Share News

ఎస్‌.. నేను పశుపతినే!

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:09 AM

‘సీఎం జగన్‌ నిన్న నన్నో మాట అన్నారు. నన్ను పశుపతి అని సంభోదించారు. ఆ మాట విని నవ్వుకున్నాను. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమశివుడు.

ఎస్‌.. నేను పశుపతినే!

గరళాన్ని మింగిన శివుడి అవతారమెత్తా

రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

అవమానాలైనా భరిస్తా.. ప్రజాగళంలో బాబు

అమలాపురం/కాకినాడ-ఆంధ్రజ్యోతి/రావులపాలెం, ఏప్రిల్‌ 3: ‘సీఎం జగన్‌ నిన్న నన్నో మాట అన్నారు. నన్ను పశుపతి అని సంభోదించారు. ఆ మాట విని నవ్వుకున్నాను. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమశివుడు. గరళాన్ని గొంతులో పెట్టుకుని మానవాళిని కాపాడాడు. అందుకే నేను శివావతారం ఎత్తాను’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బుధవారం సాయంత్రం కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో, రాత్రికి రామచంద్రపురం ద్రాక్షారామలో జరిగిన ప్రజాగళం సభల్లో పాల్గొన్నారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఎన్ని అవమానాలైనా భరిస్తానని చెప్పారు. రాష్ట్రం లో జగన్‌రెడ్డి ఒక్కడే బాగుంటే చాలు.. ఇంకా ఎవ్వరూ బాగుపడకూడదనేది ఆయన ఉద్దేశమని ఆక్షేపించారు. 2014లో తండ్రి మరణాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయం చేశాడని.. 2019లో బాబాయి హత్యను రాజకీయం చేశాడని.. ఇప్పుడేమో వృద్ధుల పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. బాబాయిని హత్య చేసిన హంతకులెవరో చెప్పి జగన్‌ ఓట్లడగాలని డిమాండ్‌ చేశారు. గొడ్డలి గుర్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీచేయాలని ఎద్దేవాచేశారు. జగన్‌ చర్యలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందన్నారు. ఫేక్‌ ప్రచారాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వకుండా వేధిస్తున్నాడని విమర్శించారు. ఐదేళ్లలో ఎన్నో దాడులు, ఎన్నెన్నో దోపిడీలు చేశారని ధ్వజమెత్తారు. తనతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై కూడా ఎన్నో ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురిచేశారని.. అయి నా తాము భయపడలేదని.. అరెస్టులకు కూడా సిద్ధపడ్డామని చెప్పారు.

తొలి సంతకం మెగా డీఎస్సీపైనే...

రాష్ట్రంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేని అసమర్థ సీఎం ఈ జగన్‌. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీ నిర్వహణపైనే. ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది(జాబు రావాలంటే బాబు రావాలని జనం నినదించారు). నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి ఇస్తాం. రైతులను ఆదుకుంటాం. విద్యుత్‌ చార్జీలు పెంచం. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా వారికి ఒక్కొక్కరికి రూ.15 వేలు వంతున ఇస్తాం. మహిళలకు ఏడాది మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఈ 40 రోజులూ మీరు కష్టించాలి. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలో టీడీపీ కూటమి అభ్యర్ధులను గెలిపించాలి. జగన్‌ జైలుకు పోతాడో.. ఆస్పత్రికి వెళ్తాడో ఇంకా తెలియదు. సైకో పోవాలని అందరూ అంటున్నారు. ఈ ఐదేళ్లలో ఎవరినీ ప్రశాంతంగా బతకనివ్వలేదు. నాకు గోదావరి జిల్లాలంటే ఇష్టం. ఈ ప్రాంతంలో రెడ్లు కూడా ఉన్నారు. వారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో పనులు చేశారు. వారెవరికైనా బిల్లులు వచ్చాయా? ఆక్వా రంగం కుదేలైంది. జగన్‌ విధానాలతో మేత, విద్యుత్‌ రేట్లు పెరిగాయి. మేమొచ్చాక ఈ రంగానికి రూ.1.50కే విద్యుత్‌ సరఫరా చేస్తాం. నా బీసీలంటూ 30 పథకాలను నిలిపివేశారు. కోనసీమ జిల్లాలో అంబేడ్కర్‌కే అవమానం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై ఎన్నో దాడులు జరిగాయి. దళితుడిని చంపి డోర్‌ డెలివరీ చేసిన వ్యక్తి ఎమ్మెల్సీ అనంతబాబు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు ఏమయ్యాయి? కాపులకు జగన్‌రెడ్డి ప్రభుత్వంలో తీరని అన్యాయం జరిగింది. వారి కోసం ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తానన్నాడు. చేశాడా? కనీసం పది కోట్లయినా ఇచ్చాడా? నేను అఽధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి రూ.1,000 కోట్లు కేటాయించాను. కాపుల్లో పేద వర్గాలకు న్యాయం చేసింది మేమే. మాదిగలకు న్యాయం చేసేలా ఆ సామాజికవర్గానికి ఎమ్మెల్సీ ఇస్తాం. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి పొలిట్‌బ్యూరో పదవి ఇచ్చాం.

