పోలీసు అమర వీరులకు వందనం
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:52 PM
శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో పోలీసులది కీలక పాత్ర.
శాంతి భద్రతల పర్యవేక్షణలో వారే కీలకం
ఒత్తిడితో సతమతమవుతున్న పోలీసులు
నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
ఆత్మకూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో పోలీసులది కీలక పాత్ర. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రజలకు రక్షణ కల్పించడంలో ముందుండేది పోలీసులే. విధి నిర్వహణలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వారి సేవలను స్మరించుకునేందుకు ప్రతిఏటా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏడు రోజుల పాటు సాగే ఈ వారోత్సవాలు ప్రతిరోజూ వివిధ కార్యక్రమాల ద్వారా పోలీసు సేవలను ప్రజలకు వివరించడమే కాకుండా సామాజిక స్పృహనును ప్రతిబింబించే రీతిలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వర్తించనున్నారు. అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించి విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసులకు నివాళి అర్పిస్తారు.
ఎప్పుడు పోలీసు అమరవీరుల దినం :
ప్రతి ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. భారత, చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో గల హాట్ స్ర్పింగ్స్ అనే ప్రదేశంలో 1959 అక్టోబరు 21న చైనా సైనికులు దాడి చేసిన సంఘటనలో పది మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు నేలకొరిగారు. వారి మృతదేహాలను సొంత ప్రాంతాలకు తరలించలేని పరిస్థితి ఏర్పడి అక్కడే ఖననం చేశారు. అప్పటి నుంచి వారిని స్మరించుకుంటూ ప్రతి యేటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. వారం రోజుల పాటు సాగే పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని నంద్యాల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన పోలీసు సబ్‌డివిజన్లలోని 42 పోలీసుస్టేషన్లలో పోలీసు సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించారు.
కత్తిమీద సాములా పోలీసు డ్యూటీ :
పోలీసులు తమ డ్యూటీలు నిర్వహించడం కత్తిమీద సాములా మారుతోంది. సెలవులు లభించక నిత్యం ఒత్తిళ్లతో విధులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం వారాంతపు సెలవు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు శాఖలో ఎన్నో ఏళ్లుగా సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఆ దిశగా పాలక ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా చేయాల్సిన డ్యూటీలను పక్కన బెట్టి అవసరం లేకున్నా కూడా రాజకీయ నాయకుల సభలు, సమావేశాలు, ఇతరత్రా అవసరాలకు పోలీసులను బందోబస్తుగా వాడుకుంటున్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. ఇదిలాఉంటే పోలీసు శాఖ నుంచి సరైన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో స్టేషన ఖర్చుల కోసం ఫిర్యాదిదారుల వద్ద చేయి చాచాల్సిన దుస్థితి నెలకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలావుంటే ఇటీవల కాలంలో పోలీసు అధికారుల బదిలీల్లో కూడా రాజకీయ జోక్యం అధికమవడంతో నిక్కచ్చిగా పనిచేసే పోలీసు అధికారులు సైతం రాజకీయ నాయకుల చేతుల్లో కీలు బొమ్మల్లా మార్చాల్సిన దుస్థితి దాపురించింది. అయితే విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు తగిన సహాయం అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ అమరవీరుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం - ఆర్.రామాంజీనాయక్, ఆత్మకూరు డీఎస్పీ
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం. వారి ఆశయ సాధనకు మేమందరం కృషిచేస్తాం. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ వివిధ సామాజిక కార్యక్రమాలను నిర్వహించి పోలీసు సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. కాగా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములైనప్పుడే పోలీసు వ్యవస్థ మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది. అలాగే పోలీసు అమరవీరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఎలాంటి విఘాతం తలెత్తకుండా ప్రజలకు రక్షణగా నిలిచి పోలీసుశాఖ మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాం.