Share News

నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:11 AM

శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
విద్యుత్‌ దీపకాంతుల్లో ఆలయం

శ్రీశైలం, జనవరి 11 : శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. పంచాహ్నికదీక్షతో ఏడురోజులపాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18న ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని, ప్రధాన వీధులను విద్యుత్‌ దీపాలతో ముస్తాబు చేశారు. అలాగే బ్రహ్మోత్సవాలకు భక్తులకు స్వాగతం పలుకుతూ శ్రీశైలం ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు రహదారి మార్గంలో స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు. 12 వ తేదీ శుక్రవారం ఉదయం 8.30 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 13వ తేదీన భృంగివాహనసేవ, 14న రావణవాహనసేవ, 15వ తేదీ మకరసంక్రాంతి పర్వదినం రోజున నందివాహనసేవ, స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం, 16వ తేదీన కైలాసవాహనసేవ, 17 వతేదీన యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, సదస్యం, నాగవల్లి, ధ్వజావరోణ కార్యక్రమాలు, 18 వ తేదీన రాత్రి జరిగే పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12 నుంచి 18 వరకు ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్షసేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం, స్వామి, అమ్మవార్ల కల్యాణం, ఏకాంతసేవలను నిలుపుదల చేశారు.

Updated Date - Jan 12 , 2024 | 12:11 AM