప్పందం కుదిరింది. లబ్ధిదారుడి తరఫున జిల్లా యంత్రాంగం బ్యాంకు ద్వారా రుణాలిప్పించింది. ఈ రుణాన్ని నేరుగా కాంట్రాక్టు సంస్థ తీసుకునే అవకాశాన్ని కల్పించింది.

ఆ డబ్బులను తీసేసుకున్న కాంట్రాక్టు సంస్థ కేవలం బేస్‌మెంట్‌ పనులు చేసి వెళ్లిపోయింది. తీసుకున్న అప్పులకు లబ్ధిదారులు వడ్డీలు కట్టాల్సి వస్తోంది. రాక్రీట్‌ సంస్థ మోసాలపై ఆటోనగర్‌ పోలీసు స్టేషన్‌లో లబ్ధిదారులు కేసు పెట్టారు. ఈ కేసుపై ఎలాంటి పురోగతి లేదు.


  • ఆవ భూముల్లో కోట్లు దోపిడీ

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడిలో ఎకరా రూ.30 లక్షలు కూడా చేయని ఆవ భూములను రూ.45 నుంచి రూ.60 లక్షల ధరకు సుమారు 600 ఎకరాలు కొనుగోలు చేశారు. వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు దోచుకున్నారు.

స్థానిక నేతలు రాష్ట్రస్థాయి నేతలతో కుమ్మక్కై ఈ వ్యవహారం నడిపారు. అప్పట్లో ఇది సంచలనమైంది. రాజమండ్రి అర్బన్‌ పేదల కోసం రాజానగరం మండలం కానవరంలో 100 ఎకరాలు సేకరించారు. ఎకరం రూ.66 లక్షలకు కొనుగోలు చేశారు.

అందులో 60 లక్షలు భూమి యజమానికి ఇచ్చి, వైసీపీ, రెవెన్యూ అధికారులు రూ.6 లక్షలు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ లేఅవుట్లు కూడా వేయలేదు.

ఇంకా పొలాలుగానే ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ముందు సుమారు 10 వేలమందికి పట్టాలు పంచేశారు. వారికి స్థలాలు మాత్రం చూపించలేదు.

  • గిరిజన భూముల్ని చౌకగా కొని..

విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని రామన్నదొరవలస సమీపంలో గిరిజనులకు చెందిన 20ఎకరాల అసైన్డ్‌ భూములను ఓ వైసీపీ నాయకుడు ముందుగానే అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. తరువాత ఆ భూములను జగనన్న కాలనీ కోసం ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మేశారు.

ఆయన లక్షలాది రూపాయలు వెనకేసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు లోకాయుక్తలో కేసు వేశారు. ప్రస్తుతం కేసు నడుస్తోంది.

  • మెరక పనుల్లోనూ మేత

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష్మీపురం, పోణంగి, పాలగూడెం ప్రాంతాల్లో భూముల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.

లక్ష్మీపురంలో మార్కెట్‌ రేటు కన్నా ఎక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారని అప్పట్లో ప్రతిపక్ష నాయకులు ఆందోళనలు చేశారు. లక్ష్మీపురం, పోణంగిలో మెరక పనులకు సంబంధించి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అధికారులు అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

  • నివాసయోగ్యం కాకున్నా...

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రామేశ్వరం, బొల్లవరం, మీనాపురం గ్రామాల్లో రూ.167 కోట్లు వెచ్చించి రైతుల నుంచి 478.67 ఎకరాలను కొన్నారు. మీనాపురంలో తప్ప రామేశ్వరం, బొల్లవరం గ్రామాలలో సేకరించిన భూములు నివాసయోగ్యమైనవి కావు.

వైసీపీ నేతలు బినామీల పేరిట భూములు కొనుగోలుచేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఇందులో చాలావరకు చుక్కల భూములు, నల్లరేగడి బంక భూములు ఉన్నాయి. భూసేకరణ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు కోట్లు దోచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - May 05 , 2024 | 06:20 AM