Share News

‘బంగారు’ బాటలో ముడుపులు

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:36 AM

అది ఒక మద్యం తయారీ కంపెనీ. ఏపీ, తెలంగాణలో ఎక్కువగా అమ్ముడయ్యే ఓ ప్రముఖ బ్రాండు మద్యాన్ని తయారుచేస్తుంటుంది.

‘బంగారు’ బాటలో ముడుపులు

ఏపీలో నాయకులకు, తెలంగాణలో అధికారులకు

లంచాలివ్వడంలో ఓ డిస్టిలరీ కొత్త పుంత

షాపుల నుంచి బంగారం కొన్నట్లు రికార్డుల సృష్టి

ఆయా దుకాణాలకు చెక్కులు ఇచ్చి.. నగదుగా వెనక్కి!

చెక్కులను నగదుగా మార్చినందుకు 6ు కమీషన్‌

మిగతా సొమ్ము నేతలు, అధికారులకు లంచం

కొన్న బంగారాన్ని డీలర్లకు గిఫ్ట్‌గా ఇచ్చినట్టు రికార్డులు

ఇలా ఒక్క ఏడాదిలో రూ.360 కోట్ల లావాదేవీలు

నగల దుకాణ యజమానులకు ఇచ్చిన కమీషన్‌ పోను

నాయకులు, అధికారులకు రూ.340 కోట్ల సమర్పణ

అధిక భాగం ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ‘బిగ్‌షాట్‌’కే!

తెలంగాణలో అధికారులకు ముట్టింది 15 కోట్లే

ఓ అధికారి భార్య ఆస్పత్రి పెట్టుకోవడానికి ‘సర్దుబాటు’

ఐటీ అధికారుల దాడులతో వెలుగులోకి దందా

హైదరాబాద్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): అది ఒక మద్యం తయారీ కంపెనీ. ఏపీ, తెలంగాణలో ఎక్కువగా అమ్ముడయ్యే ఓ ప్రముఖ బ్రాండు మద్యాన్ని తయారుచేస్తుంటుంది. ఆ కంపెనీకి సంగారెడ్డిలో, మహారాష్ట్రలో తయారీప్లాంట్లు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వాలదే గుత్తాధిపత్యం ఉన్న నేపథ్యంలో.. కంపెనీలన్నీ రాజకీయ నాయకత్వాలకు, కొన్నిచోట్ల అధికారులకు ముడుపులు.. అదీ నగదు రూపంలోనే ముట్టజెప్పాల్సి వస్తోంది. ఈ క్రమంలో సదరు డిస్టిలరీ యాజమాన్యం.. నాయకులకు, అధికారులకు లంచాలు ఇవ్వడంకోసం ఓ సరికొత్త అక్రమానికి తెరతీసింది! అందుకు ఆ సంస్థ ఎంచుకున్న మార్గం.. బంగారం దుకాణాలు. జ్యువెలరీ షాపులకు కమీషన్లను ఎరచూపి.. ఏడాదిలో రూ.340 కోట్ల మేర ముడుపులను డబ్బు రూపంలో నాయకులు, అధికారులకు సమర్పించుకుంది. ఈ ముడుపుల్లో ఎక్కువ భాగం ఏపీలోని ఒక ‘బిగ్‌ షాట్‌’కు ముట్టినట్లు సమాచారం. తెలంగాణలోని ఇద్దరు కీలక అధికారులకు రూ.15 కోట్లకుపైగా అందినట్లు తెలిసింది. ఒక అధికారి భార్య ఆస్పత్రి పెట్టుకోవడానికి కూడా డబ్బును సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ డిస్టిలరీ యాజమాన్యం నుంచి ఆమ్యామ్యాలు పుచ్చుకున్న ఆ ‘లంచావతారాలు’ ఎవరు? దీనికి ఇంకా లింకులున్నాయా? అనే కోణంలో కేంద్ర దర్యాప్తు బృందాలు కూపీ లాగుతున్నాయి. మద్యాన్ని తయారు చేసే ఆ డిస్టిలరీ.. రెండు తెలుగు రాష్ట్రాలకూ నెలకు 4లక్షల కేసుల(ఒక్కో కేసులో 12ఫుల్‌ బాటిళ్లు ఉంటాయి) మద్యాన్ని సరఫరా చేస్తుంటుంది. ఇందులో 3 లక్షల కేసులను ఏపీకి, లక్ష కేసులను తెలంగాణకు సరఫరా చేస్తోంది. తమ కంపెనీ సరుకును ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో కొనేలా చేసేందుకు నాయకులు, అధికారులకు లంచాలు ఇస్తూ వస్తోంది. ముడుపుగా ఇవ్వాల్సిన నగదును సమకూర్చుకోవడానికి డిస్టిలరీ యాజమాన్యం కొన్ని జ్యువెలరీ షాపులతో కుమ్మక్కయింది. వారికి చెక్కులు ఇచ్చి.. బంగారాన్ని కొనుగోలు చేసినట్లు.. కొన్న బంగారాన్ని తమ డీలర్లకు నజరానాగా ఇచ్చినట్లు ఉత్తుత్తి రికార్డులను సృష్టించింది. కానీ వాస్తవంగా.. వారివద్ద ఎలాంటి నగలనూ కొనుగోలు చేయలేదు. నగల దుకాణాలవారు ఆ చెక్కులను బ్యాంకుల్లో వేసి.. వచ్చిన నగదును వచ్చినట్టే డిస్టిలరీ యాజమాన్యానికి అప్పగించారు. ఈ లావాదేవీలు చేసిపెట్టినందుకుగాను వారినుంచి 6ు కమీషన్‌ పుచ్చుకున్నారు. ఈ దందాలో మద్యం కంపెనీకి హైదరాబాద్‌లోని నాలుగు జ్యువెలరీ షాపులు, ముంబైలోని కొన్ని షాపులు సహకరించినట్టు సమాచారం. ఏడాది వ్యవధిలో రూ.360 కోట్ల విలువైన లావాదేవీలు జరగ్గా అందులో దుకాణాల వారికి ఇచ్చిన కమీషన్‌ పోను దాదాపు రూ.340కోట్లు రాజకీయ నాయకులకు, అధికారులకే ముట్టజెప్పినట్లు తెలిసింది.

Updated Date - Mar 09 , 2024 | 07:11 AM