పిల్లల జీవితాలతో ఆటలు..

గంజాయి, డ్రగ్స్‌కు రాష్ట్రాన్ని బలిచేస్తారా? మన పిల్లల జీవితాలతో ఆటలు ఆడుకునే పరమదుర్మార్గులు వీరు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడితే పిల్లలు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండరన్నదే నా బాధ. రావులపాలెంలో ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతోంది. ఈ వ్యాపారంలో కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పాత్ర ఉంది. మేమొచ్చాక ఏపీని డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మారుస్తా. మద్య నిషేధం చేస్తానని ఐదేళ్ల క్రితం హామీ ఇచ్చి జగన్‌ మహిళలను మోసం చేశాడు. నాణ్యత లేని మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నాడు. ప్రజాగళం సభల కు ఎక్కడ చూసినా మహా స్పందన. గెలుపు మనదే.. ఆకలి మీద సింహం వేట కోసం ఎలా వేచి చూస్తుందో నేడు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు టీడీపీ-జనసేన-బీజేపీ ఒక జట్టుగా మీ ముందుకొచ్చాం. రాష్ట్రాన్ని దొంగలపరం చేస్తారో.. కాపాడుకుంటారో మీ ఇష్టం.

ఫ్యాన్‌ అరిగిపోయి.. తిరగడం మానేసింది

వైసీపీ ఫ్యాన్‌ అరిగిపోయింది.. తిరగడం మానేసింది. ముక్కలు ముక్కలు చేసి ప్రజలు దాన్ని చెత్త బుట్టలో పడేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్‌ చరిత్ర తెలియని ఓ బచ్చా. ఆయనది ఫేక్‌ బతుకు. బాబాయిని హత్య చేసిందెవరో చెప్పి ఓట్లడగాలి. మద్యనిషేధం చేయకపోతే ఓట్లు అడగనని చెప్పి.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు? జగన్‌ లిక్కర్‌ మాఫియా డాన్‌, ఇసుక మాఫియా డాన్‌. అధికారంలోకి వచ్చాక అన్నీ కక్కిస్తాం. మాట్లాడితే బటన్‌ నొక్కుతున్నా అంటున్నాడు. ప్రధాని మోదీ కూడా బటన్‌ నొక్కుతున్నారు. అప్పులు తెచ్చి పంచా పంచా అంటున్నావు. ఏం పంచావు? ఇప్పుడు పంచె కూడా ఉండదు. కర్నూలులో అయితే అక్కడి జనం వారానికోసారి స్నానాలు చేస్తున్నారు. పెళ్లి ళ్లు వాయిదా పడుతున్నాయి. మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపులు లేవు. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికతో జగన్‌కు భయం పట్టుకుంది. రోజూ మమ్మల్ని తల్చుకుని భయపడుతున్నాడు. ప్రతి ఒక్కరే ఎన్నికల య్యే వరకు సైకిల్‌ ఎక్కండి. గ్లాసు పట్టుకోండి. కమలం గుర్తును వాహనాలకు కట్టుకోండి. వైసీపీని బంగాళాఖాతంలో కలపాలి.

నేడు కొవ్వూరు, నల్లజర్లల్లో సభలు

చంద్రబాబు గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నా రు. సాయంత్రం 4 గంటలకు కొవ్వూరులో, 6 గంటలకు గోపాలపురం నియోజకవర్గ పరిధి నల్లజర్లలో జరిగే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు.

Updated Date - Apr 04 , 2024 | 05:09 AM