Share News

మాస్టారి ప్రాణం నిలపండి!

ABN , Publish Date - Nov 13 , 2024 | 04:59 AM

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని డ్రైవర్స్‌ కాలనీకి చెందిన సత్య వరప్రసాద్‌ అనే ఉపాధ్యాయుడు..

మాస్టారి ప్రాణం నిలపండి!

రెండుసార్లు కొవిడ్‌తో దెబ్బతిన్న ఊపిరితిత్తులు

ఏడాదిగా జీతం లేని సెలవులు

వైద్యం కోసం సాయం అర్థిస్తున్న కుటుంబం

ఉరవకొండ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని డ్రైవర్స్‌ కాలనీకి చెందిన సత్య వరప్రసాద్‌ అనే ఉపాధ్యాయుడు.. విడపనకల్లు మండలం పాల్తూరు ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేసేవారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం తొలిసారి కొవిడ్‌ బారిన పడ్డారు. తీవ్ర అనారోగ్యం పాలవడంతో అప్పట్లో ఆర్డీటీ ఆస్పత్రితోపాటు, బెంగళూరులోనూ వెంటిలేటర్ల మీద చికిత్స పొందారు. ఎలాగొలా మహమ్మారి వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఆరోగ్యం కుదుటపడిందని అనుకుంటున్న సమయంలో... సత్య వరప్రసాద్‌కు మరోమారు కొవిడ్‌ సోకింది. రెండోసారి వైరస్‌ బారిన పడటంతో ఆయన ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. పల్మనరీ ఫైబ్రోసిస్‌ అనే వ్యాధి సోకింది. బీఐపీఏపీ యంత్రంపై ఆధారపడి ప్రాణాలు నిలుపుకోవాల్సిన పరిస్థితి. రెండేళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన.. ఏడాదిగా జీతాలు లేని సెలవులో కొనసాగుతున్నారు. వైద్యం చేయించేందుకు ఆయన కుటుంబసభ్యులు ఆస్తులమ్మి రూ.25 లక్షలవరకూ ఖర్చు పెట్టారు. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. ప్రస్తుతం వరప్రసాద్‌ బెంగళూరులోని ఓ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

కష్టాల కడలిలో ఉన్నాం.. ఆదుకోండి

ఇంటి వద్ద ఉంటూ వైద్యం చేయించుకుంటేనే నెలకు రూ.20 వేలకు పైగా ఖర్చు అవుతోంది. దీనికి తోడు ఇప్పుడు ఆస్పత్రి ఖర్చును భరించలేకున్నాం. ఏడాదిగా జీతం రావడం లేదు. వైద్యం కోసం ఉన్న ఆస్తులను అమ్మేశాం. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం, దాతలు మాకు అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నాం.

- సత్యవరప్రసాద్‌ భార్య మధు

Updated Date - Nov 13 , 2024 | 04:59 AM